Makeup Removal: ఏం చేయాలి? ఏం చేయకూడదు?!

మేకప్‌ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం మక్కువతోనే కాదు.. వృత్తిలో భాగంగానూ కొంతమంది తరచూ మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా వేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని తొలగించుకునే క్రమంలోనూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు....

Published : 02 Jan 2023 12:01 IST

మేకప్‌ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం మక్కువతోనే కాదు.. వృత్తిలో భాగంగానూ కొంతమంది తరచూ మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా వేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని తొలగించుకునే క్రమంలోనూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. అప్పుడే చర్మంపై నుంచి మేకప్‌ పూర్తిగా తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. లేదంటే వాటి అవశేషాలు ముఖ చర్మాన్ని దెబ్బతీస్తాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే మేకప్‌ను తొలగించుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

రోజంతా మేకప్‌తో ఉన్నా.. రాత్రి పడుకునే ముందు మాత్రం మేకప్‌ తొలగించుకోవడం తప్పనిసరి అని పదే పదే నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే రాత్రుళ్లు నిద్రపోయినప్పుడు చర్మం తనను తాను రిపేర్‌ చేసుకుంటుంది. అదే మేకప్‌తోనే పడుకున్నట్లయితే మేకప్‌ ఉత్పత్తులు చర్మ రంధ్రాల్ని మూసేసి.. వాటిని ఊపిరి పీల్చుకోకుండా చేస్తాయి. తద్వారా రిపేర్‌ చేసుకునే ప్రక్రియ ఆగిపోతుంది. ఇది క్రమంగా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే ఇలా మేకప్‌ తొలగించుకునే క్రమంలో కొన్ని అంశాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

కరిగించాలి!

మేకప్‌ తొలగించుకునే క్రమంలో రిమూవర్‌ ఉపయోగించినా.. గట్టిగా రుద్దుతూ మరీ శుభ్రం చేసుకుంటారు కొంతమంది. అయితే ఇలా చేయడం వల్ల చర్మం డ్యామేజ్‌ అయ్యే ప్రమాదమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అందుకే నెమ్మదిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చర్మానికి జిడ్డుగా అతుక్కుపోయిన మేకప్‌ను ముందుగా కరిగించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేకప్‌ను తొలగించే క్లెన్సర్లు బయట దొరుకుతాయి. ఒక కాటన్‌ ప్యాడ్‌పై ఈ రిమూవర్‌ను వేసి ముఖమంతా అప్లై చేయాలి. కాస్త ఎక్కువగా మేకప్‌ వేసిన భాగంలో ఈ కాటన్‌ని కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మేకప్‌ కరిగిపోతుంది. అప్పుడు తొలగించడం సులభమవుతుంది.

ఆవిరి పట్టండి!

చర్మ రంధ్రాల్లోకి చేరిన మేకప్‌ అవశేషాలు అంత సులభంగా వదిలిపోవు. అలాగని వాటిని అలాగే వదిలేస్తే లేనిపోని చర్మ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే రిమూవర్‌తో మేకప్‌ను తొలగించుకున్న తర్వాత, ముఖం శుభ్రపరచుకునే ముందు ఓసారి ఆవిరి పట్టమంటున్నారు నిపుణులు. తద్వారా చర్మ రంధ్రాలు తెరచుకొని.. అందులో పేరుకుపోయిన మేకప్‌ అవశేషాలు మెత్తబడతాయి. ముఖం శుభ్రం చేసుకున్నప్పుడు అవి సులభంగా తొలగిపోయి చర్మం పూర్తిగా శుభ్రపడుతుంది. ఇక ఆవిరి పట్టే నీటిలో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె వేసుకుంటే పరిమళభరితంగా ఉంటుంది.

ఆ భాగాలను వదలద్దు!

మేకప్‌ తొలగించుకునే క్రమంలో కళ్ల చివర్లు, పెదాలు, మెడ, చెవులు, హెయిర్‌లైన్‌.. వంటి భాగాలను నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది. ఇందుకు ఆయా భాగాలపై ఎవరి దృష్టీ పడదన్నది ఒక కారణమైతే.. అక్కడ మేకప్‌ తొలగించుకోవడానికి కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనేది మరో కారణం. నిజానికి ఈ నిర్లక్ష్యం వల్ల కొన్నాళ్లకు అక్కడి చర్మం దెబ్బతింటుంది. అందుకే ముఖ చర్మంపై ఉండే మేకప్‌ని ఎలాగైతే శ్రద్ధగా తొలగించుకుంటామో.. ఆయా భాగాల వద్ద ఉన్న మేకప్‌ని సైతం అంతే శ్రద్ధగా తొలగించుకోవాలి. కళ్ల చివర్లు, పెదాలు, హెయిర్‌లైన్‌ వద్ద మేకప్‌ని తొలగించడానికి కాటన్‌ ప్యాడ్‌కి బదులు ఇయర్‌ బడ్‌ ఉపయోగించచ్చు.. ఇక మెడ, చెవుల వద్ద కాటన్‌ ప్యాడ్‌తో మేకప్‌ తొలగించుకోవచ్చు.

ఇలా ముఖంపై వేసుకున్న మేకప్‌ని తొలగించుకున్న తర్వాత ఆఖర్లో ఫేస్‌వాష్‌తో ఓసారి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఇవి గుర్తుంచుకోండి!

మేకప్‌ని తొలగించే ప్రక్రియ త్వరగా, సులభంగా పూర్తవుతుందన్న ఉద్దేశంతో కొంతమంది మార్కెట్లో దొరికే మేకప్‌ రిమూవింగ్‌ వైప్స్‌పై ఆధారపడుతుంటారు. నిజానికి ఇవి పూర్తిగా మేకప్‌ని తొలగించవు. కాబట్టి ఇవి వాడినా ఆఖర్లో ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల మేకప్‌ రిమూవర్స్‌ చర్మంలోని సహజసిద్ధమైన నూనెల్ని తొలగిస్తాయి. తద్వారా చర్మం పొడిబారిపోతుంది. ఇలాంటప్పుడు మేకప్‌ తొలగించుకొని, ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం తప్పనిసరి. ఇక పెదాలకు లిప్‌బామ్‌, కళ్లకు ఐ క్రీమ్‌.. వంటివీ ఆయా భాగాల్ని తేమగా ఉంచేందుకు సహకరిస్తాయి.

మేకప్‌ తొలగించుకునే ప్రక్రియను కళ్లతో మొదలుపెట్టకూడదంటున్నారు నిపుణులు. పెదాలతో మొదలుపెట్టి బుగ్గలు, గడ్డం, నుదురు.. వంటి భాగాలను శుభ్రం చేసుకున్నాకే ఆఖర్లో కంటి మేకప్‌ను తొలగించుకోవాలి. ఈ క్రమంలో మేకప్‌ రిమూవర్‌లో ముంచి పిండిన కాటన్‌ బాల్‌ లేదంటే మేకప్‌ రిమూవర్‌ వేసిన కాటన్‌ ప్యాడ్‌తో కంటి వద్ద ఉన్న మేకప్‌ను శుభ్రం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్