మీరు పనిచేసే చోట ఇలాంటి వారున్నారా?

ఉద్యోగంలో మన పని మనం చేసుకుపోవడం కొంతమంది సహోద్యోగులకు నచ్చదు..  ప్రతిభకు తగ్గ గుర్తింపు, పదోన్నతులు వస్తుంటే వాళ్లు జీర్ణించుకోలేరు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మనసులో పెట్టుకొని పైఅధికారుల దృష్టిలో....

Published : 06 Jun 2023 21:06 IST

ఉద్యోగంలో మన పని మనం చేసుకుపోవడం కొంతమంది సహోద్యోగులకు నచ్చదు..  ప్రతిభకు తగ్గ గుర్తింపు, పదోన్నతులు వస్తుంటే వాళ్లు జీర్ణించుకోలేరు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మనసులో పెట్టుకొని పైఅధికారుల దృష్టిలో మనల్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తుంటారు. మనతో కలుపుగోలుగా ఉంటూనే వెనక గోతులు తవ్వుతుంటారు. ఇలాంటి వారినే ‘Backstabbers (వెన్నుపోటు పొడిచే వారు)’గా పేర్కొంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. అయితే ఇలాంటి వారు దాదాపు ప్రతి సంస్థలోనూ ఉంటారంటున్నారు. అలాగని వాళ్లతో మనలేక ఉద్యోగం వీడే కంటే వాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడం ఉత్తమ ఉద్యోగి లక్షణం అని చెబుతున్నారు. మరి, అసలు పని ప్రదేశంలో వీరిని ఎలా గుర్తించాలి? వాళ్ల ప్రభావం మన కెరీర్‌పై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? రండి.. తెలుసుకుందాం..!

ఇలా చేస్తున్నారా?

పని ప్రదేశంలో సహోద్యోగుల్ని వెన్నుపోటు పొడవాలనుకునే వారిని వారి ఆలోచనలు, చేతలతో ఇట్టే గుర్తుపట్టేయచ్చని చెబుతున్నారు నిపుణులు.

అవసరమైన విషయాలను పక్కన పెట్టి అనవసర విషయాల గురించి మాట్లాడడం, ఎప్పుడు చూసినా అసంతృప్తికర వ్యాఖ్యలు చేయడం, ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడడం.. వంటివి చేస్తుంటారు.

చేసే పని విజయవంతమైతే బృందంలో వ్యక్తిగా అందులో పాలు పంచుకోవడానికి బదులు.. నా వల్లే ఈ ప్రాజెక్ట్‌ సక్సెసైందని, ఇదంతా నా క్రెడిటే అని గొప్పలు చెప్పుకుంటారు.

అదే ప్రాజెక్ట్‌ విఫలమైతే మాత్రం.. ఇదంతా ఎదుటివారి వల్లే జరిగిందంటూ వారిని నిందించడంలో ముందుంటారు. తప్పంతా వారిదే అయినట్లుగా మాట్లాడుతుంటారు.

ఐడియాలు, క్రియేటివిటీ ఇతరులవే అయినా.. వాటిని దొంగిలించి తనవేనని హెచ్చులకు పోతుంటారు.

పుకార్లు పుట్టించడంలో వీరు ముందుంటారు. అబద్ధాలు, రూమర్స్‌ని వ్యాప్తి చేస్తూ విషయాన్ని మరింత పెద్దది చేస్తుంటారు.

తెలివైన, సమర్థులైన నాయకుల్ని చూసి ఓర్వలేక.. తమ వక్ర బుద్ధి, కపట చేష్టలతో వారిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంటారు. ఎలాగోలా వారిని ఆ సంస్థ నుంచి బయటికి పంపించడానికి తెగించేవారూ లేకపోలేదు.

కామ్‌గా, తమ పని తాము చేసుకుపోయే ఉద్యోగులంటే వీరికి గిట్టదు. ఎలాగోలా వారిని తమ పని నుంచి మనసు మళ్లించి గొడవలకు ప్రేరేపించేలా చేస్తారు. ఇది చూసి లోలోపల సంతోషిస్తుంటారు.

అప్పటిదాకా మీ గురించి ఇతర ఉద్యోగులకు చెడుగా చెబుతుంటారు. కానీ మీరు వాళ్ల దగ్గరికెళ్లే సరికి మాత్రం మాట మారుస్తుంటారు. ఇలాంటి సడెన్‌ మార్పును వాళ్ల ముఖంలో, మాటల్లో ఇట్టే గుర్తించచ్చు.

ముల్లును ముల్లుతోనే తీయాలి!

నిజానికి ఇలాంటి వాళ్లుంటారన్న విషయం తెలియక చాలామంది మోసపోతుంటారు. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు.. వెన్నుపోటు పొడిచే వారిని దగ్గరగా ఉంటూనే ఎదుర్కోవాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

ఎదుటివారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసుకున్న మరుక్షణం నుంచి వారితో పూర్తిగా మాట్లాడడం మానేయకుండా.. కాస్త దూరం పెట్టాలి. ఇకపై వారితో పంచుకునే విషయాల్లోనూ జాగ్రత్త వహించాలి.

మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వ్యక్తులుగా మీరు వాళ్లని గుర్తించినా.. వెంటనే వారిపై విరుచుకుపడకూడదు. ఈ క్రమంలో మిమ్మల్ని ఎక్కడ, ఏ సందర్భంలో మోసం చేయాలనుకున్నారో.. వాటికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు సంపాదించి.. ఆ తర్వాత వారిని నిలదీయచ్చు.. అలాకాకుండా ముందే మీరీ పని చేస్తే.. అందరి ముందు వాళ్లు మిమ్మల్నే తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రమాదం ఉంది.

ప్రాజెక్ట్‌ విజయంలో కీలక పాత్ర మీదే అయినా.. క్రెడిట్‌ మాత్రం వాళ్లు తీసుకున్నట్లయితే.. ఆ సమస్యనూ ఓపికతో పరిష్కరించుకోవాలి. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌కు సంబంధించి మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు, ఇతర కంపెనీలు/సహోద్యోగులతో జరిపిన చర్చలకు సంబంధించిన ట్రాక్ రికార్డులు తప్పకుండా మీ దగ్గర ఉంటాయి. వాటిని మీ పైఅధికారులకు చూపి.. సున్నితంగానే వారిని ఫూల్‌ని చేయచ్చు.

మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వారితో మాట్లాడినప్పుడు, ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు, పని విషయంలో.. ఇలా ప్రతిదీ రికార్డ్ చేసి.. బ్యాకప్‌ పెట్టుకోవడం మర్చిపోవద్దు. వారి నుంచి ఆపద పొంచి ఉన్న సమయంలో అవే మిమ్మల్ని కాపాడతాయన్న విషయం విస్మరించకండి!

ఇలాంటి వారి గురించి పట్టించుకొని బాధపడకుండా.. ఇంతకుముందు కంటే పనిలో మరింత కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే.. ఎదుటివారు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే.. మీరే వారిని దెబ్బకొట్టేలా సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుపోవాలన్నమాట!

ఇప్పటిదాకా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మీ ఆలోచనల్ని మీ టీమ్‌తో పంచుకున్నప్పటికీ.. ఇకపై అలా చేయకుండా డైరెక్టుగా మీ పైఅధికారులతోనే వాటిని పంచుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇలాంటి వారి వల్ల మీకే కాదు.. ఇతర సహోద్యోగులకు, పైఅధికారులకూ ముప్పే! కాబట్టి వాళ్ల గురించి హెచ్చరికగా అందరికీ నాలుగు మాటలు చెప్పి.. వాళ్ల ప్రవర్తనను దగ్గర్నుంచి గమనించమని చెప్పాలి. తద్వారా వాళ్లెంత చెడ్డవాళ్లో అందరికీ తెలిసిపోతుంది. మీ మంచికి తగిన గౌరవం దక్కుతుంది.

సహోద్యోగులు/పైఅధికారులు.. ఇలా ఎవరి దగ్గరైతే మిమ్మల్ని చెడుగా చిత్రీకరించాలనుకున్నారో.. వాళ్లతో మరింత స్నేహభావాన్ని పెంచుకోవాలి. మీ పనితనాన్ని ప్రదర్శించాలి. ఇలా సున్నితంగానే వాళ్ల ప్లాన్‌ను తిప్పికొట్టాలి.

మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చూసే వాళ్లతో.. అసలు ఎందుకలా చేస్తున్నారని నేరుగా ఓసారి మాట్లాడి చూడండి.. ఈ క్రమంలో వాళ్లు అబద్ధం చెప్పడం, తిరిగి మిమ్మల్నే ఓ మాట అన్నా.. మీరు తిరగబడడం కాకుండా కూల్‌గా ఆ టాపిక్‌ అక్కడితో సద్దుమణిగేలా చూడాలి.. సమయం వచ్చినప్పుడు వాళ్ల గురించి అందరికీ ఆధారాలతో సహా రివీల్‌ చేయాలి. తద్వారా మీ ప్రొఫెషనలిజం, వాళ్ల పొగరు గురించి సంస్థలో ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది.

ఇక ఆఖరుగా.. వాళ్లలో మార్పు కోరుకోవడం కూడా ఉత్తమ ఉద్యోగి లక్షణం అంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా ఎదగలేరని వారితో ఓ మాట చెప్పి చూడండి.. ఇతరులను చూసి ఈర్ష్య పడడం కాకుండా వారితో పోటీ పడమని చెప్పండి. ఇలా నాలుగు మంచి మాటలు చెప్తే అర్థం చేసుకొని మారితే సరే సరి.. లేదంటే వారి ఖర్మ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్