తెలివైన అమ్మాయిలు ఇలా చేస్తారట!

మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తాం.. ఏ సినిమానో, వినోద కార్యక్రమమో చూస్తూ కాలక్షేపం చేస్తాం..కాస్త కఠినమైన ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పేస్తే.. ‘వెరీ స్మార్ట్’ అనుకుంటూ మనల్ని మనమే తెగ పొగిడేసుకుంటాం..కొత్త విషయం తెలుసుకోవాలన్న జిజ్ఞాన ఉన్నా.. పూర్తిగా తెలుసుకునేంత....

Published : 20 Sep 2022 20:19 IST

మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తాం.. ఏ సినిమానో, వినోద కార్యక్రమమో చూస్తూ కాలక్షేపం చేస్తాం..

కాస్త కఠినమైన ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పేస్తే.. ‘వెరీ స్మార్ట్’ అనుకుంటూ మనల్ని మనమే తెగ పొగిడేసుకుంటాం..

కొత్త విషయం తెలుసుకోవాలన్న జిజ్ఞాన ఉన్నా.. పూర్తిగా తెలుసుకునేంత ఓపిక ఉండదు చాలామందికి!

తెలివైన అమ్మాయిలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అని చెబుతున్నారు నిపుణులు. చేసే ప్రతి పనిలోనూ ఉత్తమమైన ప్రతిఫలాన్ని ఆశించే వీళ్లకు చాలావరకు అత్యుత్తమమైన అలవాట్లే ఉంటాయట! ఇవే వారిని జీవితంలో ఉన్నతమైన స్థితిలో నిలబెడతాయంటున్నారు నిపుణులు. మరి, తెలివైన అమ్మాయిలకు ఉండే ఆ అలవాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

పనులన్నీ పూర్తై కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. ఏదో ఒక పని చేస్తూ టైంపాస్ చేస్తుంటారు చాలామంది. కానీ తెలివితేటలున్న అమ్మాయిలు మాత్రం ఈ సమయాన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటారట! ఈ క్రమంలో పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారని చెబుతున్నారు నిపుణులు. ఇక కనిపించిన పుస్తకమల్లా కొని ఇంట్లోనే ఓ చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసుకునే వారూ లేకపోలేదు. అలాగే  ‘Kindle’ వంటి యాప్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని పుస్తక పఠనాన్ని ఆస్వాదిస్తుంటారు.

తెలివైన అమ్మాయిలకు జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, పాఠాలు విన్నప్పుడు.. దాని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేలా చేస్తుందంటున్నారు నిపుణులు. ఇలా ఈ ప్రశ్నించే తత్వమే వారిలో తెలివితేటల్ని పెంచుతుందంటున్నారు.

ఎప్పుడూ పుస్తకాలు, చదువు అని కాకుండా ఆటలనూ ఆస్వాదిస్తుంటారు తెలివైన అమ్మాయిలు. అయితే అది కూడా మెదడుకు పదును పెట్టే పజిల్స్‌, చెస్, మ్యాజిక్‌ క్యూబ్‌.. వంటి ఆటలు, పదవినోదం, గణిత సమస్యల్ని పరిష్కరించడం.. వంటి వాటిపై ఎక్కుగా దృష్టి పెడుతుంటారు. వీటివల్ల మెదడు మరింత చురుగ్గా మారుతుంది.

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తెలివైన వారు అందులోని సానుకూలతలు, ప్రతికూలతలు.. ఇలా రెండు వైపుల నుంచి ఆలోచిస్తారట! అంతేకాదు.. సమస్యను పరిష్కరించే క్రమంలో దీని గురించి మరింత లోతుగా పరిశీలించి, పరిశోధించి మరీ ఓ కచ్చితమైన నిర్ణయానికి వస్తారట! అంతేకానీ.. ఏదో పైపైన తేల్చేయడం తెలివైన వారి లక్షణం కాదంటున్నారు నిపుణులు.

తెలివైన అమ్మాయిలకుండే మరో లక్షణం.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్న ఆసక్తి. ఈ మక్కువే వారిని కొత్త కోర్సులు నేర్చుకునేలా, శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేలా చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా వారిలో వివిధ నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. ఇవి వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మేలు చేస్తాయి.

కాస్త కఠినమైన ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పగానే ఉప్పొంగిపోతాం. కానీ తెలివైన వారు ఎంత క్లిష్టమైన విషయం గురించి తెలిసినా, సమాధానం చెప్పినా గొప్పలకు పోరట! తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉందన్న ఉత్సాహం వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఇదే వారి వినయవిధేయతలకు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నేర్పుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కాస్త ఖాళీ దొరికితే ఎలా టైంపాస్‌ చేయాలా అని మనం ఆలోచిస్తాం.. కానీ తెలివైన వారు ఈ సమయాన్ని నిద్రకు కేటాయిస్తుంటారట! ఇలా కాసేపు కునుకేయడం వల్ల మెదడు చురుగ్గా, హ్యాపీగా మారుతుంది. ఇది వారి తెలివితేటల్ని మరింతగా పెంచుతుంది.

అనుభవాలను పదే పదే గుర్తు చేసుకొని సంతోషపడడం లేదంటే బాధపడడం మనలో చాలామంది చేసేదే! కానీ తెలివైన వారు వీటినే తలచుకుంటూ కూర్చోకుండా.. ఇవే అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారట! తద్వారా తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడడంతో పాటు మంచీ చెడులపై వారికి మరింత అవగాహన పెరుగుతుందంటున్నారు నిపుణులు.

ఓడిపోతే బాధపడతాం.. మళ్లీ ఆవైపు కూడా చూడం. కానీ తెలివితేటలున్న వారు ఓటమినీ సానుకూలంగానే స్వీకరిస్తారంటున్నారు నిపుణులు. ఇదే గెలిచే వరకు వారిని ఓడిపోనివ్వదు.

‘మన అలవాట్లే మన భవిష్యత్తును మారుస్తాయి..’ అన్నారు అబ్దుల్‌ కలాం. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా ఇలాంటి తెలివైన అలవాట్లను అలవర్చుకుంటే.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని అధిరోహించచ్చు.. వ్యక్తిగతంగానూ ఇతరులకు ఆదర్శంగా నిలవచ్చు..! ఏమంటారు?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్