Published : 07/01/2023 19:01 IST

ముఖం ఎలా శుభ్రపరచుకుంటున్నారు?

చలికాలంలో అందాన్ని సంరక్షించుకోవడమంటే అంత సులభం కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చక్కటి ఆహార నియమాలు పాటించినా.. చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇతర చర్మ సమస్యలు సైతం తలెత్తుతుంటాయి. అయితే వీటన్నింటికీ మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అక్కడి చర్మ ఆరోగ్యం దెబ్బతిని అంద విహీనంగా మార్చుతుందంటున్నారు. అదే ముఖం కడుక్కునే క్రమంలో కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే అటు చర్మ ఆరోగ్యంతో పాటు ఇటు అందమూ ఇనుమడిస్తుందంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

‘నురగ’కు బదులు అవి!

ముఖాన్ని, శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రస్తుతం వివిధ రకాల ఫేస్‌వాష్‌లు, బాడీ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫోమ్‌ (నురగ) ఆధారిత వాష్‌లూ లభిస్తున్నాయి. అయితే ఇలాంటివి చలికాలంలో ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అందుకే ఫోమ్‌కి బదులు జెంటిల్‌, క్రీమ్‌ క్లెన్సర్లు.. వంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

‘డబుల్‌ క్లెన్సింగ్‌’ వద్దే వద్దు!

కాలమేదైనా చాలామందికి పదే పదే ముఖం కడుక్కోవడం అలవాటు. ఈ క్రమంలోనే కొంతమంది ‘డబుల్‌ క్లెన్సింగ్‌’ పద్ధతిని పాటిస్తుంటారు. అంటే.. ఒకేసారి రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకోవడం అన్నమాట! ఇందులో భాగంగా తొలుత చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఆయిల్‌ ఆధారిత క్లెన్సర్‌తో ముఖం కడుక్కోవడం, ఆపై నీటి ఆధారిత క్లెన్సర్‌తో చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాల్ని తొలగించడం. నిజానికి దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మేకప్‌ ఉపయోగించకుండా, మొటిమలు-జిడ్డుదనం.. వంటి సమస్యలేవీ లేనివారు ఈ తరహా పద్ధతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. ఇక మిగతా వారు కూడా తమ చర్మతత్వాన్ని బట్టి సరైన ఫేస్‌వాష్‌ని ఎంచుకొని.. నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

‘అతి’ అనర్థమే!

ముఖంపై పేరుకున్న మృతకణాల్ని తొలగించుకునే క్రమంలో ‘ఎక్స్‌ఫోలియేషన్‌’ ప్రక్రియను పాటించడం మనకు తెలిసిందే! అయితే ముఖం మరింత మృదువుగా మారాలన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటించినా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మృతకణాలు తొలగిపోవడం అటుంచితే.. చర్మం ఎక్కువగా పొడిబారిపోతుంది. కాబట్టి వారానికి రెండుసార్లు, అదీ ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు.

ఇవి కూడా!

ముఖం శుభ్రం చేసుకోవడానికి వేడి నీళ్లు కాకుండా.. చల్లటి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు వాడితే చర్మం పొడిబారిపోకుండా జాగ్రత్తపడచ్చు.

మేకప్‌ను తొలగించుకోవడానికి మిసెల్లార్‌ వాటర్‌ని ఉపయోగించడం మనకు తెలిసిందే! అయితే చలికాలంలో రోజుకొక్కసారైనా వీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా చక్కగా శుభ్రపడుతుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే, జిమ్‌ నుంచి వచ్చాక.. ఇలా పలు సందర్భాల్లో చర్మం అలసటను దూరం చేసి ముఖాన్ని మెరిపిస్తుందిది.

వీటితో పాటు చర్మం పొడిబారకుండా చేసి మృదువుగా ఉంచడంలో ‘సి’, ‘డి’ విటమిన్ల పాత్ర కీలకం. కాబట్టి ఆయా విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారంతో పాటు.. అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు వీటిని సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని