ఉప్పెక్కువైతే ఏమవుతుందో తెలుసా?

‘ఉప్పు లేని కూర రుచించదు’ అన్నట్లు మనింట్లో వండే ఏ వంటకానికైనా ఉప్పు తగలాల్సిందే. లేకపోతే మన నాలుక కూడా వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడదు. ఇలా తినడం బాగానే ఉంటుంది కానీ ఉప్పు మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు...

Updated : 24 Sep 2022 19:57 IST

‘ఉప్పు లేని కూర రుచించదు’ అన్నట్లు మనింట్లో వండే ఏ వంటకానికైనా ఉప్పు తగలాల్సిందే. లేకపోతే మన నాలుక కూడా వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడదు. ఇలా తినడం బాగానే ఉంటుంది కానీ ఉప్పు మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

ఉప్పు.. ఎక్కువైతే ముప్పే!

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. మరి మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? అంటే.. కొన్ని శారీరక మార్పుల వల్ల ఆ విషయాన్ని సులభంగా గ్రహించచ్చంటున్నారు.

పదే పదే మూత్ర విసర్జన!

మధుమేహం సమస్య లేనప్పటికీ మీరు తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే.. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నట్లే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో యూరిన్‌కి వెళుతుంటే మాత్రం ఆహారంలో ఉప్పు వాడకంపై నియంత్రణ పాటించాల్సిందే అంటున్నారు.

ఎక్కువగా దాహం వేస్తోందా?

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయులు పెరిగిపోతాయి. ఫలితంగా శరీరంలో నీటి స్థాయుల సమతుల్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా ఎక్కువ దాహం వేస్తుంది. అదీ కాక ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.. శరీరంలో నీటి స్థాయులు తగ్గి దాహం వేయడానికి ఇదీ ఓ కారణమే!

తీవ్రమైన తలనొప్పి..

ఒత్తిడి, ఆందోళనలు ఎదురైనప్పుడు తలనొప్పి రావడం సహజమే! అయితే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండి, తరచుగా వేధిస్తున్నట్లయితే అది ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్లే అని గ్రహించాలి. ఇక ఉప్పు వల్ల శరీరంలో నీటిస్థాయులు తగ్గిపోయి డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల కూడా తలనొప్పి మొదలవుతుందట!

శరీర భాగాల్లో వాపు!

శరీర భాగాల్లో వాపు రావడమనేది సాధారణంగా హైబీపీ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో అక్కడక్కడా వాపు రావడం గమనించచ్చు. ముఖ్యంగా పాదాల్లో నీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయి. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఇలాంటి సమస్యల నుంచి క్రమంగా బయటపడచ్చు.

వాటి పైనే ఆసక్తి!

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే నాలుకపై ఉండే రుచి గుళికలు ఇతర రుచులను గ్రహించలేవట! ఫలితంగా ఏది తిన్నా నోటికి అంతగా నచ్చవట. అలాంటివారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారట!

తిమ్మిర్లు, నొప్పులు

మోతాదుకు మించి ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయులు పెరిగిపోతాయి. ఇది క్యా‌ల్షియం స్థాయుల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందట! దీంతో ఎముకలు బలహీనమవుతాయి. ఫలితంగా తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా వేధిస్తాయంటున్నారు నిపుణులు.

ఇలా తగ్గించుకోవచ్చు!

తీసుకునే ఆహారంలో భాగంగా ఉప్పును తగ్గించుకోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

మాంసం వంటివి కొనుగోలు చేసేటప్పుడు ప్యాక్‌ చేసిన వాటికంటే తాజాగా కట్‌ చేసిన వాటినే ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్యాక్‌ చేసిన వాటిలో పాడవకుండా ఉండేందుకు ఎక్కువ ఉప్పును కలుపుతుంటారు.

బయట సూపర్‌ మార్కెట్లో మనం ఏ పదార్థం కొన్నా.. అందులో సోడియం స్థాయులు ఎంత మేర ఉన్నాయో ఫుడ్‌ లేబుల్‌ చూసి తెలుసుకోవచ్చు.

కొన్ని రకాల మసాలాలు/సీజనింగ్స్‌ని ఎంచుకునే క్రమంలో సోడియం లేనివి సెలక్ట్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

బయట రెస్టరంట్లలో భోజనం చేసినా, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్నా.. ఉప్పు తక్కువగా వాడే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. అంతగా కావాలనుకుంటే.. తమ కోసం తయారుచేసే పదార్థాల్లో ఉప్పు తగ్గించమని కూడా చెప్పచ్చు.

సాసుల్లో కూడా సోడియం స్థాయులు అమితంగానే ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా దూరం పెట్టడం మంచిది. కావాలంటే వాటికి బదులుగా.. బ్రెడ్‌పై పీనట్ బటర్‌ రాసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్