Published : 01/11/2022 20:19 IST

పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? పోషకాహార లోపం కావచ్చు..!

ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం ఎంతో అవసరం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సాధ్యమైనంత మేర చక్కటి ఆహారాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటారు. వారికి అందించే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సరైన పోషకాలు లభించక చిన్నారులు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో పోషకాహార లోపం ఉన్నా కొంతమంది పిల్లలు పైకి మామూలుగానే ఉంటారు. ఇలాంటివారిని గుర్తించడం కష్టం. అయితే కొన్ని లక్షణాల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా సమస్యను ముందే పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా...

కుంగుబాటు

ఈ రోజుల్లో చాలామందిని ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీరిలో పిల్లలూ ఉంటున్నారు. అయితే ఈ సమస్యలకు పోషకాహార లోపం కూడా కారణమంటున్నారు. ప్రొటీన్లలో అమైనో అమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవి లోపించినప్పుడు ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకిచ్చే ఆహారంలో ప్రొటీన్లు తగినంతగా ఉండేలా జాగ్రత్తపడాలి.

హుషారుగా ఉన్నారా..?

కొంతమంది పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. ఎంతసేపైనా అలుపు లేకుండా ఆడుకుంటారు. కానీ ఆహారం దగ్గరకు వచ్చేసరికి తక్కువగా తింటుంటారు. అయితే యాక్టివ్‌గా ఉన్నారని తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇలాంటి వారిలో అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉంది. దీనికి కారణం వారి శరీరం పోషకాలను గ్రహించలేకపోవడమే. ఫాస్ట్‌ఫుడ్‌, ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. కాబట్టి, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించి పెరుగు, మజ్జిగ, బొప్పాయి వంటి ఆహార పదార్థాలను అందించాలంటున్నారు నిపుణులు.

తరచుగా ఫ్లూ వస్తుంటే...

కొంతమంది పిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల తరచూ ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తుండాలి. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను సమపాళ్లలో తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలని, తద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఊబకాయం...

ఈ రోజుల్లో పిల్లలు కూడా ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి పోషకాహార లోపం కూడా కారణమంటున్నారు నిపుణులు. తీసుకునే ఆహారంలో సరిపడ పోషకాలు లభించకపోతే ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. ఫలితంగా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, పిల్లలకు అందించే ఆహారంలో సరిపడ పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

నీరసపడుతున్నారా?

పోషకాల్లో క్యాల్షియం, విటమిన్‌ డి.. ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇవి సరిపడ మోతాదులో శరీరానికి అందకపోతే కండరాల నొప్పి, ఎముకలు బలహీనంగా మారడం.. వంటివి జరుగుతుంటాయి. అలాగే చిన్న పనికే నీరసపడిపోతుంటారు. విటమిన్‌ డి ఆహార పదార్థాల్లో కంటే సూర్యరశ్మి ద్వారానే శరీరానికి ఎక్కువగా లభిస్తుందన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎదిగే పిల్లలకు ఇది ఎంతో అవసరం కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని