Published : 16/05/2022 20:43 IST

Period Leave: ఎక్కడ.. ఎన్ని రోజులు?!

సాధారణంగా ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. అలాంటిది ఇటు శారీరకంగా, అటు మానసికంగా ఇబ్బంది పెట్టే నెలసరి సమయంలో అంతకుమించిన అసౌకర్యం కలుగుతుంటుంది. అయినా కార్యాలయాలకు వెళ్లక తప్పదు. పోనీ, మానేద్దామంటే అందరికీ కుదరకపోవచ్చు. తమ దేశంలో ఎంతోమంది మహిళలు సతమతమవుతోన్న ఈ పరిస్థితినే అర్థం చేసుకుంది స్పెయిన్‌ దేశం. ఈ క్రమంలోనే మూడు రోజుల నెలసరి సెలవును అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూపొందుతోన్న ఈ బిల్లు కేబినెట్‌లో పాసవ్వడమే ఆలస్యం.. ఉద్యోగినులు నెలకు మూడు రోజుల పాటు పిరియడ్‌ లీవ్‌ను వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే.. నెలసరి సెలవును ఆమోదించిన తొలి పశ్చిమ దేశంగా స్పెయిన్‌ ఆవిర్భవిస్తుంది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మూడు నుంచి ఐదు రోజులు!

నెలసరి సెలవు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న చర్చ ఇది. అయితే ఇందుకు ప్రతిగా ఇప్పటికే కొన్ని దేశాలు, మరికొన్ని కంపెనీలు ఓ అడుగు ముందుకేసి ఈ సెలవును అందిస్తున్నాయి. ఇదే క్రమంలో స్పెయిన్‌ కూడా తమ ఉద్యోగినులకు ఈ సెలవును అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్లును రూపొందిస్తున్నట్లు, త్వరలోనే ఇది కేబినెట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదం పొందాక కార్యరూపం దాల్చనున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో భాగంగా.. ఉద్యోగిని నెలసరి సమయంలో నెలకు మూడు రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చు. అప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా లేదంటే సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నా ఈ సెలవును మరో రెండు రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుందట. అయితే ఇది వేతనంతో కూడిన సెలవా? లేదంటే జీతం ఇవ్వకుండా సెలవు మాత్రమే ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఈ పిరియడ్‌ లీవ్‌ బిల్లు ఆమోదం పొందితే.. నెలసరి సెలవును ఆమోదించిన తొలి పశ్చిమ దేశంగా స్పెయిన్‌ ఆవిర్భవిస్తుంది.

ఎక్కడెక్కడ ఎలా?

స్పెయిన్‌ కంటే ముందు కొన్ని దేశాలు ఇప్పటికే నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అవేంటంటే..!

* దక్షిణ కొరియాలో చట్ట ప్రకారం ఒక్క రోజు పిరియడ్‌ లీవ్‌ తీసుకోవచ్చు. అయితే ఒకవేళ ఈ సెలవును వినియోగించుకోకపోతే.. ఆ రోజు వేతనంతో పాటు అదనపు జీతం చెల్లిస్తారు.

* ఇండోనేషియాలో అదనపు సెలవులు మినహాయించి.. నెలకు రెండు రోజుల నెలసరి సెలవును అమలు చేస్తున్నారు.

* తైవాన్‌ తన మహిళా ఉద్యోగులకు ఏడాదికి మూడు రోజుల నెలసరి సెలవులిస్తోంది. సిక్‌ లీవ్స్‌తో వీటికి సంబంధం లేదు.

* ‘మహిళలు నెలసరి సమయంలో సెలవు కోరినప్పుడు కంపెనీలు ఆ మహిళలకు తప్పకుండా సెలవు మంజూరు చేయాల్సిందే!’ జపాన్‌ కార్మిక ప్రమాణాల చట్టం చెబుతోన్న విషయమిది.

* జాంబియాలో ఉద్యోగినులకు ఒక్క రోజు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారు.

ఒక్క బిహార్‌లో తప్ప!

మనదేశంలో పిరియడ్‌ లీవ్‌ ఇంకా చర్చల దశలోనే ఉంది. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌లో పాసిఘాట్‌ (పశ్చిమ) ఎమ్మెల్యే దీనికి సంబంధించిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టారు. అయితే ఇతర సభ్యులు దీన్ని ‘అపరిశుభ్రమైన’ అంశంగా కొట్టిపడేయడం శోచనీయం. ఇదిలా ఉంటే బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవును అందిస్తూ దేశం మొత్తానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడి మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం.. అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులు శారీరక కారణాల దృష్ట్యా ప్రతినెలా రెండు రోజులు ప్రత్యేక సెలవులు తీసుకునే అవకాశం అందిస్తున్నారు. ఇతర సెలవులకు అదనంగా వీటిని అందించడం విశేషం.. ఇలా ప్రభుత్వ ఉద్యోగినులకు ‘బయోలాజికల్‌ రీజన్స్‌’ పేరిట నెలకు రెండు రోజులు సెలవులు అందిస్తోన్న ఏకైక రాష్ట్రం కూడా బిహారే!

ఈ సంస్థలు కూడా!

నెలసరి సమయంలో మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మన దేశంలో కొన్ని సంస్థలు తమ ఉద్యోగినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవును అందిస్తున్నాయి.

* చెన్నైకి చెందిన డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సంస్థ ‘గుజూప్‌’ 2017, మార్చిలోనే ‘పిరియడ్‌ లీవ్‌ పాలసీ’ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగినులు నెలసరి తొలి రోజున వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు.. అలాగే వారి ఆరోగ్య స్థితిని బట్టి ఇంటి నుంచి కూడా పని చేయచ్చు. ఫలితంగా మహిళలు తమకు సౌకర్యవంతంగా ఉండే వాతావరణంలో పనిచేయడం వల్ల నాణ్యమైన అవుట్‌పుట్‌ను కూడా అందించగలుగుతారనేది ఈ పాలసీ ముఖ్యోద్దేశం.

* ముంబయికి చెందిన ‘కల్చర్‌ మెషీన్‌’ అనే డిజిటల్‌ మీడియా స్టార్టప్‌ కూడా 2017, జులైలోనే నెలసరి సెలవు నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆ సంస్థలో పనిచేస్తోన్న మహిళా ఉద్యోగులు తమ నెలసరి మొదటిరోజున వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు.

* 2019లో కొత్త సంవత్సరం సందర్భంగా కోల్‌కతాకు చెందిన డిజిటల్‌ మీడియా కంపెనీ ‘FlyMyBiz’ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగినులకు పిరియడ్‌ లీవ్‌ పాలసీని బహుమతిగా అందించింది. అప్పట్నుంచి ఇతర సెలవులకు అదనంగా నెలకొకటి చొప్పున 12 పిరియడ్‌ లీవ్స్‌ను తమ ఉద్యోగినులకు అందిస్తోందీ సంస్థ.

* పిరియడ్‌ లీవ్స్‌ పేరిట తమ ఉద్యోగినులకు ఏడాదికి 12 సెలవులిస్తోంది బైజూస్. అయితే నెలకొకటి చొప్పున అందించే ఈ సెలవును ఒక రోజు పూర్తిగా వినియోగించుకోవచ్చు.. లేదంటే హాఫ్‌ డే చొప్పున రెండు రోజులు కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

* ఇక ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ నెలకు రెండు రోజుల పిరియడ్‌ లీవ్‌ సదుపాయాన్ని క్రితం సంవత్సరమే తీసుకొచ్చింది. అలాగే 2020నుంచి జొమాటో కూడా ఈ తరహా సెలవును అందిస్తోంది. ఈ క్రమంలో ఏడాదికి 10 సెలవులిస్తోంది. అలాగే ఈ కంపెనీలు మహిళల కోసం.. డెలివరీ తీసుకోవడానికి వెళ్లే రెస్టరంట్ల దగ్గర శుభ్రమైన వాష్‌రూమ్‌లు ఉండేట్లు తగిన ఏర్పాట్లు కూడా చేయడం విశేషం.

* కేవలం సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగినులే కాదు.. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న త్రిపునితుర ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకునే విద్యార్థినులకు కూడా పిరియడ్‌ లీవ్‌ను అందిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుకొనే విద్యార్థినులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయినులకు కూడా నెలసరి సమయంలో సెలవు తీసుకునే వెసులుబాటును ఎప్పటినుంచో కల్పిస్తోందీ పాఠశాల.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని