ఇంట్లోనే ఫేషియల్... మిలమిల మెరిసే అందం మీ సొంతమిలా..!

అందంగా కనిపించాలని, తన ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అందుకోసమే రకరకాల క్రీములు, సౌందర్య సాధనాల్ని వాడుతున్నారు ఈ తరం అమ్మాయిలు. అయితే మరికొందరు ఫేషియల్స్ కోసం బ్యూటీ పార్లర్ల బాట పడుతుంటారు. ఎంతో ఖర్చుపెట్టి మరీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. మరి, ఇలాంటి అధిక ఖర్చుతో పని లేకుండా మీరెప్పుడైనా ఫేషియల్‌ని ఇంట్లోనే ట్రై చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేసి చూడండి.

Published : 11 Jul 2021 12:13 IST

అందంగా కనిపించాలని, తన ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అందుకోసమే రకరకాల క్రీములు, సౌందర్య సాధనాల్ని వాడుతున్నారు ఈ తరం అమ్మాయిలు. అయితే మరికొందరు ఫేషియల్స్ కోసం బ్యూటీ పార్లర్ల బాట పడుతుంటారు. ఎంతో ఖర్చుపెట్టి మరీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. మరి, ఇలాంటి అధిక ఖర్చుతో పని లేకుండా మీరెప్పుడైనా ఫేషియల్‌ని ఇంట్లోనే ట్రై చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేసి చూడండి. బ్యూటీ పార్లర్లలో వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో, అది కూడా సహజసిద్ధంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు. మాకంత టైం లేదంటారా? అందుకోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే సమయాన్ని ఇంట్లో ఫేషియల్ చేసుకోవడానికి కేటాయిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..

'క్లెన్సింగ్'తో క్లీన్..

ఏ ఫేషియల్‌కైనా ముందుగా క్లెన్సింగ్ (ముఖాన్ని శుభ్రపరచుకోవడం) చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీ ముఖంపై ఉన్న మురికి, జిడ్డుదనం, మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోయి ముఖం ఫేషియల్ చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అయితే ముందుగా మీ జుట్టును బిగుతుగా పైకి కట్టుకొని రబ్బర్‌బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు క్లెన్సింగ్ ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం మీ చర్మతత్వానికి సరిపోయే ఫేస్‌వాష్‌ని ఎంచుకోవాలి. సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఫేస్‌వాష్‌లు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని లభిస్తున్నాయి. అవి కాకపోతే అన్ని చర్మతత్వాలకు సరిపోయే పాలను కూడా క్లెన్సింగ్ ప్రక్రియలో ఉపయోగించచ్చు. పొడిచర్మతత్వం ఉన్న వారు కొబ్బరినూనె, ఆలివ్ నూనె.. వంటి వాటిని వాడచ్చు. ఈ క్రమంలో ముందుగా గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకొని, ఆపై ఫేస్‌వాష్ లేదా పాలు, తేనె, నూనె.. వంటి పదార్థాలతో ముఖం, మెడను మృదువుగా రుద్దుతూ మర్దన చేసుకోవాలి. అనంతరం చన్నీటితో ముఖం కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రక్రియ ద్వారా ముఖంపై చేరిన దుమ్ము, ధూళి, మేకప్ అవశేషాలు.. వంటివన్నీ సమూలంగా తొలగిపోతాయి.

మృతకణాల్ని తొలగించే 'ఎక్స్‌ఫోలియేషన్'!

ఎక్స్‌ఫోలియేషన్ అంటే స్క్రబ్ ద్వారా ముఖాన్ని శుభ్రపరచుకోవడం. స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్, మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే ఇందుకోసం మార్కెట్‌లో లభ్యమయ్యే, మీ చర్మతత్వానికి సరిపోయే మంచి స్క్రబ్‌ని ఎంచుకోవడం.. లేదంటే ఇంట్లో లభ్యమయ్యే వివిధ పదార్థాలతోనే స్క్రబ్‌ను తయారుచేసుకొని ఉపయోగించడం.. వంటివి చేయచ్చు. ఈ క్రమంలో జిడ్డు చర్మం ఉన్న వారు ఓట్‌మీల్‌తో చేసిన స్క్రబ్‌ని వాడచ్చు. పొడి చర్మం ఉన్న వారు, కొబ్బరి నూనె - కాఫీ పొడితో చేసిన స్క్రబ్‌ని వాడచ్చు. ఇప్పుడు ఎక్స్‌ఫోలియేషన్ ఎలా చేసుకోవాలంటే.. కొద్దిగా స్క్రబ్‌ని తీసుకొని చేతి వేళ్ల సహాయంతో ముఖం, మెడపై గుండ్రంగా మర్దన చేసుకోవాలి. ముక్కు, గడ్డం.. వంటి ప్రదేశాల్లో మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాల్లో కాస్త బలంగా స్క్రబ్ చేయాలి. ఇలా పది నిమిషాల పాటు చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీటితో ఆయా భాగాల్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.

'మసాజ్'తో మెరుపు!

ఫేషియల్‌లో భాగంగా స్క్రబ్ చేసుకున్న తర్వాత చేయాల్సిన మరో ముఖ్యమైన ప్రక్రియ 'మసాజ్'. ఇది చర్మంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. ఇందుకోసం చర్మతత్వానికి సరిపోయే ఫేస్ మసాజ్ క్రీమ్స్ బయట మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంట్లో పండ్లు, ఇతర పదార్థాలతో తయారుచేసిన మిశ్రమాల్ని కూడా ఇందుకు ఉపయోగించచ్చు. ముందుగా కొద్దిగా మసాజ్ క్రీమ్‌ను అరిచేతుల్లోకి తీసుకొని ముఖమంతా రాసుకోవాలి.. ఇప్పుడు మునివేళ్లతో నుదుటిపై గుండ్రంగా మసాజ్ చేయాలి. అలా చేస్తూ చేస్తూ నుదురు చివర్ల వరకూ రావాలి. ఆపై ముక్కు, చెంపలు, గడ్డం.. తదితర భాగాల్లో గుండ్రంగా తిప్పుతూ లోపలి నుంచి బయటి వైపు, కింది నుంచి పైవైపుగా మసాజ్ చేయాలి. మెడ భాగంలో కింది నుంచి గడ్డం వైపు మర్దన చేయాలి. ఇలా పది నిమిషాల పాటు చేసుకొని ఆపై చల్లటి నీటితో ముఖాన్ని ఓసారి కడిగేసుకోవాలి.

'ఆవిరి' పట్టించండి!

ఫేషియల్‌లో భాగంగా చర్మ రంధ్రాల్ని శుభ్రం చేయడానికి ఇదో చక్కటి ప్రక్రియ. ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం ఉన్న వారు, మొటిమలతో బాధపడుతున్న వారికి ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని, అవి శుభ్రపడడంతో పాటు ఫేషియల్‌కి వాడే క్రీమ్‌లు, పదార్థాలు చర్మంలోకి చక్కగా ఇంకుతాయి. అలాగే చర్మం తేమగా, రిలాక్స్‌డ్‌గా మారుతుంది. ఇందుకోసం ముందుగా వెడల్పాటి గిన్నెలో నీళ్లను మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిలో ఐదారు చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఆ నీటితో ముఖానికి ఆవిరి పట్టాలి. ఈ ప్రక్రియ చర్మానికి అరోమాథెరపీలా పనిచేసి సాంత్వనను అందిస్తుంది.

తక్షణ మెరుపును అందించే 'ఫేస్‌మాస్క్'!

ఫేస్‌మాస్క్ వేసుకోవడం ద్వారా ముఖం సరికొత్త కాంతిని సంతరించుకొని.. తేమగా, తాజాగా, యవ్వనంగా మారుతుంది. ఈ క్రమంలో ఆయా చర్మతత్వాన్ని బట్టి ఇంట్లోనే సహజసిద్ధంగా ఫేస్‌మాస్క్‌లను తయారుచేసుకోవచ్చు. పొడి చర్మతత్వం ఉన్న వారు బాగా పండిన అరటిపండ్లు, తేనెతో తయారుచేసిన మాస్క్‌ని; అదే జిడ్డు చర్మతత్వం గల వారు ఓట్‌మీల్, అవకాడో కలిపి తయారుచేసిన మాస్క్‌ని ఉపయోగించచ్చు. ఇలా మీరు తయారుచేసుకున్న ఫేస్‌మాస్క్‌ని ముఖానికి, మెడకు పూతలా వేసుకోవాలి. ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

'టోనింగ్' ఎందుకంటే?

చర్మానికి మెరుపును అందించడానికి మనం వేసుకున్న ఫేస్‌మాస్క్ చర్మంలోకి ఇంకిపోయి సత్ఫలితాలను అందించాలంటే అందుకు 'టోనింగ్' ప్రక్రియ దోహదం చేస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా చిన్న కాటన్ బాల్‌పై కాస్త టోనర్‌ని (రోజ్ వాటర్, పుదీనా టోనర్.. ఇలా మనం ఇంట్లోనే మన చర్మతత్వాన్ని బట్టి టోనర్స్‌ని తయారుచేసుకోవచ్చు..) వేసుకొని దాన్ని ముఖమంతా పట్టించాలి. ఇలా చేయడం వల్ల స్టీమింగ్‌లో భాగంగా తెరచుకున్న చర్మ రంధ్రాలు తిరిగి మూసుకుపోతాయి. అలాగే ఫేస్‌మాస్క్ వేసుకోవడానికి మనం ఉపయోగించిన పదార్థాలు చర్మ రంధ్రాల్లోకి చేరి చర్మానికి మెరుపును అందిస్తాయి. ఇలా వచ్చిన మెరుపు చాలా కాలం పాటు నిలిచి ఉంటుంది.

తేమను తిరిగి అందించే 'మాయిశ్చరైజేషన్'!

ఫేషియల్‌లో ఇది చివరగా చేయాల్సిన ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే మాయిశ్చరైజ్ చేయకపోతే మీ ఫేషియల్ పూర్తవనట్లే లెక్క. ఎందుకంటే ఫేషియల్ చేసుకునే క్రమంలో క్లెన్సింగ్, స్టీమింగ్ ప్రక్రియల వల్ల ముఖం తేమను కోల్పోయే అవకాశముంది. అందుకే ఆ తేమను తిరిగి చర్మానికి అందించాలంటే మాయిశ్చరైజేషన్ తప్పనిసరి. ఇందుకోసం మీ చర్మతత్వానికి సరిపోయే మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన మాయిశ్చరైజర్లు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే షియా బటర్, కలబంద గుజ్జు.. వంటి వివిధ పదార్థాలతో వీటిని తయారుచేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న మాయిశ్చరైజర్‌ను అరిచేతుల్లోకి తీసుకొని ముఖం, మెడ భాగాల్లో అప్త్లె చేసి చర్మంలోకి ఇంకేలా మర్దన చేసుకోవాలి. ఒకవేళ రాత్రుళ్లు ఫేషియల్ చేసుకున్నట్లయితే కళ్ల కింద ఐ క్రీమ్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా ఆ సమయంలో విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి కళ్లు రిలాక్సవడంతో పాటు కళ్ల కింద చర్మానికి పోషణ కూడా అందుతుంది.
చూశారుగా.. ఇంట్లోనే సులభంగా ఫేషియల్ ఎలా చేసుకోవచ్చో..! ఇలా చేస్తే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం, డబ్బులు ఖర్చు చేసే పని లేకుండానే న్యాచురల్ బ్యూటీగా మెరిసిపోవచ్చు. ఏమంటారు.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.. అయితే ఫేషియల్ చేసుకునే క్రమంలో మీ చర్మతత్వానికి నప్పే పదార్థాలు, క్రీమ్‌లు, ఫేస్‌మాస్క్‌ల గురించి సవివరంగా తెలుసుకోవాలంటే ఓసారి బ్యూటీ నిపుణుల సలహాలు తీసుకోవడం మరీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్