ఫోర్బ్స్ ధనలక్ష్ములు వీరే!

ఉద్యోగాల్లోనే కాదు.. వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. తమ వ్యాపార వ్యూహాలతో కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో దేశంలోనే సంపన్న మహిళలుగా ఎదుగుతున్నారు. ఏటా అలాంటి ఆస్తిపరులను గుర్తించి తన జాబితాలో చోటు కల్పిస్తుంటుంది ఫోర్బ్స్‌ ఇండియా పత్రిక.

Updated : 07 Dec 2021 13:57 IST

ఉద్యోగాల్లోనే కాదు.. వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. తమ వ్యాపార వ్యూహాలతో కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో దేశంలోనే సంపన్న మహిళలుగా ఎదుగుతున్నారు. ఏటా అలాంటి ఆస్తిపరులను గుర్తించి తన జాబితాలో చోటు కల్పిస్తుంటుంది ఫోర్బ్స్‌ ఇండియా పత్రిక. అలా తాజాగా విడుదల చేసిన ‘ఫోర్బ్స్‌ తొలి వంద మంది భారతీయ సంపన్నుల’ జాబితాలో ఆరుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. మరి, వాళ్లెవరు? వాళ్ల ఆస్తిపాస్తులెంతో తెలుసుకుందాం రండి..

సావిత్రీ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గౌరవ ఛైర్‌పర్సన్

(Photo: Facebook)

మనదేశంలో అత్యంత సంపన్నమైన మహిళగా సావిత్రీ జిందాల్‌కు పేరుంది. ప్రస్తుతం ‘జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్’ సంస్థకు గౌరవ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతోన్న ఆమె.. తన భర్త ఓం ప్రకాశ్ జిందాల్ 2005లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె సారథ్యంలో కేవలం నాలుగేళ్ల లోపే సంస్థ ఆదాయం వృద్ధి చెందిందంటే.. ఇందుకు ఆమె తీసుకున్న చర్యలు, తన వ్యాపారదక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు. సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరినీ తన కుటుంబ సభ్యుల్లానే చూడాలనేది ఓం ప్రకాశ్ జిందాల్ పెట్టుకున్న ఆశయం. ఆయన మరణం తర్వాత కంపెనీ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న సావిత్రి.. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన మాటల్ని నిజం చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరినీ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ అందరికీ తాను అమ్మయ్యారు.

ఇలా ఓవైపు కంపెనీ కార్యకలాపాల్లో భాగం పంచుకుంటూనే.. మరోవైపు 2009 నుంచి 2012 వరకు హరియాణా శాసనసభ సభ్యురాలిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం హరియాణా అగ్రొహాలోని ‘మహారాజా అగ్రసేన్ మెడికల్‌ కాలేజీ’ అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారు. తొమ్మిది మంది కొడుకులకు జన్మనిచ్చిన ఆమె.. ‘ఇండియాస్ రిచెస్ట్ మదర్’గా కూడా పేరు గాంచారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సిద్ధాంతాన్ని నమ్మే ఆమె.. దేశంలోనే సంపన్నులైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘వంద మంది భారతీయ సంపన్నుల్లో’ రూ. 13.46 లక్షల కోట్ల సంపదతో ఏడో స్థానాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆరుగురు మహిళల్లో మొదటిస్థానం సావిత్రిదే కావడం విశేషం.


వినోద్‌ రాయ్‌ గుప్తా, హావెల్స్‌ ఇండియా

హావెల్స్‌ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు క్విమత్‌ రాయ్‌ గుప్తా భార్య వినోద్‌ గుప్తా. ఈ సంస్థలో వినోద్‌కు ఎలాంటి పదవి లేదు. ఆమె కొడుకు అనిల్‌ గుప్తా ప్రస్తుతం ఈ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ అన్ని బాధ్యతల్ని చూసుకుంటున్నారు. అయితే 2014లో క్విమత్‌ మరణానంతరం ఆయన పేరిట ఉన్న షేర్లన్నీ వినోద్‌కు బదిలీ కావడంతో కొడుకుతో కలిసి తాజా ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు వినోద్‌. ఈ ఏడాది ఈ సంస్థ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 5.68 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా తాజా జాబితాలో 24 స్థానంలో నిలిచారు వినోద్.


లీనా తివారీ, యూఎస్‌వీ ప్రై. లి. ఛైర్‌పర్సన్

(Photo: leenagandhitewari.blogspot.com)

మనదేశంలో జనరిక్ మందులు తయారుచేసే ప్రైవేటు రంగ సంస్థ యూఎస్‌వీ ఫార్మా. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలకు సంబంధించిన ఔషధాలను తయారుచేయడంలో పేరుగాంచిందీ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు లీనా తివారీ. ఆమె తాతయ్య విఠల్ బాలకృష్ణ గాంధీ యూఎస్‌వీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 1961లో స్థాపించారు. తన తాతయ్య, తండ్రి తర్వాత ఈ కంపెనీ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న లీనా.. తన వ్యాపార దక్షతతో సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. అందుకే ఏటా ఫోర్బ్స్ విడుదల చేసే భారత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటారు లీనా. ఈసారి కూడా ‘వంద మంది భారతీయ సంపన్నుల’ జాబితాలో రూ. 3.28 లక్షల కోట్ల సంపదతో 43వ స్థానంలో నిలిచారు లీనా. ప్రస్తుతం ఆమె భర్త ప్రశాంత్ యూఎస్‌వీ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


దివ్యా గోకుల్‌నాథ్‌, బైజూస్ సహ వ్యవస్థాపకురాలు

(Photo: Instagram)

టీచింగ్‌పై మక్కువతో 21 ఏళ్ల వయసులోనే ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ ప్రారంభించారు దివ్యా గోకుల్‌నాథ్‌. ఈ క్రమంలో గణితం, ఇంగ్లిష్‌, లాజికల్‌ రీజనింగ్‌.. వంటి సబ్జెక్టులను బోధించేవారామె. జీఆర్‌ఈ పరీక్షలకు ప్రిపేరయ్యే క్రమంలో బైజూ రవీంద్రన్‌ను కలిసిన ఆమె.. ఆ తర్వాత ఆయన్నే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి 2011లో బైజూస్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారు. వెబ్‌సైట్‌గా ప్రారంభమైన ఈ సంస్థ.. ఆ తర్వాత కాలంలో యాప్‌ రూపంలోనూ పిల్లలకు అందుబాటులోకొచ్చింది. ఇందులో భాగంగా ఆమె పలు వీడియో క్లాసుల్లోనూ కనిపించేవారు. సబ్జెక్టులను విడమరిచి, సరళమైన భాషలో చెప్పడం ఆమె ప్రత్యేకత! ఇదే ఎంతోమంది విద్యార్థుల్ని ఆకర్షింపజేసింది. అంతేకాదు.. గణితాన్ని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటేనే అది ఒంటబడుతుందని చెబుతుంటారు దివ్య. 4-12 తరగతుల వారి కోసం ప్రారంభమైన ఈ యాప్‌ ఇప్పుడు పోటీ పరీక్షల వారికీ శిక్షణనిస్తోంది. ఏడున్నర కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగిన ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహామహులు పెట్టుబడులు పెట్టారు.

ఇక కరోనా ప్రతికూల పరిస్థితుల్లో పిల్లలందరూ ఆన్‌లైన్‌ క్లాసులకు పరిమితం కావడంతో ఈ యాప్‌కు ఆదరణ మరింతగా పెరిగింది. ఈ క్రమంలో చిన్నారులకు ఉచిత తరగతులు కూడా అందించిందీ సంస్థ. ఇలా ఈ ఏడాది కాలంలోనే సంస్థ ఆదాయం సుమారు రూ. 7,477 కోట్లు పెరిగి రూ. 3.02 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో 47వ స్థానం దక్కించుకున్న దివ్య.. అందరికంటే పిన్న వయస్కురాలు కావడం విశేషం.


కిరణ్ మజుందార్ షా, బయోకాన్ ఛైర్‌పర్సన్

(Photo: Twitter)

‘బయోకాన్ లిమిటెడ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పిన ఘనత ఆ సంస్థ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షాకే దక్కుతుంది. 1978లో ఈ సంస్థను స్థాపించిన కిరణ్.. దీని ద్వారా మధుమేహం, క్యాన్సర్, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులను నయం చేసే మందుల్ని ఉత్పత్తి చేసే దిశగా కృషి చేశారు. చక్కటి వ్యాపార దక్షతతో మలేషియాలోనూ ఓ ఫ్యాక్టరీని నెలకొల్పి దాని ద్వారా ఆసియాలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థగా బయోకాన్‌ను అభివృద్ధి చేశారామె. అంతేకాదు.. కొత్త తరహా ఔషధాలు రూపొందించే విషయంలో చొరవ తీసుకొని ముందుకు దూసుకుపోతున్నారు కిరణ్. ఈ క్రమంలోనే వివిధ క్యాన్సర్ల చికిత్స కోసం తయారుచేసే ఔషధాలలో ఉపయోగించే మందు విషయంలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) అనుమతి కూడా తీసుకున్నారు.

కేవలం వ్యాపారంలో రాణించడమే కాదు.. తనలో సేవాగుణం కూడా ఉందంటున్నారు కిరణ్. అందుకే భవిష్యత్తులో ఓ మెడికల్ సెంటర్‌ను ఏర్పాటుచేసి, దాని ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం అవసరమైన మందుల్ని సామాన్యులకు సైతం చేరువ చేసే ఆలోచనలో ఉన్నారీ బిజినెస్ వుమన్. ఇలా తనలోని క్రియేటివ్ ఆలోచనలతో కంపెనీని ముందుండి నడిపించడంతో పాటు సేవలోనూ ముందున్న కిరణ్.. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ‘వంద మంది భారతీయ సంపన్నుల’ జాబితాలో రూ. 2.91 లక్షల కోట్ల సంపదతో 53వ స్థానంలో నిలిచారు.


మల్లికా శ్రీనివాసన్‌, టఫే ఛైర్మన్‌-ఎండీ

(Photo: TAFE website)

టఫేతో పాటు మొత్తం 47 సంస్థలు ‘ది అమాల్గమేషన్ గ్రూప్’ కిందకి వస్తాయి. ఈ గ్రూప్‌కి చెందిన సంస్థలన్నింటికీ ఛైర్మన్‌గా ఎ.క్రిష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందినవారే ఈ సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారు. వారిలో టఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్ కూడా ఒకరు. ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో 2.16 లక్షల కోట్ల సంపదతో 73 వ స్థానంలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్