‘మాట్లాడే యాప్‌’ను రూపొందించింది!

తలైవా కూతురిగానే కాదు.. తనదైన ప్రతిభతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య రజనీకాంత్‌. పలు సినిమాలకు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేసి తనను తాను నిరూపించుకున్న ఈ స్టార్‌ డాటర్‌.. ప్రస్తుతం తనలోని మరో ట్యాలెంట్‌ని బయటకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలి వాయిస్‌ ఆధారిత సోషల్‌ మీడియా యాప్‌ను అభివృద్ధి చేసి మరోసారి అందరికీ చేరువైంది.

Updated : 25 Oct 2021 19:45 IST

(Photo: Instagram)

తలైవా కూతురిగానే కాదు.. తనదైన ప్రతిభతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య రజనీకాంత్‌. పలు సినిమాలకు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేసి తనను తాను నిరూపించుకున్న ఈ స్టార్‌ డాటర్‌.. ప్రస్తుతం తనలోని మరో ట్యాలెంట్‌ని బయటకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలి వాయిస్‌ ఆధారిత సోషల్‌ మీడియా యాప్‌ను అభివృద్ధి చేసి మరోసారి అందరికీ చేరువైంది. తన తండ్రి రజనీకాంత్‌ చేతుల మీదుగా నేడు ఈ యాప్‌ను ప్రారంభించింది సౌందర్య. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త యాప్‌ ప్రత్యేకతలు, ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

చిన్నతనం నుంచీ సౌందర్యకు గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే సినీ పరిశ్రమలో గ్రాఫిక్‌ డిజైనర్‌గా రాణిస్తోంది. ‘బాబా’, ‘చంద్రముఖి’, ‘శివాజి’, ‘కొచ్చడయాన్‌’.. వంటి సినిమాలకు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేసిన సౌందర్య.. మరోవైపు దర్శకురాలిగా, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిసింది. అయితే ఈసారి తనలోని సాంకేతిక పరిజ్ఞానానికి పదును పెడుతూ ‘Hoote’ అనే వాయిస్‌ ఆధారిత సోషల్‌మీడియా యాప్‌ను అభివృద్ధి చేసిందీ ముద్దుగుమ్మ.

ఈ యాప్‌ మాట్లాడుతుంది!

దేశంలోనే తొలి వాయిస్‌ ఆధారిత సోషల్‌ మీడియా యాప్‌గా గుర్తింపు పొందిన దీనిలో బోలెడన్ని ఫీచర్లున్నాయట!

* మనం ఎలాగైతే మన ఆలోచనలు, మనసులోని భావాలను సందేశాల రూపంలో పంచుకుంటామో.. అవే ఆలోచనలు, భావాలను ఈ యాప్‌ ద్వారా ఏ భాషలోనైనా మాటల రూపంలో/ఆడియో రూపంలో అవతలి వారికి చేరవేయచ్చు.

* ఈ క్రమంలో గరిష్టంగా 60 సెకన్ల ఆడియో సందేశాన్ని రికార్డ్‌ చేయచ్చట! దీన్ని ముందే రికార్డ్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది.

* ఈ వాయిస్‌ ఆధారిత సందేశాలకు సంగీతం, బొమ్మలు/ఫొటోల్ని సైతం జత చేయచ్చు.

* ఈ సందేశాలను షేర్‌ చేయాలన్నా, వీటికి రిప్లై ఇవ్వాలన్నా, కామెంట్‌ చేయాలన్నా.. ఇలా అన్నీ వాయిస్‌ రూపంలోనే పెట్టే అదనపు ఫీచర్‌ ఈ యాప్‌ సొంతం.

* ప్రైవేట్‌, పబ్లిక్‌.. వంటి ఆప్షన్లూ ఇందులో ఉన్నాయి.

ఇలా తన కూతురు సహ వ్యవస్థాపకురాలిగా రూపొందించిన ఈ యాప్‌ను రజనీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ‘తన ప్రతిభ, ప్రయత్నమే నేడు ఎంతోమందికి ఉపయోగపడే యాప్‌ను రూపొందించేలా చేశాయి. పైగా ఇది దేశంలోనే తొలి వాయిస్‌ ఆధారిత యాప్‌ కావడం మరింత సంతోషంగా ఉంది..’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోయారు రజనీ. ఇక ఇదే రోజు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారా’న్నీ అందుకున్నారు తలైవా.

అమ్మ ప్రోత్సాహంతో..!

* రజనీకాంత్‌-లతల చిన్న కూతురైన సౌందర్య ఆలోచనలన్నీ చిన్నతనం నుంచి దృశ్య రూపంలోనే (Visual Thinker) ఉండేవట! ఈ ఆసక్తిని గమనించిన ఆమె తల్లి లత.. ఆమెను తన ఆలోచనలకు తగినట్లుగా చిన్న చిన్న బొమ్మలు, డూడుల్స్‌ రూపొందించమని ప్రోత్సహించేవారట! బహుశా ఇదే తనను గ్రాఫిక్‌ డిజైనర్‌గా మార్చాయేమో అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు సౌందర్య.

* ‘నాకు అమ్మతో అనుబంధం ఎక్కువ. తను ఎప్పుడూ పాజిటివ్‌ దృక్పథంతోనే ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించే విషయంలో ఆమే నాకు స్ఫూర్తి. తను ఓవైపు స్కూల్‌ నడుపుతూనే.. మరోవైపు ఇంటినీ సమానంగా ప్రేమిస్తుంది..’ అంటూ తన తల్లితో తనకున్న అనుబంధాన్ని మరో సందర్భంలో గుర్తు చేసుకుంది సౌందర్య. పిల్లల అభివృద్ధి, సంక్షేమం కోసం 2018లో ‘శ్రీ ధన్య ఫౌండేషన్‌’ పేరుతో ఓ ఎన్జీవోను ప్రారంభించారు లత.

* తన తండ్రి నటించిన ‘కొచ్చడయాన్‌’ చిత్రంతో దర్శకురాలిగా తెరకు పరిచయమైన సౌందర్యకు.. అంతకుముందే ‘సుల్తాన్‌ : ది వారియర్‌’ అనే 3డి యానిమేషన్‌ సినిమాకు దర్శకురాలిగా పనిచేసే అవకాశం వచ్చిందట! అయితే ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆమె ‘కొచ్చడయాన్’ పైనే దృష్టి పెట్టారట!

* జంతు ప్రేమికురాలైన సౌందర్య.. ప్రస్తుతం ‘యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ అంబాసిడర్‌గా కొనసాగుతోంది.

* 2019లో నటుడు, వ్యాపారవేత్త అయిన విషగణ్‌ వనంగమూడిని రెండో వివాహం చేసుకుంది సౌందర్య. అప్పటికే వేద్‌ కృష్ణ అనే కొడుక్కి తల్లైన ఆమె.. ప్రస్తుతం రెండోసారి తల్లి కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సోనమ్‌ కపూర్‌, అలియా భట్‌, సన్నీ లియోని, దిశా పటానీ, అమీ జాక్సన్‌.. వంటి ముద్దుగుమ్మలు గతంలో తమ సొంత యాప్‌లను ప్రారంభించారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారాన్ని ఈ వేదికగా తమ అభిమానులతో పంచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా వాళ్లతో నేరుగా ముచ్చటిస్తున్నారు కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్