పెళ్లి చీరను పక్కన పెట్టేస్తున్నారా? ఇలా ట్రై చేసి చూడండి!

వేలకు వేలు డబ్బులు పోసి ఎంతో ముచ్చటపడి పెళ్లి చీర కొనుక్కుంటాం.. దానికి మ్యాచింగ్‌గా వేసుకునే డిజైనర్‌ బ్లౌజ్‌కయ్యే ఖర్చుకూ వెనకాడం. తీరా పెళ్లిలో ఒక్కసారి కట్టుకుంటామో లేదో.. తర్వాత దాని మొహం కూడా చూడం.. ఎందుకంటే పెళ్లి చీర వేరే సందర్భంలో కట్టుకుంటే బాగోదని! ఇదనే కాదు.. కొంతమంది ఒకసారి వేసుకున్న దుస్తుల్ని మరోసారి వేసుకోవడానికి సంకోచిస్తుంటారు.

Updated : 21 Aug 2021 18:14 IST

(Image for Representation)

వేలకు వేలు డబ్బులు పోసి ఎంతో ముచ్చటపడి పెళ్లి చీర కొనుక్కుంటాం.. దానికి మ్యాచింగ్‌గా వేసుకునే డిజైనర్‌ బ్లౌజ్‌కయ్యే ఖర్చుకూ వెనకాడం. తీరా పెళ్లిలో ఒక్కసారి కట్టుకుంటామో లేదో.. తర్వాత దాని మొహం కూడా చూడం.. ఎందుకంటే పెళ్లి చీర వేరే సందర్భంలో కట్టుకుంటే బాగోదని! ఇదనే కాదు.. కొంతమంది ఒకసారి వేసుకున్న దుస్తుల్ని మరోసారి వేసుకోవడానికి సంకోచిస్తుంటారు. అయితే ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మాత్రం తన పెళ్లి చీరను వివిధ అకేషన్స్‌లో విభిన్నంగా ధరించి అందరి మనసులు దోచేసింది. ఈ నేపథ్యంలోనే ‘నా పెళ్లి చీరను నేనెలా రిపీట్‌ చేశానో మీరే చూడండి!’ అంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టిందీ బ్యూటీ బ్లాగర్‌. చీర ఒక్కటే అయినా సందర్భానికి అనుగుణంగా దాన్ని ఎలా ధరించచ్చో చెప్పిన ఆమె చిట్కాలు మనందరికీ తప్పకుండా ఉపయోగపడతాయి.

అనుష్క ముల్చందానీ టాటా.. బ్యూటీ/ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, డిజిటల్‌ క్రియేటర్‌గా చాలామందికి ఆమె సుపరిచితమే! సౌందర్య చిట్కాలు, హెయిర్‌కేర్‌ చిట్కాలు, హెయిర్‌స్టైల్స్‌, సరికొత్త ఫ్యాషన్లను ఈ తరం అమ్మాయిలకు పరిచయం చేసే ఈ చిన్నది.. తాను రోజువారీ పాటించే బ్యూటీ/ఫ్యాషన్ టిప్స్‌ని సైతం ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ వీడియో పెట్టింది అనుష్క. తన పెళ్లి చీరను వివిధ సందర్భాల్లో ఎలా ధరించిందో అందులో చూపించింది. ఇలా ఒక అవుట్‌ఫిట్‌ను రిపీట్‌ చేసినప్పుడు ఇతరులు గుర్తుపట్టకుండా ఉండాలంటే.. దాన్ని విభిన్నంగా ఎలా ధరించచ్చో ప్రయోగపూర్వకంగా నిరూపించింది.

పెళ్లిలో ప్రిన్సెస్‌లా..!

తన పెళ్లి కోసం తెలుపు రంగు సీక్విన్‌ శారీని ఎంచుకుంది అనుష్క. దానికి మ్యాచింగ్‌గా గోల్డ్‌ కలర్‌ భారీ డిజైనర్‌ బ్లౌజ్‌, అదే రంగు సీక్విన్‌ దుపట్టాను తలపై నుంచి వెయిల్‌గా జత చేసింది. ఇక మెరిసే ఆభరణాలతో తన లుక్‌ని పూర్తిచేసిన ఆమె.. ప్రిన్సెస్‌గా దర్శనమిచ్చింది. నిజానికి ఈ చీరకట్టులో ఆమెను తన బంధువులంతా చూసే ఉంటారు.. పైగా పెళ్లి చీర కాబట్టి ఈ అవుట్‌ఫిట్‌ అందరికీ బాగా గుర్తుండిపోతుంది కూడా! అలాగని దీన్ని మరోసారి ధరించడానికి మొహమాటపడలేదామె. ఇదే చీరను విభిన్నంగా మరో ఐదు అకేషన్స్‌లో ధరించి అందరిచేతా ఔరా అనిపించుకుంది.

అదే చీర.. మరో నాలుగుసార్లు!

* ఆశ్చర్యమేంటంటే.. పెళ్లి చీరనే రిసెప్షన్‌కి ధరించింది అనుష్క. అయితే తలపై ధరించిన వెయిల్‌కి బదులుగా.. భారీగా డిజైన్‌ చేసిన ఫుల్‌ స్లీవ్స్‌ లాంగ్‌ జాకెట్‌ను తన అటైర్‌కు జత చేసింది. దీంతో అందరి కళ్లూ చీరపై కాకుండా.. తన లవ్లీ జాకెట్‌పై పడేలా చేసుకుంది.. సో.. ఎవరైనా గుర్తుపట్టేసినా.. అరే ఈ క్రేజీ కాంబినేషన్‌ భలే ఉందే అన్నారే తప్ప.. ఇది పెళ్లి చీరే కదా అని పెదవి విరవలేదు!

* తన కజిన్‌ పెళ్లిలో ఇదే అవుట్‌ఫిట్‌తో మాయ చేసిందీ ఫ్యాషనర్‌. అయితే ఈసారి ఆరెంజ్‌ కలర్‌ స్కర్ట్‌కి పెళ్లి చీర బ్లౌజ్‌, దుపట్టాను జతచేసి తళుక్కుమంది.

* తన స్నేహితురాలి వివాహంలో అదే పెళ్లి చీరను ధరించి.. బ్లౌజ్‌, ఆభరణాలు మాత్రం మార్చింది. ఈ లుక్కూ ఎవరూ గుర్తుపట్టలేదంటూ తన క్రియేటివిటీతో చెప్పకనే చెప్పిందీ క్యూటీ.

* ఇక మరో ఫంక్షన్‌లో భాగంగా క్రీమ్‌ కలర్‌ స్కర్ట్‌, పింక్‌ బ్లౌజ్‌ ధరించిన ఆమె.. తన రిసెప్షన్‌ కోసం ఎంచుకున్న లాంగ్‌ జాకెట్‌ను దీనికి జత చేసి వావ్‌ అనిపించింది.

ఇలా అనుష్క క్రియేటివిటీని చూసిన నెటిజెన్లు ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌కు ఫిదా అవుతున్నారు. ‘మాకూ ఇలా అవుట్‌ఫిట్స్‌ రిపీట్‌ చేయడమంటే ఇష్టమని.. అయితే అందుకోసం చక్కటి చిట్కాలు చెప్పారం’టూ చాలామంది అమ్మాయిలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

ఎవరూ గుర్తుపట్టకూడదంటే..!

రోజువారీ వేసుకున్న దుస్తులు పదే పదే ధరించడం విషయంలో అమ్మాయిలు అంతగా పట్టించుకోకపోవచ్చు.. కానీ ప్రత్యేక సందర్భాల్లో వేసుకున్న అవుట్‌ఫిట్స్‌ని మరోసారి ధరించడానికి సంకోచిస్తుంటారు. అయితే మరో ఆలోచన లేకుండా డ్రస్‌/శారీ రిపీట్‌ చేసినా ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలంటే వాటిని ధరించే విషయంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు.

* పార్టీ వేర్‌ టాప్స్‌/బాటమ్స్‌.. వంటివి రిపీట్‌ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో ఇదే మ్యాచింగ్‌ కాకుండా ఈసారి ఈ టాప్‌ వేసుకుంటే దానికి వేరే స్కర్ట్‌ మ్యాచ్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. మరోసారికి ఇదివరకు వేసుకున్న బాటమ్‌కి కొత్త టాప్‌ను జత చేస్తే ఒక అవుట్‌ఫిట్‌ను పదే పదే రిపీట్‌ చేసినా ఇబ్బందిగా అనిపించదు.

* ఇక చీరలు, అనార్కలీ.. వంటివి పదే పదే ధరించాల్సి వచ్చినప్పుడు.. వాటికి మ్యాచింగ్‌ జాకెట్స్‌, కేప్‌.. వంటివి జత చేస్తే ఇటు ఫ్యాషనబుల్‌గా కనిపించచ్చు.. అటు మళ్లీ అదే డ్రస్‌ ధరించారన్న ఆలోచన ఎదుటివారికి రాకుండా జాగ్రత్తపడచ్చు.

* దుస్తులు రిపీట్ చేసినప్పుడు యాక్సెసరీస్‌ మార్చడం వల్ల కూడా కొంత వరకు కంఫర్టబుల్‌గా కనిపించచ్చంటున్నారు ఫ్యాషనర్లు. ఈ క్రమంలో జ్యుయలరీ రిపీట్‌ కాకుండా చూసుకోవడం, బెల్టులు ధరించడం, హెయిర్‌ స్టైల్‌ మార్చడం.. ఇలా మీ లుక్‌లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు.

అయితే ఏది ధరించినా మీకు నప్పుతుందో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా లుక్‌ చెడిపోకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ దుస్తులు రిపీట్‌ చేసేటప్పుడు మ్యాచింగ్స్‌ విషయంలో మీకేమైనా సందేహాలుంటే తెలిసిన వాళ్లు, ఫ్యాషన్‌ నిపుణుల సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు.

మరి, దుస్తులు రిపీట్‌ చేసేటప్పుడు ఇతరులు గుర్తు పట్టకుండా ఉండాలంటే మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తారు? మాతో పంచుకోండి..! అందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్