Smriti Mandhana: అలాంటి వాడినే మనువాడతా!

‘ఈ భూమిపై జీవించడానికి మీకు గంట సమయమే మిగిలి ఉంటే మీరేం చేస్తారు?’ అనడిగితే.. ‘అందులో అరగంట బ్యాటింగ్‌ చేస్తా’నందట స్మృతీ మంధాన. క్రికెట్‌ అంటే ఆమెకు అంత ఇష్టం మరి! ఆటపై మక్కువతో పదహారేళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబయి క్రికెటర్‌.. ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంటుంది.

Updated : 17 Jun 2024 20:13 IST

(Photos: Instagram)

‘ఈ భూమిపై జీవించడానికి మీకు గంట సమయమే మిగిలి ఉంటే మీరేం చేస్తారు?’ అనడిగితే.. ‘అందులో అరగంట బ్యాటింగ్‌ చేస్తా’నందట స్మృతీ మంధాన. క్రికెట్‌ అంటే ఆమెకు అంత ఇష్టం మరి! ఆటపై మక్కువతో పదహారేళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబయి క్రికెటర్‌.. ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంటుంది. తన బ్యాటింగ్‌ మాయాజాలంతో గత దశాబ్ద కాలంగా భారత మహిళల జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న స్మృతి.. తాజాగా జట్టుకు మరో అపురూప విజయాన్ని అందించింది. 7 వేల పరుగుల క్లబ్‌లోనూ చేరింది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో సెంచరీ బాదిన స్మృతి.. అరుదైన ఘనతనూ తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో 117 పరుగులు చేసిన స్మృతి.. 7 వేల పరుగుల క్లబ్‌లోకి ఎంటరైంది. తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కింది. ఇక భారత మహిళల జట్టులో మిథాలీ తర్వాత అత్యధిక పరుగుల రికార్డు కూడా స్మృతిదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పరుగుల మెషీన్‌ పలు సందర్భాల్లో తన గురించి పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!


క్రికెట్‌.. ఆటకు మించి!

క్రికెట్‌ నాకు జీవితంలో ఎన్నో ఇచ్చింది. జీవితంలో జయాపజయాల్ని సమానంగా స్వీకరించాలన్న గొప్ప పాఠాన్ని నేర్పింది. ఇక 16 ఏళ్ల వయసులో జట్టులోకి అడుగుపెట్టిన నేను వెనుతిరిగి చూడలేదు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంటుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో శతకం బాదడం హ్యాపీగా ఉంది. ఈ మ్యాచ్‌తో 7 వేల పరుగుల క్లబ్‌లోకి ప్రవేశించడం, తద్వారా మిథాలీ వంటి దిగ్గజ క్రికెటర్ సరసన చేరడం మర్చిపోలేని అనుభూతి! ఇక ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం నాకు చాలా ఇష్టం. అలాంటిది ఆమె రికార్డును బద్దలుకొట్టడం ఆనందంగా ఉంది. క్రికెట్‌ ఆడటాన్ని ఎంతగా ఆస్వాదిస్తానో.. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ మ్యాచులూ అంతే ఇష్టంగా చూస్తా!

(అంతర్జాతీయంగా అతి పిన్న వయసులో ఏడు వేల పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకు ఆసీస్‌ క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌ పేరిట ఉంది. 29 ఏళ్ల 13 రోజులకు ఆమె ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం స్మృతి వయసు 27 ఏళ్ల 334 రోజులు.)


అమ్మ కోరిక తీర్చా!

అమ్మ దిగాలుగా ఉంటే చూడలేం.. తన సమస్యేంటో తెలుసుకొని దూరం చేయడానికి ప్రయత్నిస్తాం. నేనూ అదే చేశా! మాది మధ్య తరగతి కుటుంబం. ‘మనకంటూ సొంతిల్లు ఉండాల’ని అమ్మ ఎప్పుడూ అంటుండేది.. ఈ విషయంలో కొన్నిసార్లు తను బాధపడడం చూశా. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు! అమ్మ దగ్గరికెళ్లి ‘పెద్దయ్యాక నీ కోరిక నేను తీరుస్తా..’ అని మాటిచ్చా. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక ఓ పెద్ద ఇల్లు కొని అమ్మకు కానుకగా ఇచ్చా. ఆ క్షణం ఎంత సంతోషంగా, సంతృప్తిగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.


క్రికెటర్‌ని కాకపోయుంటే..!

జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగాలని లేదు. కెరీర్‌ లక్ష్యాలూ అంతే! ఒకవేళ నేను క్రికెటర్‌ని కాకపోయి ఉంటే.. చెఫ్‌గా స్థిరపడేదాన్ని. నాకు వంటలన్నా చాలా ఇష్టం. చిన్న వయసు నుంచి చదువు, క్రికెట్‌తో పాటు కుకింగ్‌కీ ప్రాధాన్యమిచ్చేదాన్ని. అమ్మకు వంటల్లో సహాయం చేసేదాన్ని. విభిన్న రకాల వంటకాలు చేసి ఇంట్లో వాళ్లకు రుచి చూపించేదాన్ని. పంజాబీ వంటకాలు నేర్చుకోవడానికి ప్రత్యేక తరగతులకూ హాజరయ్యా. పనీర్‌ టిక్కా మసాలా కర్రీ బాగా చేస్తాను. ఇక నా ఇష్టాయిష్టాలకొస్తే.. అమ్మ చేతి ఆలూ పరాటా అంటే చాలా ఇష్టం. టూర్లకు వెళ్లినప్పుడు ఈ రెసిపీ బాగా మిస్సవుతుంటా. అందుకే తిరిగి రాగానే అమ్మ చేత్తో ఈ వంటకం తయారుచేయించుకొని లాగించేస్తా.


శాకాహారిని!

ఓ క్రీడాకారిణిగా నేను ఫిట్‌నెస్‌కు తొలి ప్రాధాన్యమివ్వడం ముఖ్యం! ఇందుకోసం ఆహారం, వ్యాయామాల విషయాల్లో పలు నియమాలు పాటిస్తున్నా. శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి సైక్లింగ్‌, రన్నింగ్‌.. వంటి వ్యాయామాలు చేస్తా. స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్‌, లాంజెస్‌, పుల్‌-అప్స్‌.. వంటివీ నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగమే! ఆటలోనైనా, వ్యక్తిగతంగానైనా ఒత్తిడిని చిత్తు చేయడానికి యోగా, ధ్యానం, సూర్యనమస్కారాలు.. నాకు ఉపయోగపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు ప్రశాంతంగా ఉండడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి జిమ్లో సులభమైన వ్యాయామాలు చేయడం నాకు అలవాటు.

నేను శాకాహారిని. ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, పండ్లు, సూప్స్‌, సలాడ్స్‌.. వంటివి నా రోజువారీ మెనూలో తప్పకుండా ఉంటాయి. అలాగే ప్రొటీన్లు ఎక్కువగా లభించే కోడిగుడ్లు, పాలు-పాల పదార్థాలు, సోయా ఉత్పత్తులు, ప్రొటీన్‌ షేక్స్‌.. వంటివీ ఆహారంలో చేర్చుకుంటా. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుంటా.


అదొక్కటీ ఉంటే చాలు!

ఆడపిల్లను కదా.. అందంగా కనిపించాలన్న ఆరాటం నాకూ ఉంటుంది. అలాగని సమయం వృథా చేసుకోను. ఎండ, వాతావరణ కాలుష్యం నుంచి నా చర్మాన్ని కాపాడే లోషన్‌ ఒకటి ఉంటే చాలు. నేనెక్కడికి వెళ్లినా ఈ బాడీ లోషన్‌ని వెంట తీసుకెళ్తా. ఇక బయటికి వెళ్లినప్పుడల్లా ఈ లోషన్‌తో పాటు, లిప్‌ బామ్‌ రాసుకుంటా. అంతే.. ఇదే నా సింపుల్‌ మేకప్‌ రొటీన్. ఇంతకుమించి చాలావరకు మేకప్‌కు దూరంగా ఉంటా. నేను నాలా ఉండడమే నాకు ఇష్టం. ఇదే నా ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది.


కాబోయే వాడిలో..!

పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. కాబోయే వాడు ఎలా ఉండాలో ప్రతి అమ్మాయీ కలలు కంటుంది. అలా నాకూ కొన్ని కలలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. నన్ను చేసుకోబోయేవాడు మంచి మనసున్న వాడై ఉండాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నా కెరీర్‌ను అర్థం చేసుకోవాలి. కెరీర్‌ బిజీలో పడిపోయి కొన్నిసార్లు నేను తనకు సమయం కేటాయించలేకపోవచ్చు. ఈక్రమంలో నన్ను అర్ధం చేసుకుని, ప్రోత్సహించేవాడినే మనువాడతా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్