Published : 13/02/2023 00:45 IST

ముహూర్తం దగ్గరున్నది...

పెళ్లిళ్ల సమయం. వివాహవేదికపై మెరిసిపోవాలి అనుకుంటున్నారా? ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో చర్మసౌందర్యాన్ని పెంచుకోవడమెలాగో నిపుణులు చెబుతున్నారిలా..

పొడారే చర్మతత్వం ఉన్నవారు ముఖాన్ని మృదువుగా మార్చుకోవాలంటే... రెండు చెంచాల ఆలివ్‌నూనె, ఆరు విటమిన్‌ ఇ క్యాప్సుల్స్‌, చెంచా చొప్పున గ్లిజరిన్‌, గులాబీనీరు, చెంచాన్నర కలబంద గుజ్జు తీసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఖాళీ గాజుసీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. రోజూ రాత్రిపూట ముఖానికి రాసి ఐదు నిమిషాలు ఆరనిచ్చాక పడుకోవాలి. ఉదయం ముఖాన్ని చల్లని నీటితో కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. వారం రోజులపాటు ఇలా చేస్తే చర్మం మృదువుగా, తేమగా మారుతుంది.

మచ్చలు.. షాపింగ్‌ అంటూ బయట తిరగడం వల్ల ఎండ ప్రభావానికి ముఖంపై మచ్చలూ మొదలవుతాయి. ఇవి త్వరగా తగ్గాలంటే... సమానపాళ్లలో కీరదోస, నిమ్మరసం తీసుకొని అందులో చెంచా గులాబీనీటినీ చేర్చి ముఖానికి రాయాలి. ఆరాక కడిగేయాలి. అలాగే, సమాన పరిమాణంలో కమలాపండు రసం, పెరుగు, టొమాటో గుజ్జు తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి ఆరనిచ్చి కడిగేసినా ఫలితం ఉంటుంది. శనగపిండిలో కాస్తంత పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి ఆరనిచ్చి స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం పూర్వపు స్థితికి వస్తుంది.
పిగ్మెంటేషన్‌కు..  వాతావరణ పరిస్థితులూ, పోషణలోపం వంటివాటి వల్ల చర్మంపై పిగ్మెంటేషన్‌ మచ్చలొస్తుంటాయి. ఇలాంటప్పుడు రెండు చెంచాల గంధంపొడికి కాసిని పచ్చిపాలను కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగేయాలి. బంగాళాదుంపని చక్రాల్లా కోసి వాటితో చర్మంపై మృదువుగా మర్దనా చేసినా మచ్చలు క్రమంగా తగ్గుతాయి. చెంచా నానబెట్టిన బాదం పప్పు పేస్టులో, కొద్దిగా నిమ్మరసం, పావుచెంచా తేనె కలిపి ముఖానికి రాస్తూ ఉంటే... కొన్నాళ్లకు సమస్య దూరం కావడంతో పాటు చర్మ ఛాయా పెరుగుతుంది.

జిడ్డుతత్వానికి.. జిడ్డుకారే చర్మతత్వం ఉన్నవారు ప్రతి నాలుగైదు గంటలకోసారి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఉదయాన్నే చెంచా చొప్పున కీరదోస రసం, తేనె, పెరుగు, టొమాటో, కలబంద గుజ్జుల్ని కలిపి ముఖం, మెడలకు రాయాలి. పావుగంట ఆరనిచ్చి ఈ మిశ్రమాన్ని కడిగేస్తే చాలు. చర్మం మెరుపులీనుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని