ఈ ‘క్యాచ్’ గర్ల్ గురించి మీరూ వెతికేస్తున్నారా?

గాల్లో ఎగురుతూ క్యాచ్‌ పట్టడం, బౌండరీ లైన్‌ దగ్గర విన్యాసాలు చేస్తూ బంతిని ఒడిసిపట్టడం.. ఇలాంటి అరుదైన క్యాచ్‌లు మగాళ్ల క్రికెట్‌లోనే ఎక్కువగా చూస్తుంటాం.. కానీ అమ్మాయిలూ ఇందుకు ఏమాత్రం తీసిపోరని, మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగూ చేయగలరని నిరూపించింది యువ ఇండియన్‌ బ్యాట్స్‌ఉమన్‌ హర్లీన్‌ డియోల్‌. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బౌండరీ లైన్‌ దగ్గర ఆమె అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్‌ ప్రపంచ క్రీడాభిమానులంతా తన వైపు చూసేలా చేసింది.

Published : 12 Jul 2021 19:22 IST

Photo: Instagram

గాల్లో ఎగురుతూ క్యాచ్‌ పట్టడం, బౌండరీ లైన్‌ దగ్గర విన్యాసాలు చేస్తూ బంతిని ఒడిసిపట్టడం.. ఇలాంటి అరుదైన క్యాచ్‌లు మగాళ్ల క్రికెట్‌లోనే ఎక్కువగా చూస్తుంటాం.. కానీ అమ్మాయిలూ ఇందుకు ఏమాత్రం తీసిపోరని, మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగూ చేయగలరని నిరూపించింది యువ ఇండియన్‌ బ్యాట్స్‌ఉమన్‌ హర్లీన్‌ డియోల్‌. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బౌండరీ లైన్‌ దగ్గర ఆమె అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్‌ ప్రపంచ క్రీడాభిమానులంతా తన వైపు చూసేలా చేసింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, సచిన్‌ వంటి క్రీడా దిగ్గజాల మన్ననలందుకునేలా చేసింది. దీంతో ఇప్పుడు చాలామంది ఆమె క్యాచ్‌ను రిపీట్‌ చేస్తూ మరీ చూస్తున్నారు. పనిలో పనిగా ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో తెగ గాలిస్తున్నారు.

హర్లీన్‌ కౌర్.. చండీగఢ్ నుంచి తానియా భాటియా తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచిందామె. 2019లో వాంఖడేలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో జట్టులోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత టీ20 టీమ్‌లోనూ స్థానం సంపాదించింది. ఇక గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌ జట్టులోనూ హర్లీన్‌ పేరుంది. 2019లో ‘ఐపీఎల్‌ టీ20 ఛాలెంజ్‌’లో భాగంగా ట్రయల్‌బ్లేజర్స్‌ తరఫున ఆడిన ఆమె.. స్మృతి మంధానతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇలా బ్యాటింగ్ లోనే  కాదు.. బౌలింగ్, ఫీల్డింగుల్లోనూ రాణిస్తోందీ యువ క్రీడాకారిణి.

వావ్‌.. వాట్‌ ఎ క్యాచ్!

అయితే రెండేళ్ల క్రితమే హర్లీన్‌ అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టినా.. ఎక్కువమందికి చేరువైంది మాత్రం ఇటీవలే తాను పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్‌తోనే అని చెప్పచ్చు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ చేసిందామె. అప్పటికే దూకుడుగా ఆడుతూ అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న ఇంగ్లిష్‌ బ్యాట్స్‌ఉమన్‌ అమీ జోన్స్‌ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తోన్న హర్లీన్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టింది. తన తలపై నుంచి వెళ్తూ సిక్సర్‌ అవుతుందనుకున్న బంతిని గాల్లోకి డైవ్‌ చేసి పట్టడం ఒక విశేషమైతే.. బంతితో బౌండరీ దాటుతానేమోనని.. దాన్ని గాల్లోకి విసిరి.. మళ్లీ డైవ్‌ చేసి అందుకోవడం అందరినీ అబ్బురపరిచింది. ఇలా ఆమె పట్టిన అరుదైన, అద్భుతమైన క్యాచ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇలా ఆమె క్యాచ్‌కు ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతున్నారు.

ప్రధాని మోదీ దగ్గర్నుంచి, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌తో సహా ఎంతోమంది క్రికెటర్లు, ఇతర ప్రముఖులు, ప్రత్యర్థి ఇంగ్లండ్‌ జట్టు.. ఇలా ప్రపంచమంతా ఆమె ఫీల్డింగ్‌ మెలకువలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అద్భుతం.. హర్లీన్‌! కీప్‌ ఇట్‌ అప్‌’ అంటూ ఈ యువ క్రికెటర్‌ను ప్రోత్సహిస్తున్నారు.

గల్లీ క్రికెట్‌ ఆడా!

ఇలా ఒక్క క్యాచ్‌తో వైరల్‌గా మారిన హర్లీన్‌ గురించి క్రికెట్‌ ఫ్యాన్స్‌ నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అయితే తనకు చిన్నతనం నుంచే క్రికెట్‌ అంటే మక్కువని, ఇదే తనను గల్లీ క్రికెట్‌ ఆడేలా చేసిందంటూ ఓ సందర్భంలో తన గురించి కొన్ని విషయాలు పంచుకుందీ యూత్‌ ఐకాన్.

* ఆటపై మక్కువతో ఎనిమిదేళ్ల నుంచే క్రికెట్‌ సాధన మొదలుపెట్టానంటోంది హర్లీన్‌. ఈ క్రమంలో తన సోదరుడితో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడేదట! అంతేకాదు.. క్రికెట్‌ అంటే తనకున్న ఇష్టాన్ని గుర్తించిన తన తల్లిదండ్రులు ఈ దిశగా తనని ప్రోత్సహించారంటోంది.

* ఆడపిల్లలు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉందంటే.. చుట్టూ ఉన్న వాళ్లు/బంధువులు ముందు చదువుపై శ్రద్ధ పెట్టు అనడం సహజమే! ఇలాంటి అనుభవమే చిన్నతనంలో తనకూ ఎదురైందని, అయితే ప్రస్తుతం విమర్శించిన నోళ్లే ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉందంటోందీ యువ క్రికెటర్.

* క్రికెట్‌పై దృష్టి పెట్టి చదువును నిర్లక్ష్యం చేయలేదని, రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నానంటోంది హర్లీన్‌. ఇక కెమిస్ట్రీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అట!

* క్రికెటర్‌ కాకపోయుంటే పైలట్‌గా స్థిరపడేదాన్నంటోంది హర్లీన్.

* ధోనీ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని చెప్పే ఈ యువ తేజం ప్రపంచ కప్‌ ట్రోఫీని ఒక్కసారైనా ముద్దాడాలని ఉందంటోంది.

* ఆటలోనే కాదు.. అందంలోనూ సినిమా తారలకు ఏమాత్రం తీసిపోని హర్లీన్‌ని చూసి చాలామంది ‘బ్యూటీ క్వీన్‌ ఆఫ్‌ విమెన్స్‌ క్రికెట్‌’ అని పిలుస్తారట!

* బయటి వంటకాల కంటే.. అమ్మ చేతి చికెన్‌ కర్రీ, చిల్లీ పనీర్‌ అంటే ఈ క్రికెట్‌ బ్యూటీకి మహా ఇష్టమట!

* ఇక ఖాళీ సమయాల్లో సినిమాలు చూడడానికి, పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతుందట హర్లీన్.

* ఈ ముద్దుగుమ్మకు ఫిట్‌నెస్ పైనా మక్కువ ఎక్కువే! ఈ క్రమంలోనే తన ఫిట్‌నెస్‌ వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్