నేను వాడే ఫేస్‌మాస్కులివే..!

తారలు తమ అందాన్ని పెంపొందించుకోవడానికి బయట దొరికే ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడతారనుకుంటాం.. మేకప్‌తో తమ సొగసుకు సొబగులద్దుతారనుకుంటాం. కానీ తాను మాత్రం వంటింట్లో దొరికే సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులకే ఓటేస్తానంటోంది బాలీవుడ్‌ సొగసరి సోనమ్‌ కపూర్‌. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ సిరీస్‌లో భాగంగా తన ఆరోగ్య, సౌందర్య రహస్యాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన అపురూప లావణ్యాన్ని ద్విగుణీకృతం చేసే కొన్ని సహజసిద్ధమైన ఫేస్‌మాస్క్‌ల గురించి చెప్పుకొచ్చింది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Updated : 02 Jul 2021 17:40 IST

తారలు తమ అందాన్ని పెంపొందించుకోవడానికి బయట దొరికే ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడతారనుకుంటాం.. మేకప్‌తో తమ సొగసుకు సొబగులద్దుతారనుకుంటాం. కానీ తాను మాత్రం వంటింట్లో దొరికే సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులకే ఓటేస్తానంటోంది బాలీవుడ్‌ సొగసరి సోనమ్‌ కపూర్‌. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ సిరీస్‌లో భాగంగా తన ఆరోగ్య, సౌందర్య రహస్యాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన అపురూప లావణ్యాన్ని ద్విగుణీకృతం చేసే కొన్ని సహజసిద్ధమైన ఫేస్‌మాస్క్‌ల గురించి చెప్పుకొచ్చింది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తన విభిన్న ఫ్యాషన్లతో బాలీవుడ్‌ ఫ్యాషనిస్టాగా పేరుతెచ్చుకున్న సోనమ్‌.. ప్రస్తుతం తన ఫ్యాన్స్‌కు అందం, ఆరోగ్యానికి సంబంధించిన పాఠాలు చెబుతోంది. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ సిరీస్‌లో భాగంగా తాను పాటించే సౌందర్య, ఆరోగ్య రహస్యాలను వివరిస్తోందీ అందాల తార. ఈ క్రమంలోనే తాజాగా తన అందానికి కారణమైన సహజసిద్ధమైన ఫేస్‌మాస్కుల గురించి చెప్పుకొచ్చింది.

ఈ మాస్కులతో చర్మం తేమగా..!

 

‘చర్మానికి తేమ అందినప్పుడే అది తాజాగా మెరిసిపోతుంది. అందుకే నేను ఉపయోగించే ఫేస్‌మాస్కుల్లో చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా మార్చే పదార్థాలనే వాడుతుంటా. అది కూడా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలకే ప్రాధాన్యమిస్తా. ఈ క్రమంలో నేను వాడే న్యాచురల్‌ ఫేస్‌మాస్క్‌లేంటంటే..!

శెనగపిండితో స్క్రబ్‌

బహుశా ఇది చాలామంది అమ్మాయిలకు తెలిసే ఉంటుంది. అలాగే దీన్ని నిత్యం వాడే వారూ ఎక్కువే! శెనగపిండి, గంధం, గులాబీ నీళ్లు, పాలు, పసుపు, తేనె.. వీటన్నింటినీ కొద్ది మొత్తాల్లో తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. అది పూర్తిగా ఆరాక చేతివేళ్లతో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఈ ఫేస్‌మాస్క్‌/స్క్రబ్‌తో చర్మం బిగుతుగా మారుతుంది. పాలలోని ల్యాక్టికామ్లం, పసుపులోని యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక తేనె చర్మానికి తేమనందించి సహజసిద్ధమైన మెరుపునిస్తుంది.

ముల్తానీ మట్టితో మాస్క్‌..!

నిద్రలేమి వల్ల ముఖం అలసిపోతుంది.. ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అలాగే శరీరంలోని విషతుల్యాలు, వాతావరణ కాలుష్యం కూడా అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడి తిరిగి అందాన్ని పెంపొందించుకోవాలంటే అది ముల్తానీ మట్టి ఫేస్‌మాస్క్‌తోనే సాధ్యం. అందుకే నేను దీన్ని తరచూ నా బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకుంటా.

దీనికోసం రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున ముల్తానీ మట్టి, గులాబీ నీళ్లు తీసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మంలోని విషతుల్యాలన్నీ ఈ మాస్క్‌ తొలగిస్తుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది.

ఈ రెండూ!

* ఇక ఇంట్లో ఫేస్‌మాస్క్‌లు తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఐస్‌ముక్కతో ముఖాన్ని రుద్దుకోవడం లేదంటే బయట దొరికే న్యాచురల్‌ కూలింగ్‌ మాస్కులు ఉపయోగించడం.. వంటివి చేస్తా. అలసిపోయి ఉబ్బిన ముఖానికి ఈ చిట్కా సాంత్వననిస్తుంది.

* అలాగే విటమిన్లతో తయారుచేసిన ఫేస్‌మాస్కులు (Vitamins Infused Face Masks) సైతం అప్పుడప్పుడూ వాడుతుంటా. వీటివల్ల విటమిన్లన్నీ చర్మంలోకి ఇంకడంతో పాటు చర్మానికి తేమ అందుతుంది. తద్వారా చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది..’ అంటూ తన బ్యూటీ సీక్రెట్స్‌ని పంచుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ.

ఇక వీటితో పాటు నీటి శాతం అధికంగా ఉండే, పోషకాలు నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.


మరి, చర్మ ఆరోగ్యానికి మీరెలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? ఎలాంటి ఫేస్‌ప్యాక్‌/మాస్క్‌లు తయారు చేసుకొని వాడుతున్నారు? మాతో పంచుకోండి. ఇలా మీరిచ్చే సలహాలు/టిప్స్‌ ఇతరులకూ ఉపయోగపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్