Published : 25/01/2023 19:19 IST

చెక్క పాత్రల్ని ఇలా శుభ్రం చేద్దాం!

ఆరోగ్యం, ట్రెండ్‌.. కారణమేదైనా వంట కోసం చెక్కతో తయారుచేసిన పాత్రలు, గరిటెలు ఉపయోగించడం ఇప్పుడు కామనైపోయింది. అయితే వీటి వాడకం ఎంత సులువో.. వీటిని శుభ్రం చేయడం అంత కష్టం. ఎందుకంటే ఈ పాత్రలపై ఉండే అతి సూక్ష్మ రంధ్రాల్లోకి చేరిన నూనె క్రమంగా జిడ్డుగా మారి బ్యాక్టీరియాను సులభంగా ఆకర్షిస్తుంది. తద్వారా మన ఆరోగ్యానికీ నష్టం.. మరోవైపు పాత్రల నాణ్యతా తగ్గిపోతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. చెక్కతో తయారుచేసిన పాత్రలు, గరిటెల్ని శుభ్రం చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

పాత్రలపై పేరుకున్న జిడ్డైనా, మురికైనా త్వరగా వదలగొట్టాలంటే.. వాటిని కాసేపు వేడి నీళ్లలో నానబెడతాం. చెక్క పాత్రల్ని శుభ్రం చేయడానికీ ఈ చిట్కాను పాటించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వేడి నీళ్లలో డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌/సోప్‌ వేసి తయారుచేసిన మిశ్రమంలో వీటిని కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత కడిగేస్తే జిడ్డుదనంతో పాటు దుర్వాసనలు కూడా తొలగిపోతాయి.

చెక్క పాత్రలపై పదార్థాల అవశేషాలకు సంబంధించిన మరకలు పడితే అంత సులభంగా పోవు. ఇలాంటప్పుడు వెనిగర్‌, నీళ్లు.. ఈ రెండూ సమపాళ్లలో తీసుకొని.. ఆయా పాత్రల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే శుభ్రం చేసి పొడిగా తుడిచేస్తే సరిపోతుంది.

బేకింగ్‌ సోడా కూడా చెక్క పాత్రల్ని శుభ్రం చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో వాటిపై కాస్త బేకింగ్‌ సోడా చల్లి.. కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఆపై మృదువుగా ఉండే స్క్రబ్బర్‌తో రుద్దితే.. అవి సులభంగా శుభ్రమవుతాయి.

కొన్నిసార్లు చెక్క పాత్రలు శుభ్రం చేశాక కూడా జిడ్డుగా కనిపిస్తాయి. అలాగని వాటిని వదిలేస్తే వాతావరణంలోని దుమ్ము, బ్యాక్టీరియా చేరి అనారోగ్యపూరితంగా తయారవుతాయి. ఇలాంటప్పుడు వాటిపై కాస్త బరకగా ఉన్న ఉప్పు చల్లి.. సగానికి కట్‌ చేసిన నిమ్మ చెక్కతో రుద్దాలి. తద్వారా నిమ్మలోని ఆమ్ల గుణాలు చెక్క పాత్రల్లోని జిడ్డుదనాన్ని తొలగించడంతో పాటు.. సువాసననూ వెదజల్లుతాయి.

నిమ్మరసం కలిపిన వేడి నీళ్లలో చెక్క పాత్రల్ని అరగంట పాటు నానబెట్టినా చక్కటి ఫలితం ఉంటుంది. తద్వారా పదార్థాల అవశేషాల కారణంగా వాటి నుంచి వచ్చే దుర్వాసనలు తొలగిపోతాయి. అలాగే అవి ఎక్కువ కాలం మన్నుతాయి కూడా!

శాండ్‌ పేపర్‌తో చెక్క పాత్రల్ని మరింత సమర్థంగా శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు. దీంతో పాత్రలపై రుద్దడం వల్ల.. వాటిపై ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల్లో ఇరుక్కున్న పదార్థాల అవశేషాలు సులభంగా తొలగిపోతాయి. అలాగే పాత్రలు మరింత మృదువుగానూ తయారవుతాయి.

చెక్క పాత్రల్ని శుభ్రం చేశాక.. వాటిపై కాస్త హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ చల్లడం వల్ల వాతావరణంలోని బ్యాక్టీరియా, క్రిములు చేరకుండా జాగ్రత్తపడచ్చు. అయితే తిరిగి వాటిని వాడే ముందు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

చెక్క పాత్రలు/గరిటెలు ఎక్కువ కాలం మన్నాలంటే.. శుభ్రం చేశాక వాటిపై కాస్త నూనె రాయడం మంచిది.

వీటిని చేత్తోనే శుభ్రం చేయాలి.. డిష్‌వాషర్లో వేయడం వల్ల అవి విరిగిపోయే అవకాశం ఎక్కువ.

అలాగే వీటిని తడిగా ఉన్నప్పుడే ర్యాక్‌లో భద్రపరచడం వల్ల వాటిపై ఫంగస్‌ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పొడిగా తుడిచి.. గాలికి పూర్తిగా ఆరాకే అల్మరాలో సర్దేయడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని