ఎనిమిదేళ్ల వయసులో కజిన్ లైంగికంగా వేధించేవాడు!

లావుంటే.. ‘పెళ్లెలా అవుతుంది?’ అంటారు. సన్నగా ఉంటే.. ‘ఒంట్లో కేజీ కండ లేద’ని ఎగతాళి చేస్తుంటారు. ఇలా ఎదుటివారిలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపుతూ.. వారిని మానసికంగా కుంగదీస్తుంటారు కొందరు. ఈ పరిస్థితినే ఆసరాగా తీసుకొని అవతలి వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ఓ మహిళ.

Published : 04 Jun 2024 12:25 IST

లావుంటే.. ‘పెళ్లెలా అవుతుంది?’ అంటారు. సన్నగా ఉంటే.. ‘ఒంట్లో కేజీ కండ లేద’ని ఎగతాళి చేస్తుంటారు. ఇలా ఎదుటివారిలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపుతూ.. వారిని మానసికంగా కుంగదీస్తుంటారు కొందరు. ఈ పరిస్థితినే ఆసరాగా తీసుకొని అవతలి వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ఓ మహిళ. చిన్నతనంలో లావుగా ఉందన్న కారణంగా లైంగిక వేధింపులకు గురైన ఆమె.. పెద్దయ్యాక ప్రేమ బంధంలోనూ విఫలమైంది. ఆపై వైవాహిక బంధంలోనూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. ఇలా జీవితంలో అడుగడుగునా ఎన్నో కష్టాలు.. అవమానాలు భరించినా.. ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో నిలదొక్కుకుంది.. తనలాంటి మహిళలెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది! ప్రస్తుతం ఒంటరి తల్లిగా తన బిడ్డకు అన్నీ తానై పెంచుతోంది. మోడువారిన తన జీవితంలో తన బిడ్డే తిరిగి వెలుగులు నింపిందంటోన్న ఆమె.. తన కష్టాల కడలిని, దానిని అధిగమించిన వైనాన్ని ‘Share Your Story’ వేదికగా ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకుంది. మరి, ఇంతకీ ఎవరామె? ఆమె కథేంటి? తన మాటల్లోనే..!

నా పేరు గీత. మాది వైజాగ్‌. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్న వ్యాపారి. అమ్మ గృహిణి. నాకో తమ్ముడు. అమ్మానాన్న నన్ను, తమ్ముడిని ఎంతో ప్రేమగా పెంచారు. చదువు మొదలు దుస్తుల వరకు.. ప్రతి విషయంలో మా ఎంపికలకే ప్రాధాన్యమిచ్చేవారు. ఏనాడూ మా ఇద్దరిలో ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూసింది లేదు. ప్రతి విషయంలోనూ సమానత్వాన్ని చూపేవారు. అయితే నేను చిన్నతనం నుంచే కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దీన్నే అలుసుగా తీసుకొని మా బంధువులు నన్ను మాటలతో హింసించేవారు. ‘ఇంత లావుంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అంటూ అవహేళన చేసేవారు. నా ఎనిమిదేళ్ల వయసులో నాకు కజిన్‌ వరుసైన ఒకబ్బాయి చేతిలో చాలాసార్లు లైంగిక వేధింపులకూ గురయ్యా. తెలిసీ తెలియని పసితనంలో ఈ విషయాన్ని మా అమ్మానాన్నలతో ఎలా చెప్పాలో అర్థం కాక ఈ విషయాన్ని ఎన్నో ఏళ్ల పాటు నాలోనే దాచుకున్నా. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రతి ఒక్కరికీ బాల్యం ఓ అందమైన జ్ఞాపకమైతే.. నాకు మాత్రం మర్చిపోలేని ఓ చేదు నిజం!

******

బాల్యంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, అయిన వారి లైంగిక వేధింపులు మనసును గాయం చేసినా.. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్లో, కాలేజీలో మంచి మార్కులతో పాసయ్యా. అయితే బాల్య స్మృతుల కారణంగా ఎప్పుడూ ఒంటరిగా సమయం గడపడానికి ఆసక్తి చూపేదాన్ని. ఇదే క్రమంగా నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేసింది. 23 ఏళ్ల దాకా ఈ సమస్యతోనే సతమతమయ్యా. క్షణమొక యుగంగా, రోజూ నరకం చూసేదాన్ని. ఇలా నా పరిస్థితి చూసి అమ్మానాన్నలు నాకేమైపోయిందోనని భయపడిపోయారు. దాంతో వారికి అసలు నిజం చెప్పక తప్పలేదు. ఈ విషయం తెలిసి వాళ్లు నెగెటివ్‌గా స్పందిస్తారనుకున్నా.. కానీ వాళ్ల మాటలతో నాలో ధైర్యం నూరిపోశారు. ‘చేయని పొరపాటుకు నువ్వెందుకు బాధపడతావ్‌?’ అంటూ అండగా నిలిచారు. ఇలా అమ్మానాన్నల మద్దతుకు తోడు, సైకాలజిస్ట్‌ అందించిన చికిత్సతో డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా.

డిగ్రీ పూర్తయ్యాక ఒక అబ్బాయిని ప్రేమించా.. అతడూ నన్ను ఇష్టపడ్డాడు. కానీ మనస్పర్థల  కారణంగా మా ప్రేమ ఆరు నెలలకు మించి కొనసాగలేదు. ఆ తర్వాత అమ్మానాన్నలు నాకో సంబంధం చూసి పెళ్లి చేశారు. నిజానికి ఈ పెళ్లి కూడా నా మనస్ఫూర్తిగా జరిగింది కాదు. ఎందుకంటే చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, ప్రేమ వైఫల్యం.. ప్రతి క్షణం నన్ను వెంటాడేవి. వీటిని దాచిపెట్టి నా భర్తను మోసం చేస్తున్నానేమోనని అనిపించేది. అతడూ నాపై ఏమాత్రం ప్రేమను చూపించేవాడు కాదు.. నాతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించేవాడు. ఏ విషయంలోనూ అతడి నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. ఇలా వివిధ కారణాల వల్ల పెళ్లి బంధం కూడా వీగిపోయింది. దాంతో తిరిగి పుట్టింటికి చేరాను. చేతిలో డిగ్రీ పట్టా ఉన్నా తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి నాది. అలాగని అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు. అందుకే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. భయం, మొహమాటం, బిడియం, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని నాకు.. అదృష్టవశాత్తూ బీపీఓ ఉద్యోగం వచ్చింది. చెన్నైలోని ఓ కంపెనీలో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరాను. సమస్యల ఊబిలో కూరుకుపోయిన నాకు ఈ ఉద్యోగం ఎంతో ఉపశమనాన్నిచ్చింది. నా జీవితానికే టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది.

******

అప్పటిదాకా మరొకరి తోడు లేనిదే వీధి కూడా దాటని నాకు ఈ ఉద్యోగం ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. కొన్నాళ్లకు ఈ సంస్థలో పనిచేసే ఓ ఫ్రెండ్‌ సలహా మేరకు బెంగళూరులోని బి-స్కూల్‌లో ఎంబీఏ కోసం దరఖాస్తు చేసుకున్నా. చదువు పూర్తయ్యాక ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడ్డా. ఇలా ఉద్యోగ ప్రయత్నాలన్నీ పూర్తై కెరీర్‌లో స్థిరపడేసరికి నాకు 30 ఏళ్లొచ్చాయి. దాంతో మా కుటుంబం మళ్లీ నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అయితే ఈసారి నేనూ మనస్ఫూర్తిగా అంగీకరించడంతో రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టా. మొదటి పెళ్లికి, ఇప్పటికి నాలో ఎన్నో మార్పులు! నిండైన ఆత్మవిశ్వాసానికి తోడు, ఆర్థిక స్వేచ్ఛతో జీవితంపై పూర్తి పట్టు సాధించా. భర్తతో ఇలా మెలగాలి, అలా ఉండాలి.. అంటూ ఎన్నో కలలు కన్నా. నేను అనుకున్నట్లుగానే ఏడాది పాటు మా సంసారం సాఫీగానే సాగింది. మా ప్రేమకు గుర్తుగా పాప కూడా పుట్టింది. అయితే ఆ తర్వాతే నా భర్త అసలు రూపం బయటపడింది.

******

అప్పటిదాకా తాగుడు అలవాటు లేని అతడు రోజూ తాగొచ్చి నన్ను కొట్టేవాడు. మానసికంగా హింసించేవాడు. ఎంత సర్దుకుపోయినా ఏదో ఒక రకంగా నన్ను వేధించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ విడాకులంటే ఈ సమాజం నా గురించి, నా పాప గురించి ఏమనుకుంటుందోనని భయపడ్డా. అందుకే కొన్నాళ్లు ఈ హింసను మౌనంగానే భరించా. రోజూ తాగి ఇంటికి రావడం, గొడవ చేయడం, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మళ్లీ గుర్తు చేసుకొని నన్ను వేధించడం.. ఇలా అతడి హింస భరించలేకపోయా. ఇదీ నన్ను మానసికంగా మరోసారి దెబ్బకొట్టింది. అయితే ఉన్నట్లుండి నా భర్త ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడికెళ్లాడో, ఎందుకెళ్లాడో తెలియదు. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాను. కానీ ఫలితం లేదు. అయితే ఆ తర్వాత నన్ను వదిలించుకోలేక తనే కావాలని వెళ్లిపోయాడని తెలిసింది! అందుకే అతడి నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నా. రెండేళ్ల అనంతరం కోర్టు అధికారికంగా మాకు విడాకులు మంజూరు చేసింది.

ప్రస్తుతం నేను ఒంటరిగానే నా బిడ్డను పెంచుతున్నా. తల్లి ప్రేమతో పాటు తండ్రి లాలననూ పంచుతున్నా. జీవితమంటే కష్టాలే కాదు.. సుఖాలూ ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నా బిడ్డ పుట్టాకే నా జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే తన ప్రేమే నన్ను అమ్మగా, మహిళగా ధైర్యంగా నిలబడేలా చేశాయి. 
చివరిగా- మీ అందరితో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. చీకటి వెంటే వెలుతురున్నట్లు.. కష్టాల వెంటే సుఖాలూ వస్తాయి. కాబట్టి ఓపికతో ఆ సమయం కోసం వేచి చూస్తే.. ఇక జీవితాంతం తలెత్తుకొని బతికే అవకాశం మన సొంతమవుతుంది. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!

Share Your Story: మీ కథ చెబుతారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్