Published : 18/01/2023 13:15 IST

పిల్లల్లో ఇలాంటి మార్పులు గమనిస్తున్నారా?

బాల్యం అంటేనే ఉల్లాసం, ఉత్సాహం. దీనికి తగ్గట్లుగానే పిల్లలు కూడా ఇంట్లో ఎప్పుడూ సరదాగా, సంతోషంగా ఉంటారు. అలా లేకపోతే పేరెంట్స్ మనసు మనసులో ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో వారు ఉన్నట్లుండి డల్‌ అయిపోతుంటారు. చెప్పిన మాట వినరు సరికదా ఎప్పుడూ ముభావంగా కనిపిస్తుంటారు. ఇలాంటప్పుడే వారిని ఓ కంట కనిపెట్టాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వారు మీతో ఏదో చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నారనడానికి ఇదీ ఓ సంకేతమే అంటున్నారు. ఇలాంటి సమయంలో వారి మనసులోని బాధేంటో తెలుసుకొని.. అండగా నిలబడితే వారు ఆ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశం ఉంటుంది. మరి, ఇంతకీ పిల్లలు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లు తెలుసుకునేదెలా? ఇదిగో ఇలా..!

ఒంటరిగా ఉంటున్నారా?

పిల్లల్లో మానసిక సమస్యలకు కారణాలు చాలానే ఉంటాయి. ఎవరైనా బెదిరించడం, లైంగికంగా హింసించడం, చదువులో వెనకబడడం, చదువు-ఇతర విషయాల్లో తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, వారి ఇష్టాయిష్టాలకు పేరెంట్స్‌ విలువివ్వకపోవడం.. వంటివి అందులో కొన్ని! అయితే ఇలా మానసికంగా వ్యాకులత చెందే పిల్లలు.. కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా ఉండడానికే మొగ్గు చూపుతారని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. స్కూల్లోనూ స్నేహితులతో కలవకుండా, ఆటలు-ఇతర యాక్టివిటీల్లో పాల్గొనకుండా.. వాటికి దూరంగా ఉండడానికే ఇష్టపడతారట! ఇలా వారికి నచ్చిన వ్యక్తుల్ని, వ్యాపకాల్ని తరచూ దూరం పెడుతున్నట్లు గమనిస్తే.. వారి మనసులో ఏదో సమస్య ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి. వారితో స్నేహంగా మెలుగుతూ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే దానికి సరైన పరిష్కారం చూపి.. వారిని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావచ్చు.

చిరాకు పడుతుంటే..!

పిల్లల మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అప్పుడే నవ్వుతారు, మరు క్షణమే చిరాకు పడతారు. అయితే పిల్లలు ఇలా ప్రవర్తించడం చూస్తుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. ‘వాడి కోపమెంతసేపు.. చిటికెలో మాయమైపోతుంది..’ అనుకునే తల్లిదండ్రులూ లేకపోలేదు. నిజానికి ఎప్పుడో ఒకసారి ఇలా ప్రవర్తిస్తే పర్లేదు.. కానీ తరచూ ఇలాంటి ప్రవర్తన పిల్లల్లో గమనిస్తున్నట్లయితే.. వారిలో ఏదో మానసిక సమస్య ఉన్నట్లుగా అనుమానించమంటున్నారు నిపుణులు. కాబట్టి వారు చిరాకు పడుతున్నారని, మనం కూడా కోప్పడితే.. అసలు సమస్య బయటపడదు. అందుకే ఇలాంటి సమయంలో సంయమనంతో వ్యవహరించి.. పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే వారు తమ సమస్యను సులభంగా బయటపెట్టగలుగుతారు.

ఆత్మన్యూనత, అభద్రత..!

సాధారణంగా పిల్లల్లో ఒక రకమైన మొండితనం ఉంటుంది. ఏ విషయంలోనైనా వాళ్లను తక్కువ చేసి మాట్లాడినా, ‘నీ వల్ల కాద’న్నా వాళ్లు ఒప్పుకోరు.. పైగా తమ చేతలతో తామే స్మార్ట్‌ అని నిరూపించుకునే వారూ ఉంటారు. అయితే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ.. తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచించే పిల్లలు దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు నిపుణులు. ‘నేను ఆ సబ్జెక్టులో రాణించలేను..’, ‘నాకంత సీన్‌ లేదు..’ అంటూ తమను తాము తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలాంటి ఆత్మన్యూనత, అభద్రతా భావంలో కూరుకుపోయిన పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల్లిదండ్రుల మాటలు, చేతలు వారిలో సానుకూల దృక్పథం నింపేలా ఉండాలి. వారు చేరుకున్న లక్ష్యం చిన్నదైనా సరే.. వారిపై ప్రశంసలు కురిపించాలి. ‘ప్రయత్నిస్తే ఇంకా రాణించగలవు..’ అంటూ వారి వెన్నుతట్టాలి. అప్పుడే వారిలో సానుకూల మార్పును చూడగలం.

ఆరోగ్యపరంగానూ..!

మానసిక సమస్యలు ఒక దశలో ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. వీటి కారణంగా పిల్లల్లో తరచూ తలనొప్పి, కడుపునొప్పి, అలసట, నీరసం.. వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అయితే చాలామంది తల్లిదండ్రులు వీటిని సాధారణ సమస్యల్లాగే పరిగణిస్తారు తప్ప.. మానసిక ఒత్తిడి వల్ల ఇలాంటివి కూడా వస్తాయన్న అవగాహన వారిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గుర్తెరిగి.. ఆయా సమస్యల్ని దూరం చేయడానికి చికిత్స ఇప్పిస్తూనే.. మానసికంగానూ వారిలో ఉన్న సమస్యలేంటో తెలుసుకొని దూరం చేయాలి.

పిల్లల్లో తలెత్తే మానసిక, శారీరక సమస్యల ప్రభావం వారి రోజువారీ దినచర్య పైనే కాదు.. స్కూల్‌ రొటీన్‌, చదువు పైనా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి వారి ప్రవర్తనను తరచూ గుర్తిస్తూనే.. తల్లిదండ్రులుగా వారితో స్నేహం చేయాలి. అప్పుడే వారు అన్ని విషయాలు నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకోగలుగుతారు. ఒకవేళ ఇలా కూడా వారు స్పందించకపోతే.. నిపుణుల కౌన్సెలింగ్‌ వారికి చాలా వరకు మేలు చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని