Published : 10/03/2023 17:16 IST

ఇంకా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తున్నారా?

వయసుకు తగ్గ మానసిక పరిణతి ఉన్నప్పుడే.. చుట్టూ ఉన్న వ్యక్తుల్నీ అర్థం చేసుకోగలం.. పరిణతితో కూడిన ఆలోచనలూ చేయగలం! అయితే కొంతమంది వయసు పెరిగినా.. ఇంకా చిన్నపిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు.. ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లను చూసి.. ‘ఇంత వయసొచ్చినా నీలో చిన్నపిల్ల లక్షణాలు మాత్రం పోలేదు..’ అనడం వింటుంటాం. నిజానికి ఇలా మానసిక పరిణతిలో లోపం వల్ల వ్యక్తిగతంగానే కాదు.. సామాజిక పరంగానూ పలు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అందుకే దీనికి సంబంధించిన లక్షణాల్ని త్వరగా గుర్తించి పరిష్కరించుకోవడం మేలంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ప్రవర్తనతోనే తెలిసిపోతుందట!

కొంతమందికి ఎక్కడ ఏం మాట్లాడో తెలియదు.. సీరియస్‌గా ఉండాల్సిన విషయాల్లో జోక్స్‌ వేయడం, సరదాగా ఉండాల్సిన విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఈ తరహా ప్రవర్తన మానసిక పరిణతి లోపానికి మొదటి సూచన అంటున్నారు నిపుణులు.

సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. అయితే ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి తగ్గ పరిష్కార మార్గం కూడా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. పరిణతితో ఆలోచించేవారు ఈ మార్గాన్ని వెతికే పనిలో ఉంటారని, అదే మానసిక పరిపక్వత లేని వారు వాటిని ఎదుర్కోలేక తప్పుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల’న్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. అంటే తప్పొప్పులతో ప్రమేయం లేకుండా అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలని, ఆరు నూరైనా రాజీ పడే ప్రసక్తే లేదన్నది వారి అభిప్రాయం. మానసిక పరిణతి లేనివారే ఇలా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు నిపుణులు.

కొంతమంది ఆలోచనల నుంచి ఆచరణ దాకా ప్రతి విషయంలోనూ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటారు. మానసిక పరిణతి లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రవర్తన వల్ల అనుబంధాల్లో భేదాభిప్రాయాలు తలెత్తి ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదమూ ఉందంటున్నారు.

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. అయితే వయసుకు తగ్గ మానసిక పరిణతి సాధించిన జంటల్లో ఇలాంటి పొరపచ్ఛాలు ఇట్టే పరిష్కారమవుతాయి. అదే పరిణతి లేని వారు.. ఎదుటివారి మనసును అర్థం చేసుకోకుండా, తప్పొప్పుల్ని విచారించకుండా మొండిగా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ గొడవను మరింత పెద్దది చేసుకుంటారని చెబుతున్నారు నిపుణులు.

అతిగా ప్రతిస్పందించడం కూడా మానసిక పరిణతి లోపానికి ఓ సూచన అంటున్నారు నిపుణులు. ఇలాంటి వారు ఆనందమొచ్చినా, కష్టమొచ్చినా ఆపుకోలేరు.. ఎదుటివారి ఫీలింగ్స్‌తో సంబంధం లేకుండా తమ భావోద్వేగాల్ని వ్యక్తపరుస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన ఒక్కోసారి ఎదుటివారికి చిరాకు కలిగిస్తుంటుంది.

మానసిక పరిణతి లేని వారు ఏది జరిగినా అది తమ వల్లే అన్న ఆలోచనలో ఉంటారట! ఉదాహరణకు.. ప్రేమలో విఫలమైతే.. తాను ఎదుటివ్యక్తికి నచ్చలేదని, పొరపాట్లన్నీ తనవేనని మనసు మీదికి తీసుకొని మరీ ఆత్మన్యూనతకు, అభద్రతా భావానికి లోనవుతుంటారట!

తాము తప్పు చేసినా ఒప్పుకోరు కొందరు. ఎదుటివారిదే పొరపాటు అని ఎలాగోలా నిరూపించాలని చూస్తుంటారు. మానసికంగా పరిణతి చెందకుండా చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించే వారే ఎక్కువగా ఇలా చేస్తుంటారని అంటున్నారు నిపుణులు.

తమలో ఎన్నో భావాలుంటాయి.. కానీ వాటిని ఎవరితో, ఎలా పంచుకోవాలో తెలియదు. మానసిక పరిణతి లేనివారిలో ఇలాంటి లక్షణం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అయితే దీనివల్ల కమ్యూనికేషన్‌ లోపం ఏర్పడి.. సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు.

మానసికంగా పరిణతి చెందని వారు ఎదుటివారిని సులభంగా విమర్శించగలుగుతారట! ఇలా వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటాయంటున్నారు నిపుణులు.

సాధారణంగా వయసుకు తగ్గ మానసిక పరిణతి ఉన్నప్పుడు.. మనకు సంబంధించిన విషయాల్లో మనమే నిర్ణయం తీసుకోగలుగుతాం.. స్వీయ ఆలోచనలు చేయగలుగుతాం. కానీ పరిణతి లోపించిన వారు ఆలోచనల దగ్గర్నుంచి నిర్ణయాల దాకా ఇతరుల పైనే ఆధారపడతారట! పైగా స్వీయ నమ్మకాన్ని పక్కన పెట్టి.. ఎప్పుడూ ఎదుటివారి సపోర్ట్‌నే కోరుకుంటారట!


పరిష్కారం.. మన చేతుల్లోనే!

ఎలా చూసినా మానసిక పరిణతి లేకపోవడమనేది మన వ్యక్తిగత, సామాజిక, కుటుంబ అనుబంధాలు, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విషయం స్పష్టమవుతోంది. అయితే మనలో ఉన్న ఇలాంటి లోపాల్ని సవరించుకుంటూ ముందుకెళ్తే.. మనల్ని మనం సులభంగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

ముందుగా మన భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం మానేసి.. అందులోని తర్కమేంటో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నేర్పును పెంచుకోవాలి.

స్వీయ ప్రేమను పెంచుకోవడం వల్ల మనలోని భావోద్వేగాలు, ఒత్తిళ్లు అదుపులో ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు.. అన్న విషయాల్లోనూ అవగాహన వస్తుంది. తద్వారా పరిణతితో ఆలోచించగలుగుతాం.

పరిణతి లేకపోవడం వల్ల ఎదురైన కమ్యూనికేషన్‌ లోపాన్ని.. ఇదే కమ్యూనికేషన్‌తో పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ మనసులో ఏ భావన, ఆలోచనలున్నా ఎదుటివారితో/భాగస్వామితో పంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఇదే మిమ్మల్ని పరిణతితో ఆలోచించేలా చేస్తుంది.

ఎప్పుడూ మీ మాటే నెగ్గాలన్న పంతం పక్కన పెట్టి.. ఎదుటివారి మాటలూ వినే ప్రయత్నం చేయండి.. అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఆలోచించగలిగితే క్రమంగా మానసిక పరిణతిని సాధించచ్చంటున్నారు నిపుణులు.

తప్పో ఒప్పో.. మీకు సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఎన్నో విషయాలు మీకు అవగతమవుతాయి.. మంచీ చెడులు తెలుస్తాయి. మానసిక పరిణతిని పెంచుకోవడానికి ఇది మరో మెట్టు.

సానుకూల ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచుతాయి. అందుకే ఏ విషయాన్నైనా ప్రతికూలంగా ఆలోచించడం మానేసి పాజిటివ్ కోణంలో చూడడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ప్రవర్తనలోనూ సానుకూల మార్పులొచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇలా ఎవరికి వారు స్వయంగా కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోవడంతో పాటు అవసరమైతే నిపుణుల సలహాలు, సూచనలు, కౌన్సెలింగ్‌.. వంటివి తీసుకోవడం వల్ల మానసిక పరిణతి విషయంలో మరింత త్వరగా మార్పులొచ్చే అవకాశాలుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి