120 భాషల్లో 120 పాటలతో గిన్నిస్‌కెక్కింది!

మూడేళ్ల వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భారతీయ భాషలతో మొదలెట్టి విదేశీ భాషల్లోనూ పాటలు పాడడం నేర్చుకుంది. అలుపెరగని తన గాన ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. తనే 16 ఏళ్ల సుచేతా సతీష్‌.

Published : 11 Oct 2021 19:47 IST

(Photo: Twitter)

మూడేళ్ల వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భారతీయ భాషలతో మొదలెట్టి విదేశీ భాషల్లోనూ పాటలు పాడడం నేర్చుకుంది. అలుపెరగని తన గాన ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. తనే 16 ఏళ్ల సుచేతా సతీష్‌. భారత సంతతికి చెందిన ఈ అమ్మాయి ఇటీవల ఓ సంగీత విభావరిలో 7:20 గంటల పాటు 120 భాషల్లో 120 పాటలు ఆలపించింది. అందుకు గాను తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

గాన ప్రతిభతో గిన్నిస్‌లోకి!

భారత 75వ స్వాతంత్ర్య వేడుకలతో పాటు దుబాయి అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 19న దుబాయి కాన్సులేట్‌ కార్యాలయంలో ‘మ్యూజిక్‌ బియాండ్‌ బోర్డర్స్‌’ పేరుతో ఓ ప్రత్యేక సంగీత కచేరీ నిర్వహించారు. ఈ వేదిక పైనే ఏడున్నర గంటల 20 నిమిషాల్లో 120 భాషల్లో 120 పాటలు పాడింది సుచేత.

అమ్మ పాటతో ముగించింది!

సుచేత ఆలపించిన 120 పాటల్లో 29 భారతీయ భాషలు, 91 విదేశీ భాషలున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన తన సంగీత విభావరి రాత్రి 7.20 నిమిషాలకు ముగిసింది. ముందుగా ‘Dhwani’ అనే మలయాళ సినిమాలోని ‘Janaki Jane’ అనే సంస్కృత పాటతో ప్రారంభించిన సుచేత...చివరగా తన తల్లి రాసిన హిందీ పాటతో తన కచేరీని ముగించింది. ఇందుకు గాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ఇటీవల ఆమెను స్వయంగా కలిసి సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు.

మూడేళ్ల ప్రాయం నుంచే!

ప్రస్తుతం దుబాయిలోని ‘ది ఇండియన్ హైస్కూల్‌’ లో 11వ తరగతి చదువుతోంది సుచేత. తండ్రి సతీష్‌ డెర్మటాలజిస్టు కాగా, తల్లి సుమిత  అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ దుబాయిలో  పనిచేశారు. ఆమెకు సంగీతంలోనూ ప్రావీణ్యముంది. కేరళలోని కన్నూర్‌ ప్రాంతానికి చెందిన వీరు తమ కూతురుకు రెండేళ్ల వయసున్నప్పుడు దుబాయి వెళ్లి స్థిరపడ్డారు. ఇక  అమ్మానాన్నల ప్రోత్సాహంతో మూడేళ్ల ప్రాయంలోనే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది సుచేత. నాలుగేళ్ల వయసులో ధైర్యంగా స్టేజ్ ఎక్కి పాటలు ఆలపించింది. ఎనిమిదేళ్ల వయసు నాటికే హిందుస్థానీ సంగీతంలో పట్టు సాధించింది. అంతేకాదు.. తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ.. తదితర భారతీయ భాషలు నేర్చుకుని ఆ భాషల్లోనూ పాటలు ఆలపించడం అలవాటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..’ అనే తెలుగు పాటను కూడా పాడి అందరిచేతా శెభాష్ అనిపించుకుంది ఈ సింగింగ్‌ సెన్సేషన్‌.

 

132 భాషల్లో పాడేస్తోంది!

ప్రస్తుతం భారతీయ భాషలతో కలిపి మొత్తం 132 భాషల్లో ఎంతో అలవోకగా, చక్కగా పాటలు ఆలపిస్తోంది సుచేత. ‘నేను ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం వెనక అమ్మానాన్నల సహకారం, ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఇక దుబాయి అనేది వివిధ భాషలు, సంస్కృతుల సమాహారం. ఇక్కడ భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు పెద్ద సంఖ్యలో నివాసముంటున్నారు. ఇక్కడ ఉండే నా స్నేహితులు, సన్నిహితుల సహకారంతో పలు విదేశీ భాషలపై పట్టు పెంచుకున్నాను. నేను పాడే పాటల్లో ఏవైనా లోపాలున్నా, సరిగ్గా పలకకపోయినా వారు సరిచేసేవారు. సాధారణంగా నేను ఒక పాట నేర్చుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. ఒకవేళ అందులోని పదాలు పలకడానికి సులభంగా ఉంటే ఇంకా త్వరగా నేర్చుకుంటా. పాట మరీ చిన్నదైతే అరగంట చాలు.. ఇక ఫ్రెంచ్, హంగేరియన్, జర్మన్ భాషలు నాకు కాస్త కష్టంగా అనిపించాయి. ఆ భాషల్లో పాటలు నేర్చుకోవడానికి మాత్రం రెండు మూడు రోజులు పట్టేది. నేను 200 భాషల్లోనూ పాడగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది. అయితే దానికి మరికొంత సమయం పడుతుంది’ అని అంటోంది సుచేత.

పాటలతో ప్రపంచ రికార్డులు!

నాలుగేళ్ల క్రితం దుబాయిలో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో నిరంతరాయంగా 6:15 గంటల పాటు 102 భాషల్లో పాటలు పాడి రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుందీ యంగ్‌ సింగర్‌. ఇందులో భాగంగా ఒకే సంగీత కచేరీలో ఎక్కువ భాషల్లో పాటలు పాడిన రికార్డు ఒకటైతే.. సుదీర్ఘ సమయం పాటు (6:15 గంటల పాటు) పాటలు పాడిన బాలికగా రెండో ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకుంది సుచేత. ఈ క్రమంలోనే తన గాన ప్రతిభకు గుర్తుగా మూడేళ్ల క్రితం ‘ప్రపంచ బాల మేధావి’ బిరుదాన్ని కూడా అందుకుంది.

 

సాయం చేయడంలోనూ!

2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు సుచేత తన స్నేహితులు, సన్నిహితులతో విరాళాల సేకరణ చేపట్టింది. మొత్తం రూ.5 లక్షలను సేకరించి సీఎం సహాయనిధికి పంపింది. ఇక కరోనా సమయంలో వైరస్‌పై అవగాహన కల్పిస్తూ 22 భారతీయ భాషలతో పాటు మొత్తం 32 భాషల్లో పాటలు విడుదల చేసిందీ సూపర్‌ సింగర్‌. కేరళలో కరోనా గొలుసును తెంపడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈమె పాటలను ఆయుధంగా ఎంచుకోవడం విశేషం.

శ్రేయాఘోషల్ నా రోల్‌ మోడల్‌!

ప్రస్తుతం ఆశామేనన్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసుల దగ్గర శిక్షణ పొందుతున్న సుచేత ప్లే బ్యాక్‌ సింగర్‌ కావాలని కలలు కంటోంది. ‘నేను సంగీతంలో శ్రేయాఘోషల్‌ను రోల్ మోడల్‌గా తీసుకుంటాను. ఆమెలా మంచి ప్లే బ్యాక్‌ సింగర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా. అలాగని చదువును నిర్లక్ష్యం చేయను. ఉన్నత చదువులు అభ్యసించి సైకాలజిస్ట్‌ కావాలనుకుంటున్నాను’అని తన ప్రణాళికల గురించి వివరిస్తోందీ సింగింగ్‌ సెన్సేషన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్