Smriti Irani: స్మృతి చేతి చికెన్ కర్రీ.. మీరూ ట్రై చేస్తారా?

తల్లులు తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు అడిగింది ఇచ్చి వారిని సంతృప్తిపరచడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలో పిల్లల కోరిక మేరకు విభిన్న వంటకాలు తయారుచేసి ప్రేమతో వారికి వడ్డిస్తుంటారు.

Updated : 09 Dec 2021 14:29 IST

తల్లులు తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు అడిగింది ఇచ్చి వారిని సంతృప్తిపరచడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలో పిల్లల కోరిక మేరకు విభిన్న వంటకాలు తయారుచేసి ప్రేమతో వారికి వడ్డిస్తుంటారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇదే చేసింది. ‘అమ్మా! నాకు చికెన్‌ కర్రీ తినాలనిపిస్తోంది..’ అని తన కూతురు షనెల్లే ఇలా అడిగిందో లేదో.. అలా రుచికరమైన రెసిపీని సిద్ధం చేసింది. అంతేకాదు.. ఆ టేస్టీ వంటకానికి సంబంధించిన తయారీ విధానాన్ని ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్‌ చేసి అమ్మ ప్రేమను చాటుకుంది.

కేంద్ర మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా.. తన కుటుంబంతో సమయం గడపడానికి తగిన సమయం కేటాయిస్తుంటారు స్మృతి. ఈ క్రమంలోనే వీలు చిక్కినప్పుడల్లా కిచెన్‌లో గరిటె తిప్పుతూ విభిన్న వంటకాలు తయారుచేస్తుంటారు. వాటి తాలూకు విశేషాలు సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంటారు కూడా! ఇదేవిధంగా తన కూతురి కోసం తాజాగా మరోసారి చెఫ్‌ అవతారమెత్తారు స్మృతి.

అమ్మా.. నాకు చికెన్‌ చేసి పెట్టవూ!! 

‘జోయ్‌ తయారుచేసినట్లుగా నాకు రుచికరమైన చికెన్‌ కర్రీ చేసి పెట్టమ్మా..!’ అని స్మృతి పెద్ద కూతురు షనెల్లే అడగడమే ఆలస్యం.. వెంటనే పనులన్నీ పక్కన పెట్టి కిచెన్‌లోకి దూరిపోయారీ లేడీ మినిస్టర్‌. నిజానికి స్మృతి చిన్న కూతురు జోయ్‌కి పాకశాస్త్రంలో చక్కటి ప్రావీణ్యం ఉందట! ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల కోసం తరచూ విభిన్న వంటకాలు చేసిపెట్టడం జోయ్‌కి అలవాటట! అందుకే షనెల్లే అదే రుచిని స్వయంగా అమ్మ చేతి వంట రూపంలో ఆస్వాదించాలనుకుందట! ఇలా తన కూతురి కోసం ప్రేమతో తయారుచేసిన చికెన్‌ కర్రీ వంటకాన్ని కవిత్వంలా రాస్తూ ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్‌ చేశారామె. ఇందులో వాడే మసాలాలన్నీ మోతాదులో ఉండాలని, గ్రేవీ కోసం వాడే టొమాటో ముక్కలు, కొబ్బరి పాలు కూరను మరింత రుచికరంగా మార్చుతాయంటూ పలు చిట్కాల్ని కూడా అందించారు స్మృతి. మరి, దీని తయారీ విధానమేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కొబ్బరి పాలతో చికెన్‌ కర్రీ

కావాల్సినవి

* చికెన్‌ - కిలోన్నర

* కొబ్బరి పాలు - టేబుల్‌స్పూన్‌

* నూనె - 2 టీస్పూన్లు

* పసుపు - పావు టేబుల్‌స్పూన్‌

* కారం - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌

* కసూరీ మేథీ - కొద్దిగా

* టొమాటోలు - 5 (సన్నటి ముక్కల్లా తరుగుకోవాలి)

* ఉప్పు - రుచికి సరిపడా

* కొత్తి మీర తరుగు - కొద్దిగా

మసాలా కోసం

* వెల్లుల్లి రెబ్బలు - ఐదారు

* అల్లం ముక్కలు - టేబుల్‌స్పూన్‌

* కొబ్బరి తురుము - టేబుల్‌స్పూన్‌

* ధనియాలు - టేబుల్‌స్పూన్‌

* యాలకులు - నాలుగైదు

* మిరియాలు - అరటీస్పూన్‌

* జీలకర్ర – టీస్పూన్‌

* ఎండుమిర్చి - నాలుగైదు

* ధనియాల పొడి - 2 టేబుల్‌స్పూన్లు

* ఉల్లిపాయలు - నాలుగు (సన్నగా తరుగుకోవాలి)

* గసగసాలు - టీస్పూన్‌

తయారీ

* ముందుగా మసాలా కోసం తీసుకున్న పదార్థాలన్నీ దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

* ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని.. వేడయ్యాక.. గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక చికెన్‌ ముక్కలు వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టేయాలి.

* మరో ఐదు నిమిషాల తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, కసూరీ మేథీ, టొమాటో ముక్కలు.. వేసి ఈ పదార్థాలన్నీ చికెన్‌ ముక్కలకు పట్టే దాకా బాగా ఉడికించుకోవాలి. తద్వారా టొమాటో ముక్కలు కూడా మగ్గి చక్కటి గ్రేవీ తయారవుతుంది.

* ఆఖర్లో కొత్తిమీర తరుగు, కొబ్బరి పాలు వేసి.. మరో పది నిమిషాల పాటు సిమ్‌లో ఉడికిస్తే రుచికరమైన కొబ్బరి పాల కోడికూర రడీ!

స్మృతి తయారుచేసిన ఈ చికెన్‌ కర్రీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మేమూ మా కూతుళ్లకు ప్రేమతో ఈ కూర చేసి పెడతామంటూ ఎంతోమంది మహిళలు స్పందిస్తున్నారు. మరి, మీరూ ట్రై చేస్తారా?


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్