స్కేటర్‌ గర్ల్‌... ఆమె జీవితం!

చదువుకొని ఆడపిల్ల చేసేదేముంది అనే గ్రామంలో పుట్టిందామె. సంప్రదాయ సరిహద్దులను దాటి, స్కేట్‌బోర్డింగ్‌లో శిక్షణ తీసుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో స్వర్ణపతకాలను కైవసం  చేసుకుంది. దేశంలోనే తన గ్రామాన్ని ‘స్కేట్‌బోర్డింగ్‌ హాట్‌స్పాట్‌’గా నిలిపింది. సినిమాగా రూపొందించిన ఈమె బయోగ్రఫీ అమ్మాయిలెందరికో మార్గదర్శకమైంది.

Published : 02 Jun 2024 04:25 IST

చదువుకొని ఆడపిల్ల చేసేదేముంది అనే గ్రామంలో పుట్టిందామె. సంప్రదాయ సరిహద్దులను దాటి, స్కేట్‌బోర్డింగ్‌లో శిక్షణ తీసుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో స్వర్ణపతకాలను కైవసం  చేసుకుంది. దేశంలోనే తన గ్రామాన్ని ‘స్కేట్‌బోర్డింగ్‌ హాట్‌స్పాట్‌’గా నిలిపింది. సినిమాగా రూపొందించిన ఈమె బయోగ్రఫీ అమ్మాయిలెందరికో మార్గదర్శకమైంది. భవిష్యత్తులో తనలాంటి క్రీడాకారిణులను తయారుచేయడానికి కృషి చేస్తోన్న ఆశాగోండ్‌ స్ఫూర్తి కథనమిది. 

‘మా ఊళ్లో స్కేట్‌బోర్డుపై గాలిలోకి ఎగిరి కిందకు దూకుతుంటే మనసుకు స్వేచ్ఛగా, విముక్తి పొందినట్లుగా అనిపిస్తుంద’నే ఆశా గోండ్‌ది మధ్యప్రదేశ్‌లోని జన్‌వార్‌ గ్రామం. ఆడపిల్లలకు విద్య అవసరం లేదనే సంప్రదాయ గిరిజన కుటుంబంలో పుట్టిందీమె. ‘సమీప గ్రామమైన పన్నాలో హాస్టల్‌ ఉండి అక్కడి స్కూల్‌లో తొమ్మిదోతరగతి చదివేదాన్ని. ఓసారి మా గ్రామానికి వచ్చినప్పుడు స్కేట్‌పార్క్‌ అని ఏదో ఆటకు సంబంధించింది నిర్మించారని తెలిసి చూడ్డానికెళ్లా. అక్కడ చిన్న చిన్న పిల్లలు స్కేట్‌బోర్డ్‌పై వేగంగా దూసుకెళ్లిపోతున్నారు. చాలా ఆశ్చర్యమేసింది. ఆ ఆట గురించి నాకు తెలీదు. ప్రయత్నించడానికి ఆ బోర్డ్‌పై నిలబడి, బ్యాలెన్స్‌ చేయలేక వెంటనే దిగిపోయా. నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అక్కడే ఉన్న మేడమ్‌ను అడగమన్నారు. ఆమె పేరు ఉల్రిక్‌ రీన్‌హార్డ్‌ అని చెప్పారు. జర్మనీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త అట. విద్య, క్రీడల ద్వారా ఆడపిల్లలను స్వేచ్ఛ పొందేలా చేయడానికి వచ్చారట ‘రూరల్‌ ఛేంజ్‌మేకర్స్‌’ ఎన్జీవో నిర్వహిస్తూ, గ్రామాల్లో ఆడపిల్లలను శక్తిమంతులుగా మార్చడానికి కృషి చేస్తున్నారని తెలిసింది. అలా 2015లో రాష్ట్రప్రభుత్వం చేయూతతో 450 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇక్కడ స్కేట్‌ పార్కు ఏర్పాటు చేసి, స్కేట్‌బోర్డింగ్‌లో  శిక్షణ ప్రారంభించారామె. నేనూ నేర్చుకుంటానని అడిగితే సరే అన్నార’ని చెబుతుంది ఆశా.

అభ్యంతరం వచ్చింది...

స్కేట్‌పార్కులో చేరడానికి ఆశా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆటలేంటన్నారు. ఎలాగో ఒప్పించి ఆశా శిక్షణలో చేరితే, ఆడపిల్ల ఇలా రోడ్డులో విహరించడమేంటని ఊళ్లోవాళ్లంతా ఆమె తల్లిదండ్రులను విమర్శించేవారు. ‘దీన్నొక సవాల్‌గా భావించి, పట్టుదలగా రాణించడానికి కృషి చేశా. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేసరికి అమ్మానాన్నలు సంతోషపడ్డారు. ఈ పార్క్‌లో  చేరాలంటే స్కూల్‌కెళ్లాలనే నిబంధన ఉంది. గ్రామీణప్రాంత పిల్లలకందరికీ క్రీడలతోపాటు విద్య కూడా ఉండాలనేది రీన్‌హార్డ్‌ ఉద్దేశమట. క్రమేపీ చుట్టుపక్కల గ్రామాలకూ ఈ క్రీడ విస్తరించింద’ంటోంది ఆశా.  

చలన చిత్రమైంది...

2018లో చైనాలో జరిగిన ప్రపంచ స్కేట్‌ బోర్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది ఆశా. ‘చైనాలో గెలుపు సాధించలేకపోయినా, ఆ అనుభవం నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నా. రెండుసార్లు విశాఖపట్నంలో స్కేట్‌బోర్డింగ్‌ ఇండియన్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకాలను గెలుచుకున్నా. ఇండియన్‌ స్కేట్‌ బోర్డింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 11 మంది పిల్లలు పతకాలను కైవసం చేసుకొని ప్రపంచపటంలో మావూరి కీర్తిని చాటారు. స్కేట్‌పార్క్‌ ప్రారంభించిన మూడేళ్లలోనే మా గ్రామం స్కేట్‌బోర్డింగ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ప్రస్తుతం స్కేటింగ్‌లో శిక్షణనిస్తూ, ‘బేర్‌ఫుట్‌ స్కేట్‌ బోర్డర్స్‌’ ఎన్జీవోకు డైరెక్టరుగా ఉన్నా. లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ చదువుకొని వచ్చా. దాన్ని ఇక్కడి పిల్లలకు నేర్పుతున్నానం’టున్న ఆశా జీవితాన్ని ఆధారంగా ‘స్కేటర్‌ గర్ల్‌’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రాన్ని రూపొందించింది. భవిష్యత్తులో మరిన్ని పతకాలను తెచ్చే క్రీడాకారులను తయారుచేస్తానంటున్న ఆశా కల నెరవేరాలని ఆశిద్దాం. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్