Published : 22/08/2021 09:11 IST

అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!

తోబుట్టువులంటే కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడం మాత్రమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకరికొకరు సాయపడుతూ ఒకే కెరీర్‌లో కూడా కొనసాగొచ్చని చెబుతున్నారీ సెలబ్రిటీలు. ఇందులో కొందరు నటులుగా ప్రసిద్ధులైతే, మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఒకరికి మించి మరొకరు సినీరంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. అక్కను మార్గదర్శకురాలిగా తీసుకుని ముందుకు సాగుతున్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచిన చెల్లెళ్లు మరికొందరు. ఏదేమైనా వీరందరూ అనుబంధంతో పాటు ‘వెండితెర’నూ సమానంగా పంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెండితెరను వేదికగా చేసుకుని పలు విభాగాల్లో వెలిగిపోతున్న కొందరు సెలబ్రిటీ తోబుట్టువుల గురించి ‘రాఖీ పండగ‘ సందర్భంగా తెలుసుకుందామా..!

వరుణ్‌-నిహారిక

మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ్, ఆయన చెల్లెలు నిహారిక ఈ లిస్టులో ముందుంటారు. ప్రముఖ హీరో చిరంజీవి తమ్ముడైన నాగబాబు, పద్మజ దంపతుల వారసులు వీరిద్దరు. ‘ముకుంద’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక వరుణ్ చెల్లెలు నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’. ‘సైరా’ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ‘ముద్ద పప్పు- ఆవకాయ్‌’, ‘నాన్న కూచి’ వంటి వెబ్ సిరీస్‌లతోనూ ఆకట్టుకుందీ కొణిదెల వారి ఆడపడచు.


రామ్‌చరణ్‌-సుస్మిత

ఇక మెగాస్టార్‌ చిరంజీవి నట వారసుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు రామ్‌ చరణ్‌. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడీ మెగా హీరో. ఇక అతడి సోదరి సుస్మిత కూడా సినిమా పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఎంతో అనుభవమున్న ఆమె ‘ఖైదీ నం.150’, ‘రంగస్థలం’, ‘సైరా’ తదితర సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాదు సోదరుడు రామ్‌చరణ్ బాటలో పయనిస్తూ సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది సుస్మిత. తన భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించిన ఆమె తొలి ప్రయత్నంగా ‘షూట్‌ అవుట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించింది. తాజాగా ‘శ్రీదేవి-శోభన్‌ బాబు’ అనే మరో సినిమాను ప్రకటించిందీ కొణిదెల వారసురాలు.


నితిన్‌-నిఖిత

తెలుగు చిత్ర రంగంలో రాణిస్తోన్న అక్కాతమ్ముళ్లలో నితిన్, నిఖిత కూడా ఒకరు. నితిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ సినిమాలతో ఆకట్టుకున్న అతడు త్వరలో ‘మ్యాస్ట్రో’గా రానున్నాడు. ఇక నితిన్ అక్క నిఖితారెడ్డి కూడా టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా కొనసాగుతోంది. నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’, ‘చిన్నదాన నీకోసం’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అఖిల్’.. వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించింది. ‘మ్యాస్ట్రో’ సినిమాకు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది నిఖిత.


మహేశ్‌-మంజుల

సూపర్‌స్టార్‌ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్‌ టాప్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ‘ప్రిన్స్‌’ మహేశ్‌ బాబు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన అతడు వరుసగా బ్లాక్‌బస్టర్‌ హిట్లను సొంతం చేసుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్‌ సాధించిన ఈ హ్యాండ్సమ్‌ హీరో ఖాతాలో 8 నంది అవార్డులు ఉండడం విశేషం. ఇక మహేశ్‌ అక్క మంజుల ‘షో’ సినిమాతో ఇటు నటిగా, నిర్మాతగా ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కావ్యాస్‌ డైరీ’, ‘ఆరెంజ్‌’, ‘సేవకుడు’ వంటి చిత్రాల్లో నటించడమే కాకుండా ‘పోకిరి’, ‘ఏమాయ చేసావే’ వంటి హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. 2018లో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో డైరెక్టర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.


సకుటుంబ సపరివారంగా..

టాలీవుడ్‌లో ‘మంచు’ ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మోహన్‌బాబు వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా కొనసాగిస్తోంది. విష్ణు, మనోజ్‌లు హీరోగా రాణిస్తుంటే లక్ష్మి మాత్రం నటిగా, గాయనిగా, నిర్మాతగా, యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది. ‘అనగనగా ఓ ధీరుడు’, ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’, ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ‘పిట్టకథలు’ వెబ్‌సిరీస్‌లో ‘స్వరూపక్క’ పాత్రతో మరోసారి ఆకట్టుకున్న ఆమె... ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమయ్యే ఒక వంటల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.


సుమంత్‌-సుప్రియ

‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘మళ్లీ రావా’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు అక్కినేని సుమంత్‌. విజయాలు రాకపోయినా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటాడని ఈ హీరోకు పేరుంది. ఇక సుమంత్‌ సోదరి సుప్రియ చిన్నతనంలోనే తాత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘రావుగారిల్లు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదలైన ‘గూఢచారి’ సినిమాలో ప్రతినాయకురాలి పాత్రలోనూ ఆకట్టుకుంది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా సుప్రియ వ్యవహరించింది.


సైఫ్‌-సోహా

ఇక బాలీవుడ్ విషయానికొస్తే- వెండితెర వేదికగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తోబుట్టువుల్లో సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్ జంట కూడా ఒకటి. వీరిద్దరూ పటౌడీ వంశానికి చెందిన మన్సూర్ అలీఖాన్, షర్మిలా ఠాగూర్ దంపతుల వారసులు. వీరిలో అన్నయ్య సైఫ్ ప్రస్తుతం హీరో, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇక చెల్లెలు సోహా అలీఖాన్ విషయానికొస్తే.. ఈమె కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా బెంగాలీ, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందింది. ఆమె ‘రంగ్ దే బసంతి’, ‘షాదీ నెం.1’, ‘దిల్ మాంగే మోర్’, ‘గో గోవా గాన్’, ‘సాహెబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌’ వంటి పలు హిందీ చిత్రాలతో పాటు బెంగాలీ భాషలో రెండు, ఇంగ్లిష్‌లో మరో నాలుగు సినిమాల్లో నటించింది.


సోనమ్‌-హర్షవర్ధన్

తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది సోనమ్‌ కపూర్‌. ఆమె దారిలో నడుస్తూ సినీరంగంలో అడుగులేస్తున్నాడు ఆమె తమ్ముడు హర్షవర్ధన్ కపూర్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీతా కపూర్ దంపతుల పిల్లలే వీరు. ‘ఢిల్లీ-6’, ‘ఖూబ్‌సూరత్’, ‘రాన్‌జానా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’, ‘డాలీ కీ డోలీ’, ‘నీర్జా’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘వీరె ది వెడ్డింగ్’, ‘సంజు’ ‘ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’.. వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది సోనమ్. 2016లో రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన ‘మిర్జ్యా’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టాడు హర్షవర్ధన్ కపూర్. ఆ తర్వాత ‘భావేష్‌ జోషీ సూపర్‌ హీరో’, ‘ఏకే వర్సెస్‌ పీకే’ చిత్రాల్లో నటించాడు.


శ్రద్ధ- సిద్ధాంత్

బాలీవుడ్‌లో రాణిస్తోన్న తోబుట్టువుల జాబితాలో శ్రద్ధా కపూర్, సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారు. వీరిరువురు ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్, శివాంగి కపూర్ దంపతుల వారసులు. శ్రద్ధా కపూర్ 2010లో ‘తీన్ పత్తీ’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. ‘ఆషిఖీ - 2’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘ఏక్ విలన్’, ‘హైదర్’, ‘ఏబీసీడీ-2’, ‘రాక్ఆన్-2’, ‘స్త్రీ’, ‘సాహో’, ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌-3D’, ‘బాఘీ 3’ వంటి చిత్రాలు ఆమెకు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించి పెట్టాయి. సిద్ధాంత్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత హీరోగా మారాడు. ‘షూటౌట్ ఎట్ వాదాలా’, ‘అగ్లీ’, ‘జస్బా’, ‘యారం’, ‘భూత్‌’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కలిసి ‘దావుద్’ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘హసీనా పార్కర్’ చిత్రంలో నటించడం విశేషం.


ఫరా ఖాన్‌-సాజిద్‌ ఖాన్

సినీరంగంలో కేవలం నటులే కాదు.. ఇతర విభాగాల్లోనూ సక్సెస్ సాధించిన తోబుట్టువులున్నారు. అలా దర్శకులుగా రాణిస్తోన్న అక్కాతమ్ముళ్లు ఫరా ఖాన్, సాజిద్ ఖాన్. వీరిలో అక్క ఫరా ఖాన్.. కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూనే పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తోంది. ‘ఓం శాంతి ఓం’, ‘మై హూనా’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె ఇప్పటి వరకు దాదాపు 80 హిందీ చిత్రాలలో సుమారుగా వంద పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఫరాఖాన్ మ్యారీ గోల్డ్, మాన్‌సూన్ వెడ్డింగ్, కుంగ్‌ఫూ యోగా వంటి ఇంటర్నేషనల్ చిత్రాలకు కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మరోవైపు తమ్ముడు సాజిద్ ఖాన్ దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, టీవీ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు.


ఫర్హాన్‌-జోయా అక్తర్

దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, గాయకుడిగా.. ఇలా బాలీవుడ్‌లో పలు రంగాల్లో రాణిస్తోన్న వ్యక్తి ఫర్హాన్ అక్తర్. ‘భాగ్ మిల్కా భాగ్’ తో బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్. ఆయన అక్క జోయా అక్తర్ కూడా సినీ దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా కొనసాగుతోంది. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లక్ బై ఛాన్స్’ 2009లో విడుదలైంది. 2011లో ‘జిందగీ నా మిలేగీ దుబారా’ అనే చిత్రం ఆమె కెరీర్‌లోనే పెద్ద హిట్‌ని సాధించి పెట్టడంతో పాటు ఆ సినిమాకు గాను ఆమెను ఉత్తమ దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. అంతేకాదు.. ‘దిల్ దఢఖ్‌నే దో’ అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించిందామె. జోయా అక్తర్ తెరకెక్కించిన ‘గల్లీబాయ్’ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది.


అమీషా పటేల్‌-అష్మిత్‌ పటేల్

‘బద్రి’, ‘నాని’, ‘నరసింహుడు’, ‘పరమ వీర చక్ర’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది అమీషా పటేల్. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అమీషా ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్‌’, ‘ద గ్రేట్‌ ఇండియన్‌ కేసినో’ సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఆమె తమ్ముడు అష్మిత్ పటేల్ కూడా అక్క బాటలోనే నడుస్తున్నాడు. ఆయన మొదట విక్రమ్ భట్‌తో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారాడు.

ప్రేమానురాగాలతో పాటు వెండితెరను కూడా పంచుకున్న కొందరు తోబుట్టువుల గురించి తెలుసుకున్నారు కదా! వీరితో పాటు మెహరీన్‌- గుర్ఫాతే, సోనాక్షి సిన్హా- లవ్ సిన్హా, హ్యూమా ఖురేషీ - సాఖీబ్ సలీమ్, తుషార్ కపూర్ - ఏక్తా కపూర్‌లు కూడా సినీరంగంలో సక్సెస్‌ఫుల్ తోబుట్టువులుగా కొనసాగుతున్నారు. ‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా వీరందరికీ శుభాకాంక్షలు చెప్పేద్దామా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి