కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో....
దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఒకరికి బాధ కలిగితే మరొకరు 'నేనున్నా'నంటూ ఓదార్చడం... మీదైన ప్రత్యేక శైలిలో సర్‌ప్రైజ్ చేయడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే వీటికి కాస్త రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి ఆకాశపుటంచుల్ని తాకుతుందని చెబుతున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.
ఐ లవ్యూ.. చెబుతున్నారా??
'ఐ లవ్యూ..' ఇది కేవలం ప్రేమికులు మాత్రమే కాదు.. భార్యాభర్తలు కూడా చెప్పుకోవాల్సిన మాట. అయితే ఇలా చెప్పుకోకపోతే ప్రేమ లేదని మా ఉద్దేశం కాదు. అలాగని రోజూ చెప్పినా బోర్ కొడుతుంది కూడా! అందుకే అప్పుడప్పుడూ విభిన్న రీతుల్లో, వేర్వేరు భాషల్లో ఐలవ్యూ చెప్పడానికి ప్రయత్నించండి. ఇది ఇద్దరికీ సరదానూ పంచుతుంది. ఇక వాలెంటైన్స్ డే, పుట్టినరోజు, పెళ్లిరోజు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో మీ భాగస్వామికి నచ్చిన మంచి కానుక కొని.. దాన్ని ఇస్తూ ఈ మాట చెబితే.. మరింత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.
కాసేపైనా నవ్వుకోండి..
ఓ నవ్వు జీవితంలోని బాధల్ని మరిపిస్తుంది.. అలాగే భార్యాభర్తల మనసుల్ని కూడా మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో దంపతులిద్దరూ కలిసి అనవసర విషయాలతో కాలక్షేపం చేయకుండా.. జోక్స్, నవ్వు తెప్పించే చిన్నప్పటి సంగతులు.. వంటివి పంచుకోవాలి. అలాగే ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి కాసేపు అలా ఒకరి నడుంపై మరొకరు చెయ్యేసి.. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ఓరగా నవ్వుతూ, చేతిలో చెయ్యేసి కాసేపు నడుస్తూ.. రొమాంటిక్ వాక్ చేయడం మంచిది. అలాగే సమయం దొరికినప్పుడైనా ఇద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ, రొమాంటిక్ సినిమాలు చూడడమూ అలవాటు చేసుకోవాలి. ఇలా వీలైనప్పుడల్లా దంపతులిద్దరూ కలిసి రొమాంటిక్‌గా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
అందంగా.. ఆకర్షణీయంగా..
దంపతులిద్దరూ రోజూ ఎవరి పనులతో వారు బిజీగా ఉంటారు. ఒకరినొకరు పట్టించుకునే తీరికే ఉండకపోవచ్చు.. అయితే కనీసం సెలవు రోజునో.. అలా బయటకు వెళ్లినప్పుడో.. లేదంటే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడో.. ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా రడీ కావాలి. అక్కడితో ఆగిపోకుండా.. ఆ క్షణం మీ భాగస్వామిపై మీకున్న ఫీలింగ్‌ని మీ మనసులోనే దాచుకోకుండా వారితో చెప్పేయాలి. దగ్గరికి తీసుకొని లేదంటే నుదుటిపై ఓ ముద్దు పెడుతూ, ప్రేమగా హత్తుకుంటూ.. రొమాంటిక్‌గా మీ మనసులోని భావాల్ని వ్యక్తం చేయాలి.. 'నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావ్! నీ వల్ల చీరకే అందం వచ్చింది తెలుసా..'; 'మీరు ఈ డ్రస్సులో మన్మథుడిలా ఉన్నారు..'.. ఇలా చెబితే ఎదుటివారు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏమంటారు?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.