హనీమూన్ తర్వాత.. నేనిక్కడ.. ఆయనక్కడ!
నాకు పెళ్లై అయిదు నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నా భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటాడు. వారాంతాల్లో మాత్రమే ఇంటికి వస్తారు. ఆఫీసులోనూ బిజీగా ఉంటారు. దాంతో ఫోన్లు, మెసేజ్‌లు ద్వారా కూడా మాట్లాడే సమయం లభించదు.
నాకు పెళ్లై అయిదు నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నా భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటాడు. వారాంతాల్లో మాత్రమే ఇంటికి వస్తారు. ఆఫీసులోనూ బిజీగా ఉంటారు. దాంతో ఫోన్లు, మెసేజ్‌లు ద్వారా కూడా మాట్లాడే సమయం లభించదు. వారాంతాల్లోనైనా సంతోషంగా గడుపుదామంటే వరసగా పని చేయడంతో నా భర్త విశ్రాంతికే ప్రాధాన్యమిస్తాడు. హనీమూన్ తర్వాత మేమిద్దరం శారీరకంగా దగ్గరైంది కూడా తక్కువే. దీనికి తోడు మేమిద్దరం మా అభిప్రాయాలను, ఆకాంక్షలను ఒకరితో ఒకరం ఓపెన్‌గా పంచుకోలేం. దానివల్ల మాకు లభించే కొద్ది సమయాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే నా భర్త కంటే ఎక్కువ సమయం అత్తమామలతోనే గడుపుతున్నాను. ఇలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకనిపిస్తోంది. ఈ విషయాన్ని నా భర్తతో కూడా చర్చించాను. దానికి ‘ఈ పరిస్థితి కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పర్మినెంట్‌గా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది’ అంటున్నాడు. కానీ, ప్రస్తుతం ఈ ఎడబాటును జీర్ణించుకోలేకపోతున్నాను. ఎక్కువ సన్నిహితంగా ఉండాల్సిన సమయంలోనే దూరంగా ఉంటున్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య బంధం బలపడుతుందా? ఒకవేళ ఈ విషయంలో నేను అతిగా ఆలోచిస్తున్నానా? నా భర్తతో ఎక్కువ సమయం గడపాలనుకోవడం తప్పా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నుంచి ఉద్యోగరీత్యా మీ భర్త దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అలాగే మీ దాంపత్య బంధం కూడా బలహీనంగా ఉందని అంటున్నారు. అయితే మీ మొత్తం ప్రశ్నలో మీ భర్త లేదా అత్తమామలతో ఎలాంటి సమస్యలు ఉన్నట్టుగా చెప్పలేదు. పెళ్లైన కొత్తలో జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం సహజం. అయితే దాంపత్య బంధంలో ఉద్యోగ జీవితమూ ముఖ్యమే. అలాగే తనతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్న విషయాన్ని మీరు మీ భర్తతో ఇప్పటికే చర్చించారు కూడా. అందుకు అతను మరికొంత సమయం పడుతుందని చెప్పారన్నారు. మీ దాంపత్య బంధం ఇప్పుడే ప్రారంభమైంది. మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి, అతను చెప్పినట్టుగా ఆ సమయం వరకు వేచి చూస్తూనే ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించండి.
వైవాహిక జీవితంలో శారీరక బంధం కూడా చాలా ముఖ్యం. మీ భర్త దూరంగా ఉండడం, అందులోనూ ఇద్దరూ అంతర్ముఖులు కావడం వల్ల దాంపత్య బంధంలో సమస్యలు ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇప్పటినుంచైనా లభించిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీ అసంతృప్తిని దూరం పెట్టి భర్తకు దగ్గరవ్వడానికి ప్రయత్నించండి. అలాగే అతన్ని నిరుత్సాహపరచకుండా ధైర్యాన్ని నింపండి. అలాగే మీ భర్తకు సెలవులు లభించినప్పుడు దగ్గరలో ఉన్న ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లండి. మీ దాంపత్య బంధం కచ్చితంగా దృఢమవుతుంది. ఒకవేళ అప్పటికీ సమస్యలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
మీరు ఎక్కువ సమయం అత్తమామల దగ్గరే ఉంటున్నానని చెబుతున్నారు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రయత్నించి చూడండి. దీనివల్ల మీ భర్త దూరంగా ఉన్నారన్న ఆలోచనలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మీ భవిష్యత్తుకు కూడా భరోసా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.