అత్తగారి రెసిపీ.. కోడలి వ్యాపారం!
అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారు.. ఒకే ఇంట్లో ఉంటే నిత్యం గొడవలతోనే సరిపోతుందనుకుంటారు.. కానీ ఇందుకు భిన్నంగా అత్తగారి వారసత్వాన్ని, విలువల్ని చాటుతూ వారిపై తమకున్న ప్రేమాభిమానాల్ని....
(Photos: Instagram)
అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారు.. ఒకే ఇంట్లో ఉంటే నిత్యం గొడవలతోనే సరిపోతుందనుకుంటారు.. కానీ ఇందుకు భిన్నంగా అత్తగారి వారసత్వాన్ని, విలువల్ని చాటుతూ వారిపై తమకున్న ప్రేమాభిమానాల్ని చాటుకుంటారు కొందరు కోడళ్లు. చెన్నైకి చెందిన సోనమ్ సురానా ఇలాంటి కోడలే! మెట్టినింట్లో అడుగుపెట్టిన కొన్నేళ్లకే అత్తగారు మరణించడంతో కుంగిపోయిన ఆమె.. తన జ్ఞాపకార్థం నలుగురికీ ఉపయోగపడే పనేదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే తన అత్తగారి పాకశాస్త్ర నైపుణ్యాల్ని తన ఆలోచనతో ముడిపెట్టి ఓ వ్యాపారం ప్రారంభించింది సోనమ్.. ప్రస్తుతం నెల తిరిగే సరికి లక్షలు సంపాదిస్తోంది. వ్యాపారంలో రాణించడం అటుంచితే.. తన అత్తగారు భౌతికంగా దూరమైనా.. ఆమె నైపుణ్యాల్ని నలుగురికీ పంచడమే ఎక్కువ సంతృప్తినిస్తుందంటోందామె. మరి, అత్తగారి రెసిపీతో ప్రారంభమైన ఈ కోడలి వ్యాపార ప్రయాణం ఎలా సాగుతోందో తెలుసుకుందాం రండి..
చెన్నైకి చెందిన సోనమ్ బీబీఏ పూర్తి చేసింది. ఆపై అదే నగరానికి చెందిన అజయ్‌ని పెళ్లి చేసుకుంది. సోనమ్ అత్తగారు ప్రేమ్‌లతా దేవి ఆమెను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది. స్వయంగా పాకశాస్త్రంలో నిపుణురాలైన ప్రేమ్‌లత.. తన నైపుణ్యాలతో రోజూ ఇంటిల్లిపాదికీ రుచికరమైన వంటకాలు వండి వార్చేది. అయితే 2017లో ఓ రోజు ప్రేమ్‌లత ఉన్నట్లుండి హఠాన్మరణం చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇక తననెంతో ప్రేమగా చూసుకునే అత్తగారు సడన్‌గా దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయింది సోనమ్.. కుంగుబాటుకు లోనైంది.
డైరీ ఇచ్చిన ఆలోచన!
అయితే నెలలు గడిచే కొద్దీ నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతూ వచ్చిన సోనమ్.. సరిగ్గా ఏడాది తర్వాత తన అత్తగారి గదిని శుభ్రం చేద్దామని వెళ్లింది. అక్కడే సోనమ్‌కి ప్రేమ్‌లత డైరీ దొరికింది. అందులో ఆమె చేసిన వంటకాలకు సంబంధించిన రెసిపీలన్నీ వివరంగా రాసున్నాయి. అది చూసి మరోసారి తన అత్తగారి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చుకుందామె. అయితే ఇలా బాధపడుతూ కూర్చోవడం కంటే.. ఆమె జ్ఞాపకార్థం నలుగురికీ ఉపయోగపడేలా ఏదైనా మంచి పని చేయాలనుకుంది. ఇదే విషయంపై తన భర్తతో కలిసి చర్చిస్తుండగా.. ఫుడ్ బిజినెస్ ఆలోచన వచ్చిందంటోంది సోనమ్.
‘అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారు. తను భౌతికంగా దూరమైనా.. మా ఆలోచనల్లో నిత్యం మాతోనే ఉన్నారనిపిస్తుంటుంది. ఇలా ఆమె అందించిన ప్రోత్సాహమే నన్ను వ్యాపారవేత్తను చేసింది. నిజానికి నాకు వంట చేయడమంటే అంత ఆసక్తి ఉండేది కాదు.. కానీ పెళ్లైన కొత్తలో అత్తయ్యకు సహకరిస్తూ ఆమె స్టైల్లో కొన్ని వంటకాలు నేర్చుకున్నా. ఆమె దూరమయ్యాక అవి ఇలా ఉపయోగపడ్డాయి..’ అంటూ చెప్పుకొచ్చింది సోనమ్.
పొడులు, మసాలాలు..!
ఇలా అత్తగారి స్ఫూర్తితో, భర్త ప్రోత్సాహంతో.. 2019లో ‘ప్రేమ్ ఈటసీ’ పేరుతో ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది సోనమ్. అయితే అంతకంటే ముందు కొన్ని రెసిపీలు ప్రయత్నించి.. కుటుంబ సభ్యులు, బంధువుల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాకే.. పెద్ద ఎత్తున పదార్థాల తయారీ మొదలుపెట్టానంటోందీ కోడలు పిల్ల.
‘అత్తగారి వంటకాల్లో భాగంగా.. ఒక రెసిపీని ముందుగా ఇంట్లో ప్రయత్నించా. అది మా పిల్లలు, కుటుంబ సభ్యులకు బాగా నచ్చింది. ఆపై మరిన్ని రెసిపీలు తయారుచేసి మా బంధువులకు పంపించా. అది నచ్చి వాళ్లు మళ్లీ మళ్లీ కావాలనేవారు. ఇలా ఏడాది పాటు ప్రయత్నించాక.. ఈ రెసిపీలకు క్రమంగా డిమాండ్ పెరగడం గమనించిన మేము.. 2019లో వ్యాపారానికి తెర తీశాం. ఈ నాలుగేళ్ల వ్యవధిలో కొన్ని కొన్ని రెసిపీల చొప్పున తయారుచేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. పలు ఎగ్జిబిషన్లు, స్టాల్స్‌లో మా రెసిపీల్ని ఉంచుతూ.. మరింత మందికి చేరువయ్యాం. ప్రస్తుతం మా వద్ద వివిధ రకాల పొడులు, 21 రకాల పచ్చళ్లు, మసాలాలు, షర్బత్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువమంది ఇష్టపడేది పచ్చళ్లు, పొడులే! ఏ పదార్థమైనా గాజు సీసాల్లోనే ప్యాక్ చేసి విక్రయిస్తున్నాం..’ అంటూ తన వ్యాపారం గురించి పంచుకుంది సోనమ్.
క్రెడిటంతా అత్తగారిదే!
ప్రస్తుతం తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలతో పాటు.. పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తోన్న సోనమ్.. తాము తయారుచేసే ప్రతి ఉత్పత్తి విషయంలో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
‘మా ఉత్పత్తులన్నీ సహజసిద్ధమైన పద్ధతుల్లోనే తయారుచేస్తున్నాం. ఈ క్రమంలో ప్రిజర్వేటివ్స్, ఇతర రసాయనాలేవీ ఉపయోగించట్లేదు. ఇక వీటిని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయచ్చో కూడా మా అత్తగారు తన డైరీలో రాసుకున్నారు. ప్రస్తుతం ఆ చిట్కాల్నే మా ఉత్పత్తుల తయారీలో వాడుతున్నాం. ఒకప్పుడు వంటే రాదనే నేను ఇప్పుడు ఓ ఫుడ్ బిజినెస్ నడుపుతున్నానంటే.. చాలామంది నన్ను ప్రశంసిస్తున్నారు. కానీ ఆ క్రెడిటంతా మా అత్తయ్యకే దక్కుతుంది. తన వారసత్వాన్ని, విలువల్ని ఇలా నాకు అప్పగించి వెళ్లిన తనకు నేనెప్పటికీ రుణపడి ఉంటా. తను మాకు భౌతికంగానూ దూరమైనా.. తన రెసిపీలు, మా బిజినెస్ రూపంలో తనెప్పుడూ మా పక్కనే ఉంటుంది. అందుకే వ్యాపారంలో రాణిస్తున్నానన్న సంతోషం కంటే.. అత్తగారు ఇలా మాకు తోడున్నారన్న ఆనందమే నన్ను మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తోంది..’ అంటోంది సోనమ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.