సింగపూర్ భామల ‘సొగసు’ వెనుక..!

ప్రస్తుతం అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో పద్ధతులున్నాయి. అయితే ఎన్నున్నా తాము మాత్రం సహజసిద్ధమైన పదార్థాలకే ఓటేస్తామంటున్నారు సింగపూర్ మగువలు. పాత కాలపు సౌందర్య పద్ధతుల్ని పాటించడమే తమ అపురూప లావణ్యానికి ప్రధాన కారణమంటున్నారు. మరి, ఇంతకీ వాళ్ల బ్యూటీ సీక్రెట్స్‌.....

Updated : 29 Jul 2022 19:56 IST

ప్రస్తుతం అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో పద్ధతులున్నాయి. అయితే ఎన్నున్నా తాము మాత్రం సహజసిద్ధమైన పదార్థాలకే ఓటేస్తామంటున్నారు సింగపూర్ మగువలు. పాత కాలపు సౌందర్య పద్ధతుల్ని పాటించడమే తమ అపురూప లావణ్యానికి ప్రధాన కారణమంటున్నారు. మరి, ఇంతకీ వాళ్ల బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

చర్మానికి తేమనందించడానికి..

చర్మం తాజాగా కనిపించాలన్నా, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నవయవ్వనంగా మెరిసిపోవాలన్నా.. చర్మం తేమగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకోసం నీళ్లు ఎక్కువగా తాగడం, చక్కటి పోషకాహారం తీసుకోవడం.. వంటివి కామనే. వీటితో పాటు సింగపూర్ మగువలు తమ చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి ఒక సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ను కూడా ఉపయోగిస్తుంటారు. బాగా పండిన అవకాడో లేదా బొప్పాయి లేదా రెండూ కలిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం తేమను సంతరించుకుంటుంది. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మం పొడిబారిపోయి పొలుసులుగా వూడిపోయే సమస్యను తగ్గిస్తుంది. తద్వారా చర్మం తాజాగా, ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది.

'గులాబీ'లా కోమలంగా..!

సాధారణంగా ఫేషియల్ ఇంట్లో చేసుకున్నా, పార్లర్‌లో చేసినా కాస్త సమయంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు ఫేషియల్ చేసుకోవడానికి అంత సమయమూ అక్కర్లేదు.. అంత కష్టపడాల్సిన పనీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ సౌందర్యాన్ని సంరక్షించుకోవడానికి వివిధ రకాల ఫేషియల్ షీట్ మాస్కులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సహజసిద్ధమైన పదార్థాలతోనే అవి తయారవుతున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకునే అమ్మాయిల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే తామూ తమ అందాన్ని సంరక్షించుకోవడానికి వివిధ రకాల ఫేషియల్ షీట్ మాస్కుల్ని ఉపయోగిస్తామని అంటున్నారు సింగపూర్ అతివలు. ముఖ్యంగా రోజ్ గోల్డ్ షీట్ మాస్క్‌లతో చర్మంపై పడే గీతలు, ముడతలు.. వంటివి తక్షణమే తొలగిపోతాయట!

ఈ నూనెతో సమస్యలన్నీ పరార్!

జుట్టు, గోళ్లను సంరక్షించుకోవడానికి సింగపూర్‌ అతివలు ఆర్గాన్ ఆయిల్ వాడుతుంటారు. ఆర్గాన్ చెట్టు గింజల నుంచి సేకరించే ఈ నూనెలో విటమిన్ 'ఇ', ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి లోలోపలి నుంచి తేమను అందించి నవయవ్వనంగా, తాజాగా కనిపించేలా చేస్తాయి. అలాగే వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తాయి. ఇందుకోసం ఈ నూనెతో చర్మం, జుట్టు, గోళ్లను కాసేపు మర్దన చేసుకోవాల్సి ఉంటుంది.

'కొబ్బరి నూనె'తో కేశ సంరక్షణ!

సింగపూర్‌లో హ్యూమిడిటీ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఏడాది పొడవునా దాదాపు ఇదే వాతావరణం ఉంటుంది. ఫలితంగా చర్మం, జుట్టు కుదుళ్లు పదే పదే జిడ్డుగా మారతాయి. తద్వారా జుట్టు ఎక్కువగా రాలిపోవడం, చుండ్రు, గడ్డిలా మారడం.. వంటి సమస్యలొస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి.. పడుకునే ముందు కుదుళ్లకు, జుట్టుకు కొబ్బరి నూనెను పట్టించి.. కాసేపు మర్దన చేసుకుంటారు. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తారు. ఇలా సింగపూర్‌ మగువలు తమ జుట్టును సంరక్షించుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్