Water Warrior: పాడుపడిన బావులకు ‘జల’ కళ తీసుకొస్తోంది!

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాల’న్నారు పెద్దలు. కానీ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకునే’ వారే మనలో చాలామంది! ఏ విషయమో ఎందుకు.. నీటి వినియోగాన్నే తీసుకుందాం..! నీటిని వృథా చేయడం, జల వనరుల్ని కలుషితం....

Updated : 27 Apr 2023 18:22 IST

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాల’న్నారు పెద్దలు. కానీ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకునే’ వారే మనలో చాలామంది! ఏ విషయమో ఎందుకు.. నీటి వినియోగాన్నే తీసుకుందాం..! నీటిని వృథా చేయడం, జల వనరుల్ని కలుషితం చేయడం.. ఇలా మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో నగరంలో ఎటు చూసినా ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. మరి, మన పరిస్థితే ఇలా ఉంటే.. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన నీరు దొరకడం.. కష్టమే! మనం నిర్లక్ష్యం చేస్తోన్న ఈ పరిస్థితినే మార్చాలని కంకణం కట్టుకున్నారు హైదరాబాద్‌కు చెందిన కల్పనా రమేశ్‌. వర్షపు నీటిని ఆదా చేయడం దగ్గర్నుంచి శిథిలావస్థలో ఉన్న బావుల్ని పునరుద్ధరించడం, కలుషితమైన నీటి వనరుల్ని తిరిగి శుద్ధి చేయడం దాకా.. ఇలా భూగర్భ జలాల్ని పెంచడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారామె. ఈ క్రమంలో ఓ సామాజిక సంస్థను స్థాపించి.. నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు.. చుట్టూ ఉన్న వారిలోనూ ఈ దిశగా అవగాహన పెంచుతున్నారు. తన సోషల్ ఎంటర్‌ప్రైజ్ ద్వారా ఆర్ధిక స్వావలంబనకూ కృషి చేస్తున్నారు. చేయి చేయి కలిపితేనే ఈ ‘జల’ యజ్ఞం పరిపూర్ణమవుతుందంటోన్న కల్పన.. తన ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది బెంగళూరు. విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తిచేసుకున్నా. ‘బీఎంఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌’లో ఆర్కిటెక్చర్‌ చదివాను. ఆపై ఒక ఆర్కిటెక్ట్‌ వద్ద కొన్నాళ్ల పాటు పనిచేశా. పెళ్లయ్యాక మావారితో కలిసి యూఎస్‌ వెళ్లాను. అక్కడే ఆర్కిటెక్చర్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు సంబంధించిన కోర్సులు చేశాను. ఆపై సింగపూర్‌లో కొన్నేళ్ల పాటు నివసించాం. యూఎస్‌, సింగపూర్‌లో ఉన్నప్పుడు అక్కడి ‘కళా సంఘాల్లో’ భాగమయ్యా. ఇక 2000లో భారత్‌కు తిరిగొచ్చిన మేము హైదరాబాద్‌లో స్థిరపడ్డాం.

‘ట్యాంకర్‌ ఫ్రీ హోమ్‌’ చేయాలని..!

అప్పటిదాకా నీటి సమస్యల గురించి వినడమే కానీ.. ఇక్కడికొచ్చాకే వాటి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. మేమున్న కమ్యూనిటీలో నీటి కొరత కారణంగా రోజూ ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకోవాల్సి వచ్చేది. క్లోరిన్‌ ఎక్కువగా ఉండే ఆ నీళ్లు ఎంతవరకు స్వచ్ఛమైనవో, సురక్షితమైనవో అన్నది ప్రశ్నార్థకమే! పైగా వీటి ధర కూడా ఎక్కువే! అయితే ‘ఎన్నాళ్లని ట్యాంకర్లపై ఆధారపడతాం.. వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే ఈ సమస్య ఉండదు కదా!’ అనిపించింది. 2010లో మా సొంతింటి నిర్మాణం చేపట్టే క్రమంలోనే ఈ పద్ధతిని ఆచరణలో పెట్టా. ఈ క్రమంలోనే యూవీ ఫిల్టర్‌ సహాయంతో వర్షపు నీటిని శుద్ధి చేసే వ్యవస్థను ఏర్పాటుచేశాం. అలాగే మురుగు నీటిని వేరు చేసి.. ఇతర నిత్యావసరాల కోసం వినియోగించుకున్న నీటిని ఆర్‌వో ఫిల్టర్‌తో రీసైక్లింగ్‌ చేసే మరో వ్యవస్థనూ నెలకొల్పాం. ఈ రెండు పద్ధతుల్లో లీటర్ల కొద్దీ నీటిని ఆదా చేయగలిగాం. ఒకానొక సమయంలో ఈ నీటిని కాలనీ వాసులకూ అందించేవాళ్లం. అప్పుడే ఇలా ప్రతి ఇంటినీ ‘ట్యాంకర్ ఫ్రీ హోమ్‌’ చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే అందుకోసం ఓ సామాజిక వేదిక కావాలి. ఇదే ‘SAHE’ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపేలా చేసింది. ఈ క్రమంలో నీటి నిల్వ విషయంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కమ్యూనిటీలో వర్షపు నీటిని ఆదా చేసే పలు ప్రాజెక్టులూ చేపట్టాం.

రెండేళ్ల అభివృద్ధి ఇది!

ఇలా ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్న క్రమంలోనే కలుషితమవుతోన్న నీటి వనరులు, అంతరించిపోతోన్న పురాతన మెట్ల బావులపై ఒక అవగాహన ఏర్పడింది. నిజానికి వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న వారు ఎంతోమంది! పైగా ఈ బావులకు ఏళ్ల నాటి చరిత్ర ఉంది.. బావిబావికో కథ ఉంది.. వీటిని తిరిగి అభివృద్ధి చేస్తే.. భూగర్భ జలాలు పెరుగుతాయి.. పర్యటక ప్రదేశంగా పునరుద్ధరిస్తే చుట్టుపక్కల నివసించే వారికి ఆర్థిక వనరుగా కూడా మారుతుందనిపించింది. ఈ ఆసక్తితోనే తెలంగాణలో ఉన్న మెట్ల బావుల్ని గుర్తించి వాటిని పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేస్తోన్న ‘హైదరాబాద్‌ డిజైన్‌ ఫోరమ్‌’లో చేరాను. ఈ క్రమంలోనే 2020లో ‘ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో ఓ సామాజిక సంస్థను నెలకొల్పాను. వర్షపు నీటిని ఆదా చేయడంతో పాటు.. జల వనరుల్ని పరిరక్షించి.. సమాజంలో మార్పు తీసుకురావడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఆయా జల వనరుల్ని ఎలా పునరుద్ధరించాలి? ప్రభుత్వాన్ని ఇందులో ఎలా సమ్మిళితం చేయాలి? ఇందుకోసం ఎలాంటి నిపుణులు కావాలి? ఎవరి నుంచి అనుమతులు పొందాలి? నిధులెలా సమకూర్చుకోవాలి?.. వంటి ఎన్నో విషయాల్ని లోతుగా పరిశోధించి తెలుసుకున్నా. దీన్ని బట్టే నిపుణుల బృందాన్ని సమకూర్చుకున్నా. అలా ఈ రెండేళ్లలో నగరంలోని సుమారు 9 మెట్ల బావుల్ని, ఇతర జిల్లాల్లో ఆరు మెట్ల బావుల్ని పునరుద్ధరించాం. వాటిలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు.. అందులోని నీటిని శుద్ధి చేసి.. ఆయా బావుల రూపురేఖలు మార్చి పర్యటక ప్రదేశంగా వాటిని అభివృద్ధి చేశాం.

అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్!

ఇటీవలే పునరుద్ధరణ పనులు పూర్తై ప్రారంభమైన బన్సీలాల్‌ పేట్‌ మెట్ల బావి.. నేను పునర్వైభవం తీసుకొచ్చిన వాటిలో 9వది. 17వ శతాబ్దం కాలం నాటి ఈ మెట్ల బావిని నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టా. ఈ క్రమంలో మెట్ల చుట్టూ విద్యుద్దీపాలతో అలంకరించాం. అలాగే టూరిస్ట్‌ ప్లాజా, యాంఫీథియేటర్‌, జాగింగ్‌ ట్రాక్‌, గార్డెన్‌.. వంటి అధునాతన పద్ధతుల్లో దీన్నో పర్యటక ప్రదేశంగా అభివృద్ధి చేశాం. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జలశక్తి అభియాన్‌ అవార్డు - 2023’, దుబాయ్‌లో ‘బిగ్‌ 5 కన్‌స్ట్రక్షన్‌ ఇంపాక్ట్‌ అవార్డ్‌’ అందుకున్నా. ప్రస్తుతం కామారెడ్డిలో లింగంపేట్‌ మెట్ల బావి, భికనూర్‌ మెట్ల బావి; బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని మూడు మెట్ల బావులు; ఓయూ మెట్ల బావి.. పునరుద్ధరణ పనులు చేపట్టాం. వీటన్నింటికీ కావాల్సిన నిధులు కొన్ని కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్నేహితుల వద్ద నుంచి సమకూర్చుకుంటున్నాం. అలాగే ‘కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ’ చేపట్టిన ‘అమృత్‌ 2.o’ అనే కార్యక్రమంలో భాగంగా రెండు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాం. వీటితో పాటు కలుషితమైన కొన్ని సరస్సుల్నీ పునరుద్ధరిస్తున్నాం.

బిలియన్‌ లీటర్ల నీరు.. నా లక్ష్యం!

ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లోని CIEలో ఇంక్యుబేట్‌ అయ్యాం. తెలంగాణ వ్యాప్తంగానే 600లకు పైగా మెట్ల బావులున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఉన్న బావుల్ని పునరుద్ధరించాలని కంకణం కట్టుకున్నా. అలాగే త్వరలోనే ఒక బిలియన్‌ లీటర్ల నీటిని ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పటికే స్థానికంగా నీటి సంరక్షణ పద్ధతులపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ నీటి అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న వారిని ఈ దిశగా ప్రోత్సహించాలనుకుంటున్నా. తద్వారా ఏకకాలంలో ఎక్కువ బావుల్ని పునరుద్ధరించచ్చు. అధిక మొత్తంలో నీటిని పరిరక్షించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘స్టేట్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ అవార్డు - 2022’, ‘HMA విమెన్‌ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్‌ ది ఇయర్‌ - 2021’.. వంటి పురస్కారాలు నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఆ సంతృప్తి చాలు!

ప్రస్తుతం ‘ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌’తో పాటు నా డిజైనింగ్‌ హౌస్ వ్యాపారాన్నీ కొనసాగిస్తున్నా. అయితే పాతికేళ్లుగా డిజైన్‌ స్టూడియో నడుపుతున్నప్పటికీ.. నీటి సంరక్షణ దిశగా చేస్తోన్న ప్రాజెక్టులతోనే నాకు అధిక సంతృప్తి దక్కుతోంది. మనం ఏది ఎంచుకున్నా.. సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలనేది నా ఆకాంక్ష. ఇతరుల మాటలు, విమర్శలకు తలొగ్గకుండా.. తపన, స్వీయ నమ్మకం, కష్టపడేతత్వం సొంతమైతే అసాధ్యమనేదే ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్