Sonam Kapoor: డెలివరీ తర్వాత బరువు పెరిగా.. అయినా ఫీలవ్వట్లేదు!

గర్భం ధరించాక శారీరక మార్పులు, బిడ్డ పుట్టాక బరువు పెరగడం.. వంటివి ప్రతి మహిళలో సహజం. అయితే చాలామంది మహిళలు ఈ మార్పుల్ని అంగీకరించరు.. త్వరగా బరువు తగ్గి పూర్వపు స్థితిలోకి....

Updated : 21 Apr 2023 21:18 IST

(Photos: Instagram)

గర్భం ధరించాక శారీరక మార్పులు, బిడ్డ పుట్టాక బరువు పెరగడం.. వంటివి ప్రతి మహిళలో సహజం. అయితే చాలామంది మహిళలు ఈ మార్పుల్ని అంగీకరించరు.. త్వరగా బరువు తగ్గి పూర్వపు స్థితిలోకి రావాలని ఆరాటపడుతుంటారు. కానీ తనకు మాత్రం పెరిగిన బరువు తగ్గే విషయంలో తొందరేమీ లేదంటోంది బాలీవుడ్‌ లవ్లీ మామ్‌ సోనమ్‌ కపూర్‌. గతేడాది ఆగస్టులో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రసవానంతరం పెరిగిన బరువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడట్లేదంటోంది. ఈ క్రమంలో నోరు కట్టేసుకోకుండా.. చనుబాలు ఉత్పత్తయ్యేందుకు తోడ్పడే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఓ సందర్భంలో ముచ్చటించిన ఆమె.. ప్రసవానంతరం తనకెదురైన అనుభవాల్ని, పెరిగిన బరువు విషయంలో తాను పాటిస్తోన్న నియమాల్ని పంచుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

2018లో తన ఇష్టసఖుడు ఆనంద్‌ అహుజాను పెళ్లాడింది సొగసుల సోనమ్‌. ఇక గతేడాది ఆగస్టులో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ అందాల తార.. అమ్మతనంలోని అనుభవాల్ని, తన చిన్నారితో దిగిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోతోంది. అయితే అందరు మహిళల్లాగే ప్రసవానంతరం బరువు పెరిగిన సోనమ్‌.. తగ్గే విషయంలో ఏమాత్రం తొందరపడట్లేదంటూ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

ప్రతిదీ పాజిటివ్‌గానే..!

‘తల్లయ్యాక చాలామంది మహిళలు పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఆరాటపడతారు. ఈ క్రమంలో త్వరితగతిన తగ్గేయాలని క్రాష్‌ డైట్స్‌ పాటించే వారూ లేకపోలేదు. అయితే నేను మాత్రం ఇంత అత్యవసరంగా బరువు తగ్గాలనుకోవట్లేదు. ఈమధ్య కాలంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూసి ‘నిజంగా నేనింతలా మారిపోయానా?’ అని అస్సలు ఫీలవ్వట్లేదు. బరువు పెరిగి, వయసు మీద పడినట్లుగా కనిపిస్తున్నానని భయపడట్లేదు. నేను ఇంతకుముందులా లేనన్న బెంగ లేదు. తల్లినయ్యాక కొన్ని నెలల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టా. ఈ క్రమంలో ధరించబోయే కాస్ట్యూమ్స్‌కు సంబంధించిన కొలతలు ముందుగానే ఇచ్చి మరీ దుస్తులు కుట్టించుకుంటున్నా. అంతేకానీ.. గతంలో ధరించిన దుస్తులు పట్టట్లేదని బాధపడట్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. వాటిని అంగీకరించకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకునే మొండి ప్రవర్తన మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రతిదీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల అమ్మ.

బలవంతం చేయట్లేదు!

కొంతమంది మహిళలు తమ చిన్నారి చనుబాల కంటే.. బరువు తగ్గే విషయం పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఇలా శరీరాన్ని బలవంతం చేయడం వల్ల తల్లీబిడ్డలిద్దరి పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా జరగకుండా ముందుగానే జాగ్రత్తపడుతున్నానంటోంది సోనమ్.

‘వాయు పుట్టాక పెరిగిన బరువు తగ్గాలని నా శరీరాన్ని నేనెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ప్రస్తుతం నేను నా బిడ్డకు చనుబాలిచ్చే విషయం పైనే ఎక్కువ దృష్టి పెట్టా. కనీసం ఏడాది పాటు దీన్ని కొనసాగించాలనుకుంటున్నా. ఈ క్రమంలో శరీరానికి పోషకాహారం, కావాల్సినంత విశ్రాంతి, శక్తి అవసరం. అందుకే వీటిని కూడగట్టుకునే పనిలో ఉన్నా. అలాగని క్రాష్‌ డైట్‌ వంటి వివిధ రకాల బరువు తగ్గే ఆహార పద్ధతుల్ని పాటించట్లేదు. అయితే డెలివరీ అయ్యాక రెండు నెలలకు వ్యాయామం పునఃప్రారంభించా. ఇప్పుడే కాదు.. ఆరోగ్యం, చురుకుదనం కోసం గర్భం ధరించిన నవమాసాలూ నా వ్యాయామ రొటీన్‌ను కొనసాగించా. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నానో.. ఇప్పటికీ అవే జాగ్రత్తలు పాటిస్తున్నా. అంతేకానీ.. నా బరువు కొలుచుకుంటూ నోరు కట్టేసుకోవట్లేదు..’ అందీ బాలీవుడ్‌ మామ్‌. ఇలా ప్రసవానంతరం జరిగే శారీరక మార్పుల్ని స్వాగతించినప్పుడే ఇటు ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. అటు మానసికంగానూ సంతోషంగా ఉండచ్చంటూ ఈకాలపు తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది సోనమ్.

సుఖ ప్రసవాన్నే కోరుకున్నా!

కొంతమంది మహిళలు గర్భం ధరించాక సున్నితంగా మారిపోతారు. తమ కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకునే క్రమంలో అడుగు తీసి అడుగు వేయడానికి ఆలోచిస్తుంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మనం ఎంత చురుగ్గా ఉంటామో.. మనకు అంత తేలిగ్గా సుఖ ప్రసవమయ్యే అవకాశం ఉంటుందంటోంది సోనమ్.

‘కొంతమంది ప్రెగ్నెన్సీని అనారోగ్యంగా భావిస్తుంటారు. కాలు తీసి కాలు పెట్టలేనంత అతి సుకుమారంగా మారిపోతారు. అయితే ఈ సమయంలో మనం ఎంత చురుగ్గా ఉంటే ప్రసవం అంత సులభంగా అవుతుంది. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ! వాయు కడుపులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. పోషకాహారం తీసుకునేదాన్ని.. వ్యాయామాలు చేసేదాన్ని. సుఖ ప్రసవం ద్వారానే బిడ్డను ప్రసవించాలని ముందు నుంచే బలంగా కోరుకున్నా. ఇందులో భాగంగానే ‘జెంటిల్‌ బర్త్‌ మెథడ్‌’ సహాయం తీసుకున్నా. గర్భిణిగా ఉన్న సమయంలో సమస్యలు రాకుండా చేసి.. శరీరాన్ని, మనసును ప్రసవానికి సిద్ధం చేసే ప్రక్రియ ఇది. దీని ద్వారా తల్లిలో చనుబాలు త్వరగా ఉత్పత్తవడంతో పాటు పాలిచ్చే ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ సొగసరి.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్