Updated : 09/12/2021 14:32 IST

Sojat : కత్రినా మనసు దోచిన ఈ మెహెందీ గురించి తెలుసా?

గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంటారు.. అందుకే సాధారణ సమయాల్లోనే కాదు.. తమ పెళ్లిలోనూ విభిన్న మెహెందీ డిజైన్లతో తమ చేతుల్ని పండించుకుంటుంటారు అమ్మాయిలు. మరి, మనమైతే గోరింటాకు ఎర్రగా పండాలని బయట దొరికే బ్రాండెడ్‌ కోన్స్‌ని ఎంచుకుంటాం. ఇదేవిధంగా సెలబ్రిటీలు మెచ్చిన మెహెందీ బ్రాండ్‌ ఒకటుందన్న విషయం చాలామందికి తెలియదు. అలాగని అదేదో ఆర్టిఫిషియల్‌ అనుకుంటే పొరపడినట్లే! పూర్తి ప్రకృతి సిద్ధంగా తయారయ్యే ఈ గోరింటాకును ఇప్పుడు కత్రినా కూడా తన పెళ్లికి ఎంచుకుందట! దాంతో ఈ మెహెందీ టాపిక్‌ నెట్టింట్లో వైరలవుతోంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కత్రినా కైఫ్‌-వికీ కౌశల్‌ పెళ్లి విషయమే హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంతో గోప్యంగా మనువాడబోతోన్న ఈ జంట వివాహానికి సంబంధించిన ఏ వార్త బయటికొచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. అలా తాజాగా వీరి మెహెందీ వేడుకల గురించిన ఓ విషయం గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.

మొన్న పీసీ.. నేడు క్యాట్‌!

రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారా రిసార్ట్‌ వేదికగా మనువాడబోతున్నారు విక్కీ-కత్రినా. అయితే పెళ్లికి ముందు జరిగే మెహెందీ వేడుకల కోసం అక్కడి సోజత్ అనే ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మెహెందీ ఆర్డర్‌ చేయించుకుందట ఈ జంట. దీంతో అక్కడి ఓ మెహెందీ తయారీ సంస్థ.. 20 కిలోల మెహెందీ పౌడర్‌, 400 దాకా మెహెందీ కోన్స్‌ని ఈ జంటకు కానుక కింద అందించిందట. నిజానికి సోజత్ ప్రాంతానికి చెందిన ఈ గోరింటాకును ‘సోజత్ మెహెందీ’గా పిలుస్తారు. సహజసిద్ధంగా సాగు చేసే ఈ గోరింటాకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఈ ప్రత్యేకమైన మెహెందీకి ఫిదా అవుతుంటారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్‌, ప్రియాంక చోప్రా.. తమ పెళ్లి కోసం సోజత్ మెహెందీని ఎంచుకోగా.. ఇప్పుడు క్యాట్‌ కూడా వాళ్ల దారిలోనే నడిచింది.

అందుకే అంత పాపులర్‌!

రాజస్థాన్‌ పలి జిల్లాలోని సోజత్ ప్రాంతం మెహెందీకి పెట్టింది పేరు. అందుకే ఈ మెహెందీని ‘సోజత్ మెహెందీ’గా, ఈ ప్రాంతాన్ని ‘హెన్నా సిటీ’గా పిలుస్తుంటారు. అలాగని ఈ గోరింటాకును ప్రత్యేకమైన పద్ధతుల్లో సాగు చేస్తారని అనుకుంటే పొరపడినట్లే! ఎందుకంటే కేవలం వర్షపు నీటితోనే ఈ మెహెందీ మొక్కల్ని/చెట్లను పెంచుతారట! అంతేకాదు.. వేసవి, శీతాకాలం కోసం ఈ నీటిని నిల్వ చేసుకొని మరీ దీన్ని సాగు చేస్తారట! అలాగే ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు కూడా గోరింటాకు పంటకు అనువుగా ఉంటాయంటున్నారు అక్కడి స్థానికులు. ఇలా అక్కడి ప్రజల జీవనాధారం కూడా గోరింటాకు సాగేనట! ఇలా సహజసిద్ధంగా తయారయ్యే ఈ మెహెందీ చేతుల్ని మరింత ఎర్రగా పండిస్తుందని, ఎక్కువ కాలం రంగు వెలిసిపోకుండా ఉంటుందని చెబుతున్నారు అక్కడి వారు. ఈ గోరింటాకుకు ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం ‘సోజత్ మెహెందీ’కి జీఐ ట్యాగ్‌ ఇచ్చింది.

ఆకుల నుంచి పొడి దాకా..!

ముందుగా వర్షపు నీటితో సాగు చేసిన గోరింటాకుని స్థానికంగా ఉండే హెన్నా మిల్లులకు పంపిస్తారు. అక్కడ వాటిని ఎండబెట్టి పొడి చేస్తారు. ఈ పౌడర్‌ని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి కోన్స్‌లో నింపుతారు. అలాగే ఈ ఆకుల నుంచి గోరింటాకు నూనెను సైతం తయారుచేస్తారు. ఇక మిగిలిన మొక్క, బెరడు, గింజల్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మెహెందీ ప్రస్తుతం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంది. సరసమైన ధరల్లోనూ లభిస్తోంది. అందుకే సెలబ్రిటీలతో పాటు సామాన్యులూ తమ పెళ్లిలో ఈ మెహెందీతో చేతుల్ని పండించుకుంటున్నారు.

 


CRPCBdLp4Le

Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని