అందుకే ఉప్పు తగ్గించాల్సిందే..!

ఏ వంటకాల్లోనైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అయితే కొంతమంది వీటి డోసు పెంచి వాడుతుంటారు. ఈ క్రమంలో ఉప్పు మితిమీరితే మాత్రం బీపీ, హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాలకు....

Published : 20 Jun 2023 13:12 IST

ఏ వంటకాల్లోనైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అయితే కొంతమంది వీటి డోసు పెంచి వాడుతుంటారు. ఈ క్రమంలో ఉప్పు మితిమీరితే మాత్రం బీపీ, హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ఉప్పును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను, ప్రత్యామ్నాయ మార్గాలను పాటించమంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా...

జామ పండు, పచ్చి మామిడి కాయ, మొక్కజొన్న.. వంటి వాటిపై ఉప్పు చల్లుకొని తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలాగే తినాలని ఇష్టపడే వారు ఉప్పుకు బదులుగా నిమ్మ పొడి (నిమ్మతొక్కలను ఎండబెట్టి చేసే పొడి), ఆమ్‌చూర్‌ పొడి (మామిడి కాయల్ని ఎండబెట్టి చేసే పొడి), వాము, మిరియాల పొడి, ఒరెగానో.. వంటివి ఉపయోగించుకోవచ్చు.. తద్వారా ఉప్పును తగ్గించుకోవచ్చు.

కూరలు వండుకునేటప్పుడు చాలామంది ముందే కారంతో పాటు ఉప్పు కూడా వేసేస్తుంటారు. కానీ కూర పూర్తిగా ఉడికిన తర్వాత.. దానిపై నుంచి కాస్త ఉప్పు చల్లినా రుచికి సరిగ్గా సరిపోతుందంటున్నారు నిపుణులు.

సాస్‌లు, నిల్వ పచ్చళ్లు.. మొదలైన వాటిలో ఉప్పు మోతాదుకు మించి ఉంటుంది. ఇలాంటివి అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం బాగా తగ్గించాలి.

పెరుగు, సలాడ్స్‌, పండ్లు.. వంటి వాటిలో కూడా ఉప్పు చల్లుకొని తినడం కంటే నేరుగా తినడమే మంచిది. తద్వారా వాటిలోని అసలు రుచి జిహ్వకు అందుతుంది.. అలాగే ఉప్పునూ తగ్గించుకున్నవాళ్లమవుతాం.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా ముఖం, పొట్ట, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అందుకే ఉప్పు మోతాదు క్రమంగా తగ్గించుకోవాలి.

చాలామందికి డైనింగ్‌ టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉంచడం అలవాటు.. అలాగే కొంతమంది తినేటప్పుడు ఉప్పు డబ్బాను తమ వెంటే ఉంచుకుంటారు. ఇలా కూడా ఎక్కువ ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం వల్ల ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

ఒకవేళ ఇప్పటికే బీపీ, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు.. ఉన్నట్లయితే రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఎంత మోతాదులో తీసుకోవచ్చో సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని