పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!

నాకు పాప పుట్టి ఏడాదవుతోంది. తను హైపర్ యాక్టివ్. ఎప్పుడూ నాతో ఆడుతూనే ఉంటుంది. ఒక 40 నిమిషాలు నిద్రపోతే 4 గంటల పాటు నాతో ఆడుకునేందుకే మొగ్గు చూపుతుంది. రాత్రిళ్లు కూడా చాలా తక్కువసేపు....

Updated : 16 Mar 2024 18:05 IST

నాకు పాప పుట్టి ఏడాదవుతోంది. తను హైపర్ యాక్టివ్. ఎప్పుడూ నాతో ఆడుతూనే ఉంటుంది. ఒక 40 నిమిషాలు నిద్రపోతే 4 గంటల పాటు నాతో ఆడుకునేందుకే మొగ్గు చూపుతుంది. రాత్రి పూట కూడా చాలా తక్కువసేపు మాత్రమే పడుకుంటుంది. పడుకున్న సమయంలో ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే నిద్ర లేస్తుంది. మళ్లీ నిద్రపోకుండా ఆడుతూనే ఉంటుంది. పాప వల్ల నాతో లైంగికంగా సంతోషం ఉండట్లేదని నా భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పాప నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో మా దాంపత్య జీవితాన్ని ఎలా బ్యాలన్స్ చేయాలో తెలియడం లేదు. తగిన సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: పాప ఆరోగ్యంగా, ఆనందంగా ఆడుకుంటూ ఉండడం అనేది ఆరోగ్యకరమైన లక్షణమే. అయితే తను సరిగ్గా నిద్రపోకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంత చిన్న వయసులో అంత తక్కువ నిద్ర ఎలా సరిపోతోంది? ఇందుకు గల కారణాలేంటి? తన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కువగా వెలుతురు ఉండడం, తరచూ శబ్దాలు రావడం, కడుపు నొప్పి, ఉబ్బరంగా అనిపించడం.. పాప నిద్రపోయేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం.. ఇలాంటి కారణాలేమైనా ఉన్నాయేమో ఓసారి పరిశీలించండి. అలాగే కారణాలు ఏవైనా.. పాపకు తగిన నిద్ర ఉండట్లేదు కాబట్టి ముందుగా చిన్న పిల్లల వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మీరు చెప్పిన దాని ప్రకారం మీ చిన్నారి ఎక్కువగా మీతో ఆడుకునేందుకే మొగ్గుచూపుతోందంటున్నారు. పాప అలా నిరంతరం మీ శ్రద్ధ కోరుకోవడానికి మీ ప్రవర్తనపరంగా కూడా కారణాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి విశ్లేషించుకోండి. అంటే పాప ఏడవగానే ఎత్తుకోవడం, మీ ప్రేమ కొద్దీ అతిగా ముద్దు చేస్తుండడం, తనంతట తాను ఆడుకుంటున్నా సరే.. పాపను విడవకుండా మీరు ఎప్పుడూ పక్కనే ఉండడం.. ఇలాంటివన్నీ తనని ప్రభావితం చేస్తున్నాయేమో ఆలోచించండి. అలాగే మీ పాప బాధ్యతలను భర్తతో కలిసి పంచుకోవడం, సాయంత్రం వేళల్లో వీలైనంత త్వరగా పాప కడుపు నింపి నిద్రపుచ్చడం, మిగతా సమయాల్లో నిద్ర వేళలు కాస్త తగ్గించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం నిద్రపోయేలా చూడడం.. ఇలాంటి ప్రయత్నాలు చేసి చూడండి. చిన్న పిల్లల వైద్యనిపుణులను సంప్రదిస్తే ఇలాంటి చిట్కాలు చాలా సూచిస్తారు. వాటిని అనుసరించడం ద్వారా మీ పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చు.

ఇక మీ ఆలుమగల విషయానికొస్తే ఇద్దరి మధ్యా చక్కని అవగాహన ఉండేందుకు ఇద్దరూ కలిసి పాప బాధ్యతలు పంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ఇద్దరూ కలిసి పాపతో సమయం గడపడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడమే కాకుండా పాప నిద్రపోయిన తర్వాత ఒకరికొకరు సమయం కేటాయించుకునే వీలు ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ అవకాశం ఉన్నంతలో పాప బాధ్యత పంచుకుంటూ, చక్కటి అవగాహనతో మీ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పాప దృష్టి కేవలం మీపైనే కాకుండా మీ భర్తపై కూడా ఉంటుంది. ఫలితంగా మీకు లభించే ఆ కాస్త విరామ సమయంలో పనులు చేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం.. వంటివి చేయచ్చు. నిపుణుల సహాయంతో పాప ఆహారం, ఆరోగ్యం, నిద్ర.. వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీ సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్