పాప పుట్టాక లావయ్యా.. నేనంటే ఆయనకు ఇష్టం తగ్గింది..!

నాలుగు నెలల క్రితం నాకు పాప పుట్టింది. అప్పట్నుంచి విపరీతంగా బరువు పెరిగా. దానివల్ల నా భర్తకు నాపై ఇష్టం తగ్గినట్టుగా అనిపిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా నా బరువు గురించి హేళన చేయడమే ఇందుకు కారణం.

Updated : 21 Aug 2023 19:28 IST

(Representational Image)

నాలుగు నెలల క్రితం నాకు పాప పుట్టింది. అప్పట్నుంచి విపరీతంగా బరువు పెరిగా. దానివల్ల నా భర్తకు నాపై ఇష్టం తగ్గినట్టుగా అనిపిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా నా బరువు గురించి హేళన చేయడమే ఇందుకు కారణం. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఆ ఒత్తిడిలో మరింత ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నా. ఫలితంగా శరీర బరువును అదుపులో ఉంచుకోలేకపోతున్నా. ఆయన అనే మాటలు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. వివిధ దశల్లో శారీరకంగా అనేక మార్పులు చోటు చేసుకోవడం సహజం. ఇందులో భాగంగానే కొంతమంది విపరీతంగా బరువు పెరుగుతుంటారు. మీ విషయంలో కూడా పిల్లలు పుట్టిన తర్వాత బరువు పెరిగానని చెబుతున్నారు. అయితే ఆ విషయాన్ని మీ భర్త జీర్ణించుకోలేకపోతున్నారని, అందువల్లే మీపై అయిష్టత పెరిగిందని అర్థమవుతోంది. అయితే దాన్ని మనసులో ఉంచుకోకుండా సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తూ మిమ్మల్ని హేళన చేస్తున్నాడని అంటున్నారు. అవి మిమ్మల్ని తీవ్రంగా బాధపెడుతున్నాయి. నిజానికి ఇలాంటి సందర్భాల్లో భర్త సహకారం ఎంతో అవసరం. కానీ, మీ విషయంలో అది జరగడం లేదు. ఆ ఒత్తిడిలో మీరు మరింత ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నానని అంటున్నారు. దానివల్ల మీ బరువును నియంత్రించుకోలేకపోతున్నారు. కాబట్టి, ఇప్పటికైనా మీ సమస్యను మీ భర్తతో వివరించండి. ఈ క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు బరువు పెరగడం సాధారణమేనన్న విషయాన్ని వివరించండి. అలాగే అతను అనే మాటలు మిమ్మల్ని ఎంతగా బాధపెడుతున్నాయో చెప్పండి. దానివల్ల అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే పిల్లలు పుట్టిన తర్వాత బరువు పెరగడం సాధారణమే అయినప్పటికీ ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో ఒకసారి పోషకాహార నిపుణులను సంప్రదించండి. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారు. తద్వారా బరువునూ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి యోగా, ధ్యానం చేయడానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని