బూచోళ్లున్నారు... జాగ్రత్త..!

నాలుగేళ్ల చిన్నారిపై ఓ యూట్యూబర్‌ చేసిన అశ్లీల కామెంట్లు ప్రతిఒక్కరికీ కోపం తెప్పించాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ స్పందించేలా చేసింది. ఆ కామెంట్లు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేయాలన్నదే అందరూ ముక్తకంఠంతో చెప్పేమాట.

Published : 10 Jul 2024 01:49 IST

నాలుగేళ్ల చిన్నారిపై ఓ యూట్యూబర్‌ చేసిన అశ్లీల కామెంట్లు ప్రతిఒక్కరికీ కోపం తెప్పించాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ స్పందించేలా చేసింది. ఆ కామెంట్లు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేయాలన్నదే అందరూ ముక్తకంఠంతో చెప్పేమాట. అదేసమయంలో తల్లిదండ్రులూ కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎందుకంటే... నెలల చిన్నారి బోసినవ్వులు చిందించినా... స్కూల్లో తొలి అడుగు పెట్టినా... ఆ మురిపాలను ఒకింత గర్వంగానో, ఫాలోయర్లను ఆకర్షించాలనో సామాజిక మాధ్యమాల్లో ఉంచుతుంటారు. కానీ ఈ సరదా... పిల్లలకు అపాయంగా మారగలదని తెలుసా?

ఆధునిక సాంకేతికత పుణ్యమాని అరచేతిలోకే కెమెరా వచ్చింది. ఇంకేముంది, పిల్లలకు సంబంధించి ప్రతి చిన్న జ్ఞాపకాన్నీ దాచుకోవాలన్న కోరిక. ఫొటో లేదా వీడియో తీసి ఊరుకుంటామా... స్నేహితులు, బంధువులతో పంచుకోవాలనిపిస్తుంది. నిమిషాల్లో అందమైన క్యాప్షన్‌ జోడించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేస్తాం. చూసినవాళ్లంతా క్యూట్, వావ్‌ అంటోంటే... ఫాలోయర్లు పెరుగుతోంటే తెగ సంబరపడతాం. తీరా చిక్కుల్లో పడ్డాక తలపట్టుకుంటాం. వీటితో చిక్కేముంది అనుకుంటున్నారా!

ఒకమ్మాయి స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లింది. అక్కడ ఫొటో ఉచితం అని ఉంటే సరదాగా ప్రయత్నించింది. కొరియర్‌ చేస్తామంటే చిరునామా ఇవ్వడంతోపాటు చదవకుండానే వాళ్లడిగిన చోట సంతకమూ చేసింది. వాళ్లు చెప్పినట్టుగా ఫొటో కాపీలొచ్చాయి. దాంతోపాటు ప్రపంచంలో ఎన్నో యాడ్‌లకు ఆమె ముఖచిత్రమైంది. అదేమని అడిగితే ఆమె ఒప్పుకొన్నట్లుగా చేసిన సంతకాన్ని చూపించారు. దీనికీ సోషల్‌మీడియాలో పంచుకోవడానికీ సంబంధమేంటని అడగొచ్చు. అకౌంట్‌ రూపొందించుకునేప్పుడు అడిగే ప్రతిదానికీ పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళతాం. అలా మీరు పోస్ట్‌ చేసిన ఫొటో హక్కునీ ఇచ్చేస్తాం. అంటే ఆ ప్లాట్‌ఫాం నుంచి ఏ సంస్థైనా దాన్ని కొనుక్కుని, ఉపయోగించుకోవచ్చు. ఉత్పత్తికి మార్కెటింగ్‌ చేసేలా, వీధుల్లో అడుక్కుంటున్నట్లుగా... ఎలాగైనా మార్పులూ చేర్పులూ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి నెట్టింటిలోకి చేరాక ఆ ఫొటోపై ఇక మనకు పట్టు పోయినట్లే! అలా మార్చిన తన ఫొటోని చూసుకుంటే భవిష్యత్తులో ఆ చిన్నారికి ఏమనిపిస్తుంది?

చేతిలో పెడుతున్నాం!

సోషల్‌మీడియా కారణంగా కిడ్నాప్‌కి గురవుతున్న కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. షాపింగ్, స్కూలు, పోటీలు... పిల్లలకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ పంచుకుని మురిసిపోతాం కానీ... దాని మాటున వాళ్ల పేరు, స్కూలు, ఆసక్తులు, తరచూ వెళ్లే ప్రదేశాలు వగైరా అన్నీ పంచుకుంటున్నాం. తెరమాటున దాగి, ఆ సమాచారం ఆధారంగా పిల్లలను కిడ్నాప్‌ చేయడం, బెదిరించడం వంటివీ జరుగుతున్నాయి. ఓ టీనేజీ అమ్మాయి ఇంటికి రాగానే ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో గొడవలేమీ లేవు. ప్రేమ వ్యవహారమూ కాదు. అయినా ఆమెందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కాలేదు. విచారిస్తే ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో ఆమె ఫొటో కనిపించింది. తనలా దిగలేదు, స్నేహితులూ పెట్టలేదు. ఆరా తీయగా... కూతురి ఫొటోలను మురిపెంగా పోస్టు చేసుకునేదా తల్లి. సాంకేతికతతో దాన్ని అలా మార్ఫ్‌ చేసి, అమ్ముకున్నాడో ప్రబుద్ధుడు. ఈ అమ్మాయి నిజంగానే అలాంటిది అనుకుని స్నేహితులు దూరం పెట్టారు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తల్లి సరదాగా చేసిన చర్య దీనికి దారి తీసింది. దీన్నే ‘డిజిటల్‌ కిడ్నాపింగ్‌’ అంటారు. ఏఐతో చిన్నపిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారో మార్చి, వాటిని అమ్ముకుంటున్న వారూ ఉన్నారు.

పారాహుషార్‌!

‘తల్లి కాబోతున్నాం’ అని ఆనందంగా చెప్పే తారలు... పుట్టాక పిల్లల ముఖాలను మాత్రం వెల్లడించరు. ఎందుకిలా అని చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాం కదా! సినిమా ఆడకపోయినా, ఆటలో ఓడినా ఏమాత్రం సంబంధం లేని పిల్లలకీ ఆన్‌లైన్‌లో విమర్శలు, బలాత్కార బెదిరింపులూ తప్పట్లేదు. ఇంకా అనవసర పోలికలు, వద్దన్నా వచ్చిపడే స్టార్డమ్‌ వాళ్లని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఇక ఫొటో మార్ఫింగ్‌లు, డీప్‌ఫేక్‌ల సంగతి చెప్పనక్కర్లేదు. ‘షేరెంటింగ్‌’ పేరుతో తయారుచేసే బుజ్జి స్టార్లకూ ఈ పరిస్థితి తప్పదు. అటు చిన్నా, ఇటు పెద్దా కాని స్థితికి చేరుకున్నాక వాళ్ల రూపురేఖల మీద వచ్చే కామెంట్లు ఆత్మన్యూనతకు దారితీస్తాయి. కాస్త పెద్దయ్యాక గుర్తింపు తగ్గితే తట్టుకోలేని స్థితికి చేరతారు. ఈ పరిస్థితి మీ పిల్లలకు రాకముందే మేల్కొనండి. ఫొటోలు, రీల్స్‌ పేరుతో వాళ్ల సమాచారాన్ని పంచుకుని లేని ప్రమాదాన్ని కొని తెస్తున్నారేమో ఆలోచించుకోండి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్