Home Decor: తక్కువ ఖర్చులోనే.. ఇల్లు అందంగా కనిపించేలా..!
సొంతిల్లు ఉన్న వాళ్లు తమ ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే కంటికి కనిపించిన కొత్త వస్తువునల్లా కొనేస్తుంటారు. ఇంటి అలంకరణ వస్తువుల్లోనూ తరచూ మార్పులు చేర్పులు చేస్తుంటారు. నిజానికి దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవడం....
సొంతిల్లు ఉన్న వాళ్లు తమ ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే కంటికి కనిపించిన కొత్త వస్తువునల్లా కొనేస్తుంటారు. ఇంటి అలంకరణ వస్తువుల్లోనూ తరచూ మార్పులు చేర్పులు చేస్తుంటారు. నిజానికి దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవడం తప్ప మరే ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే తక్కువ ఖర్చుతోనే ఇంటిని మోడ్రన్‌గా తీర్చిదిద్దుకోవచ్చంటున్నారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..
గదిని విభజించడానికి..!
పొడవుగా ఉన్న గదిని విభజించడానికి ఇప్పుడు చాలామంది ఇంటీరియర్ డిజైనింగ్‌నే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా లివింగ్ రూమ్‌ని డైనింగ్ హాల్‌ని సెపరేట్ చేయడానికి ఈ ట్రెండ్‌ను ఎక్కువగా అనుసరిస్తున్నారు. అయితే ఇందులో డిజైన్‌ను బట్టి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. మరి, ఆ ఖర్చు తగ్గించుకోవడానికి ఓ ప్రత్యామ్నాయ మార్గమూ ఉంది. అదే మార్కెట్లో రెడీమేడ్‌గా దొరుకుతోన్న రూమ్ పార్టిషన్స్. చెక్కతో విభిన్న డిజైన్లలో లభ్యమవుతోన్న ఇవి.. ప్రత్యేకంగా చేయించుకున్న వాటితో పోల్చితే తక్కువ ధరల్లోనే దొరుకుతున్నాయి. పైగా వీటిని ఒక దగ్గర ఫిక్స్ చేయకుండా.. మనకు కావాల్సిన చోట అమర్చుకోవచ్చు. తద్వారా ఖర్చూ తగ్గుతుంది.. ఇంటికీ మోడ్రన్ లుక్ వస్తుంది. అలాగే పైనుంచి వేలాడదీసుకునేలా హ్యాంగింగ్ స్క్రీన్ పార్టిషన్స్ కూడా ప్రస్తుతం ఇంటికి సరికొత్త లుక్‌ని తీసుకొస్తున్నాయి.
వాల్ పేపర్‌తో..
ఏ వస్తువైనా వాడే కొద్దీ దాని నాణ్యత తగ్గిపోతుంటుంది.. ఇది ఇంట్లో గోడలకు వేసిన పెయింట్‌కూ వర్తిస్తుంది. ముఖ్యంగా లివింగ్ రూమ్, పడకగది గోడలకు విభిన్న డిజైన్లతో కూడిన పెయింటింగ్ వేయించుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. మనం ఎంచుకునే డిజైన్, రంగును బట్టి ఖర్చూ పెరిగిపోతుంది. కాబట్టి గోడ పరిమాణాన్ని బట్టి.. ఆకర్షణీయమైన వాల్ పేపర్/స్టిక్కర్‌ని అతికించేస్తే.. తక్కువ ఖర్చులోనే పని పూర్తవుతుంది. పైగా ఫ్యాబ్రిక్, మ్యూరల్, వినైల్.. ఇలా విభిన్న రకాల స్టిక్కర్స్ ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. వాటిని ఎంచుకుంటే రాజీ పడకుండా ఇంటిని మెరిపించుకోవచ్చు. అయితే ఎక్కువ రోజులు పెయింట్ వేయకపోతే గోడలు పాడవుతాయి. అందువల్ల గోడల రక్షణ కోసం మామూలుగా వేసే పెయింట్ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు.
వికర్ బాస్కెట్స్!
ఇంటీరియర్ డిజైనింగ్‌లో మాడ్యులర్ కిచెన్ కూడా ఓ భాగమే! ఈ మధ్య కొత్తగా ఇల్లు కట్టుకునే వారే కాదు.. సాధారణ వంటగదుల్ని కూడా మాడ్యులర్‌గా మార్చుకునే వారు పెరిగిపోయారు. అయితే ఇందులో విభిన్న రకాల కిచెన్ క్యాబినెట్స్ ఏర్పాటుచేసుకుంటుంటాం. వీటికి భారీ మొత్తంలో ఖర్చవుతుంది. కాస్త ఆలోచిస్తే.. ఇక్కడ కూడా బడ్జెట్‌ను తగ్గించుకోవచ్చు. అదెలాగంటే.. ఉల్లిపాయలు, వెల్లుల్లి, దుంపలు.. వంటి పొడిగా ఉండే పదార్థాల కోసం ఎక్కువ ఖర్చుతో కూడిన క్యాబినెట్ బాక్సుల్ని ఉపయోగించకుండా.. చెక్కతో చేసిన ‘వికర్ బాస్కెట్స్’ని ఎంచుకుంటే ఖర్చు చాలావరకు కలిసొస్తుందంటున్నారు నిపుణులు. పైగా ఇందులోనూ విభిన్న డిజైన్లు, పరిమాణాల్లో ఉండే బుట్టలు దొరుకుతున్నాయి. కిచెన్‌లో ఖాళీ ప్రదేశం, క్యాబినెట్ పొడవు, వెడల్పులను బట్టి ఈ తరహా బాస్కెట్లను అమర్చుకోవచ్చు.
‘లోహపు’ అందాలు!
గోడల్ని అందంగా అలంకరించుకోవడానికి వాల్ పేపర్లు/స్టిక్కర్లతో పాటు విభిన్న డెకరేటివ్ పీసెస్‌నీ ఉపయోగిస్తుంటాం. అయితే ఇందులోనూ బడ్జెట్‌ను తగ్గించుకోవాలనుకునే వారు లోహాలతో తయారుచేసిన అలంకరణ వస్తువుల్ని ఎంచుకోమంటున్నారు నిపుణులు. ఐరన్, కాపర్, బ్రాంజ్.. వంటి విభిన్న లోహాలతో, సరికొత్త డిజైన్లలో రూపుదిద్దుకున్న వాల్ డెకరేటివ్ పీసెస్‌కు ప్రస్తుతం మార్కెట్లో కొదవే లేదు. పైగా ఇప్పుడిదే ట్రెండ్ కూడా! మెటల్ ఫ్లవర్, మెటల్ వాల్ మిర్రర్, రాత్రుళ్లు మిరుమిట్లు గొలిపే మెటల్ వాల్ ట్రీ.. ఇలా వీటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకొని.. తక్కువ ఖర్చుతోనే మీ ఇంటిని మోడ్రన్‌గా మార్చేసుకోవచ్చు.
సోఫానే బెడ్ అయితే..!
కొంతమంది ఇల్లు చిన్నగా ఉంటుంది.. అలాగని ఇంటీరియర్స్ విషయంలో ఏమాత్రం రాజీపడరు.. ఇలాంటి వాళ్ల కోసం ప్రత్యేకంగా ‘మల్టీపర్పస్ ఫర్నిచర్’ను రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఉదాహరణకు.. పగలంతా సోఫాగా ఉపయోగించుకొని, రాత్రిళ్లు మంచంగా మార్చుకునేలా.. అలాగే రోజంతా ఫోల్డ్ చేసి గోడకు అమర్చేలా, రాత్రిళ్లు బెడ్‌గా మార్చుకునేలా.. ఇలా ఎన్నెన్నో కొత్త వెరైటీలు ప్రస్తుతం రూపొందుతున్నాయి. దీనివల్ల స్థలం ఒక్కటే ఆదా అవడం కాదు.. ఒక దాంట్లోనే రెండు, అంతకంటే ఎక్కువ వస్తువులొస్తున్నాయి కాబట్టి.. ఖర్చూ కలిసొస్తుంది.. ఈ తరహా ఫర్నిచర్ అమర్చిన ఇల్లు మరింత మోడ్రన్‌గానూ కనిపిస్తుంది.
ఇలా ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ బోలెడన్ని ప్రత్యామ్నాయ మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఇటు డబ్బు ఆదా చేసుకుంటూనే, అటు ఇంటిని మోడ్రన్‌గా మార్చుకునే విషయంలో మీకేమైనా సూచనలు, సలహాలు కావాలంటే నిపుణులైన ఇంటీరియర్ డిజైనర్లను సంప్రదిస్తే ఫలితం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.