Published : 28/12/2022 21:04 IST

చర్మాన్ని మెరిపించేయండిలా..!

చలికాలం రాగానే చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, పగుళ్లు రావడం.. వంటి సౌందర్యపరమైన సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే బ్యూటీ ప్యాక్స్ ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు.

అరటి, పెరుగుతో..

సహజసిద్ధంగా బాగా పండిన అరటిపండు తీసుకొని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న అరటిపండు గుజ్జు అరచెంచా తీసుకొని దానికి చెంచా చొప్పున తేనె, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని డల్ స్కిన్ ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. పెరుగు, తేనె చర్మానికి తేమని అందిస్తే, అరటిపండు నిర్జీవంగా మారిన చర్మానికి తిరిగి జీవం పోస్తుంది.

బాదంతో..

బాదంపై ఉండే పొట్టు తొలగించి కొద్దిగా పాలు జత చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖం, మెడకి ప్యాక్‌లా అప్త్లె చేసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందడమే కాదు.. శీతాకాలంలో ఎలాంటి చర్మసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందే జాగ్రత్తపడచ్చు. ఈ ప్యాక్ ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. తాజా చర్మం మన సొంతం అవుతుంది.

శెనగపిండి, టొమాటోతో..

కొద్దిగా శెనగపిండి తీసుకొని అందులో తగినంత టొమాటో రసం వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కాస్త రోజ్‌వాటర్ కూడా జత చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా అప్త్లె చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చక్కని స్క్రబ్‌లా పని చేసి నిర్జీవమైన చర్మాన్ని తిరిగి జీవంతో తాజాగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా..

చలికాలంలో డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ముద్దగా చేసిన గులాబీ పూరేకలు, పచ్చిపాలు, రోజ్‌వాటర్, తేనె, చక్కెర (తెలుపు+ బ్రౌన్), ఓట్స్, నిమ్మరసం, స్ట్రాబెర్రీ, క్యారట్స్, చాక్లెట్, వాల్‌నట్స్, కొబ్బరినూనె.. మొదలైన పదార్థాలు ఉపయోగించి కూడా ప్యాక్స్ వేసుకోవచ్చు. ఇవి తరచూ క్రమం తప్పకుండా వేసుకుంటూ ఆరోగ్యరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం.. వంటివి చేయడం ద్వారా డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మార్చి సాధారణ స్థితికి తీసుకురావచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని