Published : 05/12/2021 17:59 IST

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి..

నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోరు.

నిద్రమాత్రలకు బదులుగా..

మీరూ నిద్రలేమితో బాధపడుతున్నారా? హాయిగా నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వాడుతున్నారా? ఇకపై వాటిని పక్కన పెట్టేయండి. పడుకునే సమయంలో మీ భాగస్వామి వేసుకున్న దుస్తులను మీ పక్కన పెట్టుకోండి.. లేదంటే దాన్నే దిండుగా మార్చుకోండి. వెంటనే నిద్రలోకి జారుకుంటారు. నచ్చిన వారి దుస్తులను పక్కన పెట్టుకుంటే నిద్ర రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదేదో మాట వరసకు చెబుతున్న విషయం కాదు.. పరిశోధనలు చేసి మరీ శాస్త్రవేత్తలు వెల్లడించిన నిజం.

పరిశోధనల్లో తేలిందేంటంటే..

ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధం.. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే అనుబంధం వారి ఆరోగ్య పరిస్థితులపై సానుకూల ప్రభావం చూపుతుందన్న విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. అయితే కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో.. భాగస్వామి సాన్నిహిత్యమే కాదు, వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని తేలింది. నిద్రలేమితో బాధపడేవారు తమ భాగస్వామి వాడిన దుస్తులను దిండుకు చుట్టుకొని పడుకుంటే వెంటనే నిద్రలోకి జారుకుంటారని చెబుతున్నారు పరిశోధకులు.

ఏం చేశారంటే..

కేవలం ఏదో మాట వరసకు ఇలా చెప్పకుండా పరిశోధకులు శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసి మరీ ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా పరిశోధకులు కొంతమంది మహిళలను ఎంచుకున్నారు. వీరికి వారి వారి భాగస్వాములు వేసుకున్న టీషర్టులను అందించి రాత్రి పడుకునే ముందు దిండుకు కవర్‌లాగా చుట్టుకోమని చెప్పారు. అయితే టీషర్టు ధరించిన వారు ఎలాంటి పెర్‌ఫ్యూమ్‌లు వాడకూడదని, స్మోకింగ్‌, డ్రింకింగ్‌ వంటివి చేయకూడదని, కనీసం 24 గంటలపాటు ఆ టీషర్ట్‌ను ధరించి ఉండాలని పరిశోధకులు సూచించారు. దీనికి మహిళలనే ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే వాసనను గ్రహించే శక్తి పురుషుల కంటే మహిళలకే ఎక్కువ కాబట్టి. పరిశోధన కోసం ఎంచుకున్న మహిళల్లో కొందరికి వారి భాగస్వాములు వేసుకున్న టీషర్టులను ఇవ్వగా .. మరికొందరికి ఎవరో తెలియని వ్యక్తుల టీషర్టులను అందించారు. అనంతరం ఆ టీషర్టులను దిండుకు కవర్‌గా చుట్టుకొని పడుకోమని చెప్పారు. పరిశోధకులు రాత్రంతా వారి నిద్రను ప్రత్యేక పద్ధతుల ద్వారా మానిటర్‌ చేశారు. తీరా పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే.. ఎవరికైతే తమ భాగస్వామి వాడిన టీషర్ట్‌ను అందజేశారో వారు త్వరగా నిద్రలోకి జారుకున్నట్లు, రాత్రంతా ఎంతో విశ్రాంతిగా నిద్రపోయినట్లు గుర్తించారు. ఇక వారి భాగస్వాములవి కాకుండా వేరెవరివో టీషర్ట్‌లను దిండుకు చుట్టుకొని నిద్రించిన మహిళలు సుఖంగా నిద్ర పోలేదని వెల్లడైంది.

అందుకే ఇకపై మీరు మీ భాగస్వామిని వదిలి ఏదైనా దూర ప్రదేశాలకు వెళుతున్నప్పుడు కూడా వారికి సంబంధించిన దుస్తులను వెంట తీసుకెళితే ఒత్తిడి తగ్గడంతో పాటు, నిద్రలేమిని కూడా జయించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని