Double XL: అప్పుడు అమ్మ బరువు తగ్గమని పదే పదే చెప్పేది!
కాస్త బొద్దుగా ఉంటే బరువు తగ్గమని, సన్నగా ఉంటే పెరగమని.. ఇలాంటి ఉచిత సలహాలిచ్చే వారు మన చుట్టూ చాలామందే ఉంటారు. అయితే బయటిదాకా ఎందుకు ఇలాంటి విమర్శలు ఇంటి నుంచే మొదలవుతాయంటోంది బాలీవుడ్ బబ్లీ బ్యూటీ సోనాక్షీ సిన్హా. ‘డబుల్ XL’ చిత్రంతో....
(Photos: Instagram)
కాస్త బొద్దుగా ఉంటే బరువు తగ్గమని, సన్నగా ఉంటే పెరగమని.. ఇలాంటి ఉచిత సలహాలిచ్చే వారు మన చుట్టూ చాలామందే ఉంటారు. అయితే బయటిదాకా ఎందుకు ఇలాంటి విమర్శలు ఇంటి నుంచే మొదలవుతాయంటోంది బాలీవుడ్ బబ్లీ బ్యూటీ సోనాక్షీ సిన్హా. ‘డబుల్ XL’ చిత్రంతో ఇటీవలే మన ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కోసం ఏకంగా 17 కిలోలు పెరిగింది. ప్రస్తుతం తన అధిక బరువును తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్న ఈ చక్కనమ్మ.. ఒకరి ఒత్తిడితో మన శరీరాన్ని మనం విమర్శించుకోకుండా.. మనసు చెప్పింది విన్నప్పుడే ప్రశాంతంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉండగలమంటూ తనలోని బాడీ పాజిటివిటీని చాటుకుంది సోనా బేబీ.
అలనాటి నటీనటులు శత్రుఘ్నసిన్హా, పూనమ్ సిన్హా ముద్దుల కూతురు సోనాక్షీ సిన్హా. నట వారసత్వంతో సంబంధం లేకుండా స్వీయ ప్రతిభతో ఎదిగిన నటీమణుల్లో ఆమె ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి సవాలుతో కూడుకున్న పాత్రలు ఎంచుకోవడం, వాటికి తగిన న్యాయం చేయడంలో తానెప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మరో తార హ్యూమా ఖురేషీతో కలిసి ‘డబుల్ XL’ అనే సినిమాతో మన ముందుకొచ్చింది సోనా బేబీ. స్వీయ ప్రేమను, బాడీ పాజిటివిటీని చాటే కథనంతో రూపుదిద్దుకుందీ చిత్రం.
రెండు నెలలు.. 17 కిలోలు!
బరువు తగ్గడానికి నెలల కొద్దీ శ్రమించాల్సి వస్తుంది. అదే బరువు పెరగడమంటే తక్కువ సమయంలో కిలోల కొద్దీ పెరిగేయచ్చు.. అలా తానూ రెండు నెలల్లోనే 15-17 కిలోలు పెరిగానంటోంది సోనాక్షి. ‘డబుల్ XL కోసం రెండు నెలల్లోనే సుమారు 17 కిలోలు పెరిగాను. బరువు తగ్గడంతో పోల్చితే పెరగడానికి అంతగా కష్టపడాల్సిన పనిలేదు. అయితే ఇందుకు రెండు దారులున్నాయి. మొదటిది-ఆరోగ్యకరంగా పెరగడం, రెండోది-అనారోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం. కానీ నేను మొదటి దారినే ఎంచుకున్నా. బేసిగ్గానే నేనో పెద్ద ఫుడీని! మరోవైపు ఫిట్‌నెస్‌కూ ప్రాధాన్యమిస్తాను. అలాగని నోరు కట్టేసుకోవడం నాకు నచ్చదు. ఏదైనా పదార్థం తినాలనిపిస్తే.. వెంటనే తినేస్తా.. కాకపోతే ఇలాంటప్పుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇలా నాకు నచ్చిన పదార్థాల్ని (ఆరోగ్యకరమైనవి) అమితంగా లాగిస్తూ ఈ సినిమా కోసం కిలోల కొద్దీ పెరిగాను. ఇక ఈ బరువును తగ్గించుకోవడానికి ఈజీగా నాకు సుమారు ఏడాది కాలం పడుతుంది..’ అందీ బాలీవుడ్ బ్యూటీ.
స్కూల్లో ఏడిపించేవారు!
కాస్త బొద్దుగా ఉన్న పిల్లల్ని స్కూల్లో ఇతర పిల్లలు ఏడిపించడం మనం చూస్తూనే ఉంటాం. తానూ ఇలాగే స్కూల్లో బుల్లీయింగ్‌కి గురయ్యానంటోంది సోనా బేబీ. ‘నేను చిన్నతనం నుంచే బొద్దుగా ఉండేదాన్ని. దాంతో స్కూల్లో తోటి విద్యార్థులు నన్ను వివిధ పేర్లతో పిలిచేవారు.. ఏడిపించేవారు. ముందు ఈ విషయంలో కాస్త బాధపడినా.. ఆ తర్వాత వాళ్ల మాటలు పట్టించుకోవడం మానేశా. నాలో ఉన్న ప్రత్యేకతలపై దృష్టి పెట్టా. స్కూల్లో నేను ఆటలపోటీల్లో బాగా రాణించేదాన్ని. ఆ సమయంలో ఇవే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కాలేజీకి వెళ్లే రోజుల్లోనూ నా శరీర బరువు ఏమాత్రం తగ్గలేదు. ఇక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసే క్రమంలో.. చాలామంది నా శరీరాకృతి, బరువు విషయంలో రకరకాలుగా మాట్లాడేవారు. ఫిట్‌గా మారమంటూ నాపై ఒత్తిడి తెచ్చేవారు. అయినా వీటిన్నింటినీ పక్కన పెట్టి నాకు నచ్చినట్లుగా నేను ఉండడానికే ఇష్టపడేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే.. డబుల్ XL సినిమా నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉందనిపించింది.. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇదీ ఓ కారణమే!’ అందీ బబ్లీ గర్ల్.
చేయద్దంటే.. అదే చేసేదాన్ని!
కొంతమంది పిల్లలు చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఏదైతే చేయద్దంటామో కచ్చితంగా అదే చేసి చూపిస్తుంటారు. చిన్న వయసులో తానూ అలాగే ఉండేదాన్నంటోంది సోనాక్షి. ‘చిన్నతనంలో నేను చాలా మొండిగా ప్రవర్తించేదాన్ని. ఏదైనా చేయద్దంటే అది కచ్చితంగా చేసేదాన్ని. మా అమ్మ నా బరువు విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉండేది.. ఈ క్రమంలో బరువు తగ్గమని పదే పదే చెబుతుండేది. నాకు అది నచ్చేది కాదు.. కానీ కొన్నాళ్లకు అమ్మ ఈ విషయంలో రియలైజ్ అయింది. బరువు తగ్గమని చెప్పడం మానేసింది. అప్పుడనిపించింది.. నా అధిక బరువుపై దృష్టి పెట్టాలని! అలాగని మా అమ్మను, తనలా తన కూతురు బరువు తగ్గాలని కోరుకునే తల్లుల్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి ఒత్తిడితో వారిని ఇబ్బంది పెట్టడం కాకుండా.. వారిని వారిలా ఉండనివ్వడం, స్వీయ ప్రేమను పెంపొందించుకునేలా వారిని ప్రోత్సహించడం.. వంటివి చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం నింపిన వారవుతారు. అలాగే బరువు, పొడవు-పొట్టి, చర్మ ఛాయ.. ఇలాంటి విషయాల్లో ఇతరులు ఏమన్నా పట్టించుకోకుండా ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం, అంగీకరించుకోవడం చేస్తే.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం.. ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించుకోగలుగుతాం.. నేను నమ్మే సిద్ధాంతమిదే!’ అంటూ తన మాటలతో మరోసారి బాడీ పాజిటివిటీని చాటిందీ బాలీవుడ్ బేబ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.