భాగస్వామి జీవితంలో మరొకరున్నారా.. తెలిసేదెలా?
ప్రేమ.. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమంటుంటారు. కానీ ఇదే పేరుతో మూడో వ్యక్తిపై కలిగే వ్యామోహం చాలా జంటల మధ్య చిచ్చు పెడుతుందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇలాంటి సమస్యలతోనే ఎన్నో జంటలు తమ వద్దకొస్తున్నాయని చెబుతున్నారు. అలాగని ప్రతి చిన్న విషయానికీ భాగస్వామిపై....
మనస్విని-మాధవ్ చిలకాగోరింకల్లా ఉంటారు. అయితే ఈ మధ్య మాధవ్ ప్రవర్తనలో కొంత మార్పు గమనించిందామె. రహస్యంగా ఫోన్ మాట్లాడడం, ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి రావడం, వారాంతాలూ ఏదో ఒక పని ఉందంటూ బయటికి వెళ్లడం.. ఇవన్నీ ఆమెకు వాళ్లాయనపై అనుమానం రేకెత్తించాయి.
లాస్య-లోకేశ్ పెళ్లై పదేళ్లు దాటింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్లు ఈమధ్య తరచూ గొడవపడుతున్నారు. కారణం.. లోకేశ్ పదే పదే తన సహోద్యోగి ప్రస్తావన తీసుకురావడం. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న సందేహం లాస్యలో మొదలైంది.
ప్రేమ.. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమంటుంటారు. కానీ ఇదే పేరుతో మూడో వ్యక్తిపై కలిగే వ్యామోహం చాలా జంటల మధ్య చిచ్చు పెడుతుందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇలాంటి సమస్యలతోనే ఎన్నో జంటలు తమ వద్దకొస్తున్నాయని చెబుతున్నారు. అలాగని ప్రతి చిన్న విషయానికీ భాగస్వామిపై అనుమానం పెంచుకోకుండా.. వారు చేసే కొన్ని పనులు, ప్రవర్తన ఆధారంగా వారి జీవితంలో మరొకరున్నారా? లేదా? అనేది గుర్తించచ్చంటున్నారు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..
ప్రతిదీ రహస్యమేనా?
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలూ ఉండకూడదంటారు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తేనే అనుమానాలకు తావు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా ముందుకు సాగచ్చు. అయితే ఉన్నట్లుండి తమ భాగస్వామి ప్రవర్తనలో మార్పులొచ్చినా, ప్రతి విషయంలోనూ రహస్యంగా ప్రవర్తించినా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.
ఉదాహరణకు.. ఫోన్‌కు రహస్య పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం, అవతలి వారితో రహస్యంగా ఫోన్లో మాట్లాడడం, ప్రతిరోజూ ఆలస్యంగా ఇంటికి రావడం, ఎందుకు లేటుగా వచ్చావని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఏది అడిగినా చిరాకుతో మీరంటే లెక్కలేనట్లుగా మాట్లాడడం.. వంటివి గమనిస్తే మాత్రం మీ భాగస్వామి జీవితంలో మరో వ్యక్తి ఉన్నారనడానికి సంకేతాలే అంటున్నారు.
ఆ చిరాకు మీపై రుద్దితే..!
దాంపత్య బంధంలో చిరాకు, పరాకులకు ఓ సమయం, సందర్భం అంటూ ఉంటుంది. ఏదైనా విషయంలో ఇద్దరికీ పొంతన కుదరకపోతే ఒకరిపై ఒకరు చిరాకు పడడం.. కాసేపయ్యాక తిరిగి ఇద్దరూ కలిసిపోవడం.. ఇది సహజంగా జరిగేదే! కానీ ఇలా కాకుండా.. మీరు కనిపిస్తే చిరాకు పడడం, మీ భాగస్వామి ఇష్టపడే వారు కనిపించకపోయినా-మాట్లాడకపోయినా.. ఆ చిరాకునూ మీపై రుద్దడం.. ఇలా ఎటుతిరిగీ మిమ్మల్ని ఓ దోషిగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతో మీపై లేనిపోని నిందలేయడం, బాధపెట్టడం.. చేసినట్లయితే.. మీ భాగస్వామి మిమ్మల్ని త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నారని అర్థం అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇన్ని చేసినా పరిస్థితుల రీత్యా కొందరు సర్దుకుపోతూ ఇవన్నీ భరిస్తుంటారు. కానీ దీనివల్ల దాంపత్య బంధం సుఖంగా సాగదు. కాబట్టి భాగస్వామి విషయంలో అనుమానంగా అనిపిస్తే దాన్ని నివృత్తి చేసుకొని అడుగు ముందుకేయడం మంచిదన్నది నిపుణుల సూచన!
పదే పదే తన ప్రస్తావనే!
భార్యాభర్తలంటే.. ఒకరిలో ఒకరికి నచ్చిన అంశాల్ని పంచుకోవాలి.. పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి.. ఆఫీస్‌లో ఏదైనా విశేషముంటే దాని గురించి చర్చించుకోవాలి.. ఇక ఏకాంతంగా ఉన్నప్పుడు రొమాంటిక్‌గా నాలుగు మాటలు మాట్లాడుకోవాలి. అంతేకానీ.. సందర్భం అయినా, కాకపోయినా.. ప్రస్తావన వచ్చినా, రాకపోయినా.. మీ భాగస్వామి మరో వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతున్నా.. వారిలోని మంచి విషయాలు చెబుతూ ఒక రకమైన భావోద్వేగానికి లోనవడం.. వంటివి చేస్తే.. ఆ వ్యక్తితో ఏదో సంబంధం ఉందన్న మీ అనుమానమే నిజం కావచ్చంటున్నారు నిపుణులు. ఇంకొంతమందిలో.. ఉన్నట్లుండి అందం, ఆహార్యం.. వంటి విషయాల్లోనూ మార్పులు గమనించచ్చంటున్నారు.
మిమ్మల్ని దూరం పెడుతూ..!
అప్పటిదాకా ప్రతి విషయంలో మీకు, మీ నిర్ణయాలకు ప్రాధాన్యమిచ్చిన వారు.. ఉన్నట్లుండి మిమ్మల్ని దూరం పెడితే.. ఎవరికైనా అనుమానం కలగడం సహజం. అయితే ఇందుకు గల కారణాలేంటో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో గోప్యత పాటించడం, ప్రతి విషయంలో మీ నిర్ణయం అడక్కపోవడం, కలిసి సమయం గడుపుదామని మీరు ఆసక్తి చూపినా.. అవతలి వారు ఏదో ఒక కారణం చూపి తప్పించుకోవడం, ఆఖరికి ఏకాంతంగా ఉండాల్సిన సమయంలోనూ మిమ్మల్ని దూరం పెట్టడం.. ఇవన్నీ మనసుకు బాధ కలిగించేవే! అంటే.. మీకంటే మరో వ్యక్తికి ప్రాధాన్యమిస్తున్నారనడానికి వీటిని ఓ సంకేతంగా భావించచ్చంటున్నారు నిపుణులు.
ఇలా చేసి చూడండి!
భాగస్వామి వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారనడాన్ని ఇలాంటి సంకేతాల ద్వారా గుర్తించడం వరకు బాగానే ఉన్నా.. ముందు మీ అనుమానం నిజమా? కాదా? అన్నది తేల్చుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాకాకుండా.. నేరుగా భాగస్వామితో గొడవకు దిగితే.. అవతలి వారిది ఏ తప్పూ లేకపోతే.. మీదే పొరపాటవుతుంది. పైగా దీనివల్ల మీ మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీ భాగస్వామిపై మీకు అనుమానంగా ఉన్నప్పటికీ.. మనసును కుదుటపర్చుకొని ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో, మూడో వ్యక్తి గురించి మీ మధ్య పదే పదే ఎందుకు ప్రస్తావన వస్తోందో సున్నితంగా అడగండి.. ఇలా అవతలి వారి మనసులో ఉన్న విషయం బయటపడితే సరే సరి.. లేదంటే ఇద్దరూ కలిసి నిపుణుల కౌన్సెలింగ్‌కి వెళ్లచ్చు. ఏదేమైనా అక్కడ సాధ్యమైనంత వరకు వైవాహిక బంధాన్ని తిరిగి దృఢం చేసేందుకే నిపుణులు ప్రయత్నిస్తారు. ఇక ఆపై మీ ఇష్టం!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.