Mompreneur: అమ్మగా, వ్యాపారవేత్తగా.. రాణించాలంటే..!

అమ్మతనం ఫుల్‌టైమ్‌ ఉద్యోగం లాంటిది! ఎంత చేసినా పని తరగదు.. పిల్లలతో ఎంత గడిపినా తనివి తీరదు. ఇంత బిజీలోనూ వృత్తిఉద్యోగాలను స్వీకరించి.. సక్సెసవుతున్నారు ఎంతోమంది మహిళలు. అలాగే మరికొంతమంది వ్యాపారవేత్తలుగానూ....

Published : 20 Jun 2023 13:11 IST

అమ్మతనం ఫుల్‌టైమ్‌ ఉద్యోగం లాంటిది! ఎంత చేసినా పని తరగదు.. పిల్లలతో ఎంత గడిపినా తనివి తీరదు. ఇంత బిజీలోనూ వృత్తిఉద్యోగాలను స్వీకరించి.. సక్సెసవుతున్నారు ఎంతోమంది మహిళలు. అలాగే మరికొంతమంది వ్యాపారవేత్తలుగానూ రాణిస్తున్నారు. అయితే వారి విజయానికి వారు పాటించే సింపుల్‌ చిట్కాలే కారణమంటున్నారు నిపుణులు. అవే వారు తమ ఇంటిని - పనిని బ్యాలన్స్‌ చేసుకోవడానికి, తమకంటూ కాస్త వ్యక్తిగత సమయం కేటాయించుకోవడానికి దోహదం చేస్తున్నాయంటున్నారు. మరి, అటు అమ్మతనాన్ని, ఇటు వ్యాపారాన్ని ఏకకాలంలో నిర్వహిస్తూ సక్సెస్‌ కావాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి...

ముందు మీకోసం..!

ఇంటి పనులు, పిల్లల బాధ్యతల్లో పడిపోయి చాలామంది మహిళలు తమను తాము నిర్లక్ష్యం చేస్తుంటారు. నిజానికి ఈ అశ్రద్ధే.. వారి మానసిక ఒత్తిడికి కారణమై.. కెరీర్‌పై పూర్తి దృష్టి సారించకుండా అడ్డుపడుతుందంటున్నారు నిపుణులు. అందుకే రోజును ప్రారంభించే ముందే.. తమకు తాము కొంత సమయం కేటాయించుకోవాలంటున్నారు. ఈ క్రమంలో తమ అభిరుచులపై దృష్టి పెట్టడం, మనసుకు నచ్చిన పనిచేయడం.. వంటి వాటితో ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. తద్వారా శరీరంలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇదే రోజంతా యాక్టివ్‌గా పనిచేసే శక్తినిస్తుంది. ఇలా సానుకూల దృక్పథంతో రోజు ప్రారంభిస్తే.. వ్యాపారంలో మనం తీసుకునే నిర్ణయాలూ పాజిటివ్‌గా ఉంటాయని, ఇవే మన ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అవసరమైనవే..!

వ్యక్తిగతంగానైనా, కెరీర్‌ పరంగానైనా.. చేసే ప్రతి పని పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు చాలామంది మహిళలు. ఉన్న సమయంలోనే అన్ని పనులు పూర్తి చేయాలనుకుంటారు. అయితే ఈ పర్‌ఫెక్షనిజం అన్ని సందర్భాల్లోనూ మేలు చేయకపోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంటి పనులు, పిల్లల ఆలనా-పాలన, వ్యాపార బాధ్యతలు పోను.. మనకు మిగిలేది అతి కొద్ది సమయమే! ఆ సమయంలోనే మిగతా పనులు తలపెట్టుకొని ఒత్తిడికి గురయ్యే బదులు.. ప్రాధాన్యతల్ని బట్టి పనుల్ని విభజించుకుంటే.. అవసరమైన పనుల్నే ముందుగా పూర్తి చేసేయచ్చు.. మిగతావి తర్వాత వీలు చూసుకొని పూర్తిచేసుకోవచ్చు. ఇంటి పనులు-పిల్లల బాధ్యతల విషయాల్లోనే కాదు.. వ్యాపార నిర్వహణకూ ఇది వర్తిస్తుంది. అలాగే ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులు, పిల్లల సహాయం తీసుకోవడం మరీ మంచిది. దీనివల్ల ఒత్తిడీ ఉండదు, పనులూ త్వరగా పూర్తవుతాయి. ఇదీ పరోక్షంగా మన ఉత్పాదకత, కెరీర్‌ అభివృద్ధికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

పనికీ ఉండాలి.. హద్దు!

వ్యాపార నిర్వహణలో ఓ నిర్ణీత పని వేళలంటూ ఉండవు.. చాలాసార్లు పని రాక్షసుల్లా ఆఫీసుకే పరిమితవ్వాల్సి రావచ్చు. ఇలా అపరిమిత పనుల వల్ల మానసిక ఒత్తిడికి గురవడమే కాదు.. పనిలో నాణ్యత కూడా కొరవడుతుంది. అందుకే ఉద్యోగంలాగే వ్యాపారానికీ కచ్చితమైన పనివేళల్ని నిర్దేశించుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే పనుల ప్రాధాన్యతల్ని బట్టి ఆ రోజు పూర్తి చేయాల్సిన పనులు/మీటింగ్స్‌, ఇతర పనుల కోసం ఒక ప్రణాళిక వేసుకుంటే.. మధ్యమధ్యలో తడబడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ సమయంలోనే మనం అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేయగలిగితే సమయం ఆదా అవుతుంది. తద్వారా మనసుకు ప్రశాంతత, శరీరానికి ఉత్సాహం. కెరీర్‌లో చక్కటి ఉత్పాదకతను సొంతం చేసుకోవడానికి ఇవే కీలకం!

‘మల్టీ టాస్కింగ్‌’.. వద్దు!

కొంతమంది ఇంటి నుంచే వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇటు ఇంటి పనులు, అటు పిల్లల బాధ్యతను చూసుకుంటూనే.. మరోవైపు తమ బిజినెస్‌పై దృష్టి పెడుతుంటారు. ఈ మల్టీ టాస్కింగే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల పనిలో ఉత్పాదకత 40 శాతానికి పైగా తగ్గచ్చని ఓ అధ్యయనం రుజువు చేసింది. ఏకకాలంలో వివిధ రకాల పనులు చేయడం వల్ల ఏ పని పైనా పూర్తి దృష్టి పెట్టలేకపోవడమే ఇందుకు కారణం అంటోంది. కాబట్టి వ్యాపారం, ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు.. ఇలా దేనికోసం నిర్దేశించుకున్న సమయంలో ఆ పని పైనే దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ పనిలో సక్సెస్‌ కాగలుగుతాం.

కుటుంబం కోసం.. కాసేపు!

ఇంటి బాధ్యతలు, వ్యాపార నిర్వహణ.. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోవాలంటే.. ముందు మనకు మనం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇందుకోసం రోజూ కాసేపు పనులన్నీ పక్కన పెట్టి.. కుటుంబంతో తగిన సమయం గడపాలంటున్నారు నిపుణులు. మీ కెరీర్‌ పనులు, పిల్లల స్కూల్‌ దృష్ట్యా.. మూడు పూటలా అందరూ కలిసి తినే అవకాశం ఉండకపోవచ్చు.. కానీ ఏదో ఒక పూట.. మీ పిల్లలతో పాటు తినే వెసులుబాటు చేసుకోవడం ముఖ్యం. అలాగే అప్పుడప్పుడూ వెకేషన్లకూ ప్లాన్‌ చేసుకోవాలి. ఇలా కుటుంబం/పిల్లలతో సమయం గడుపుతున్నప్పుడు సోషల్‌ మీడియా, మొబైల్‌.. వంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేయాలి. అప్పుడే మీరు మీ పిల్లల్ని, మీ పిల్లలు మిమ్మల్ని మిస్సవకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా మీ అనుబంధమూ పెరుగుతుంది. ఇలా కుటుంబం నుంచి మీకు దక్కిన ప్రేమ.. వ్యాపారాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.. పనిలో ఉత్పాదకతను సైతం పెంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని