యాపిల్ ముక్కలు రంగు మారకుండా..!

యాపిల్‌ పండును ఒక్కసారి కట్‌ చేశాక, దాన్ని వెంటనే తినేయాలి.. లేదంటే.. యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ అనే ఎంజైమ్‌ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్‌ కలర్‌లోకి మారుస్తుంది. ఇలా ఎరుపెక్కిన యాపిల్‌ ముక్కల్ని చూస్తే అస్సలు తినాలనిపించదు.

Published : 05 Jul 2024 21:31 IST

యాపిల్‌ పండును ఒక్కసారి కట్‌ చేశాక, దాన్ని వెంటనే తినేయాలి.. లేదంటే.. యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ అనే ఎంజైమ్‌ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్‌ కలర్‌లోకి మారుస్తుంది. ఇలా ఎరుపెక్కిన యాపిల్‌ ముక్కల్ని చూస్తే అస్సలు తినాలనిపించదు. అయితే కొన్ని సందర్భాల్లో.. యాపిల్ కట్ చేసిన వెంటనే తినడం కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు వాటి రంగు మారకుండా ఉంటే బాగుంటుంది కదూ..! అందుకు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి.

⚛ కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లండి. నిమ్మరసంలోని సిట్రికామ్లం యాపిల్‌ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచడమే కాకుండా.. వాటిని రంగు మారనివ్వదు. లేదంటే ఇలా కూడా చేయచ్చు. కప్పు నీటిలో టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో యాపిల్‌ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు ఉంచినా చక్కటి ఫలితం ఉంటుంది. నిమ్మరసానికి బదులుగా పైనాపిల్‌ జ్యూస్‌ను ఉపయోగించినా అదే ఫలితాన్ని పొందచ్చు.

⚛ ఒక కప్పు మంచి నీళ్లలో, రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి కలపండి. ఇప్పుడు ఈ నీటిలో, కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల, యాపిల్‌ ముక్కలు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.

⚛ కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలను ఐస్‌ నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల యాపిల్‌ ముక్కలు కాసేపటి వరకు తాజాగా ఉంటాయి.

⚛ కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు ఎర్రబడకుండా ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో బంధించాల్సిందే. యాపిల్‌ని ముక్కలుగా కట్‌ చేసిన తర్వాత వెంటనే వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పెట్టి అందులో గాలి లేకుండా ఒత్తేయాలి. ఇప్పుడు ఈ బ్యాగ్‌ను అలాగే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. తద్వారా యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరపదు. ఫలితంగా యాపిల్‌ ముక్కలు ఎర్రబడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ కాస్త దాల్చిన చెక్క పొడిని కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై చల్లడం వల్ల ఆ ముక్కలు బ్రౌన్‌ కలర్‌లోకి మారకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకు దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లే కారణం. అలాగే దాల్చిన చెక్క పొడి వల్ల యాపిల్ ముక్కలకు మరింత రుచి చేకూరుతుంది కూడా!

⚛ ఒక్కోసారి యాపిల్ కట్ చేయడానికి ఉపయోగించే చాకు కూడా యాపిల్ ముక్కల్ని ఎర్రగా మార్చే అవకాశం ఉంటుంది. అందుకే పాతబడిన, తుప్పు పట్టిన చాకుల్ని ఉపయోగించకపోవడం మంచిది.

గమనిక: ఏ పండైనా సరే - సాధ్యమైనంతవరకు అప్పటికప్పుడు కట్ చేసుకుని, తాజాగా తినడమే అన్ని రకాలుగా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్