పేద బాలుడి వ్యథ.. ‘పులిట్జర్’ తెచ్చిపెట్టింది!
పులిట్జర్ అవార్డు.. అమెరికా సాహిత్య, పాత్రికేయ, సంగీత, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికిచ్చే అత్యున్నత పురస్కారం ఇది. ఈ ఏడాది సాహిత్య విభాగంలో ఈ అవార్డు దక్కించుకున్నారు అమెరికన్ రచయిత్రి....
(Photos: Instagram)
పులిట్జర్ అవార్డు.. అమెరికా సాహిత్య, పాత్రికేయ, సంగీత, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికిచ్చే అత్యున్నత పురస్కారం ఇది. ఈ ఏడాది సాహిత్య విభాగంలో ఈ అవార్డు దక్కించుకున్నారు అమెరికన్ రచయిత్రి బార్బరా కింగ్‌సాల్వర్. ఆమె రాసిన Demon Copperhead అనే కాల్పనిక కథకు గాను ఈ పురస్కారం ఆమెను వరించింది. సామాజిక న్యాయం, జీవవైవిధ్యం.. వంటి అంశాల్ని స్పృశిస్తూ ఆమె చేసిన రచనలు.. ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలుగా పేరు తెచ్చుకున్నాయి. మరోవైపు మహిళల పోరాటాలకు సంబంధించి ఆమె రాసిన కవితలు.. సమాజాభివృద్ధిలో వారి పాత్రకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. ‘నా ప్రతిభతో పేరుప్రఖ్యాతులు రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు.. కానీ నా రచనలతో ఈ సమాజంలోని సమస్యల్ని అందరి దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నా’నంటూ తనలోని నిరాడంబరతను చాటుకుంటోన్న ఈ ప్రముఖ రచయిత్రి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!
పేద బాలుడి దీన గాథ!
ఏటా అందించే పులిట్జర్ అవార్డుల్లో భాగంగా.. ఈసారి సాహిత్య రంగంలో ఇద్దరికి పురస్కారాలు దక్కాయి. బార్బరా రాసిన Demon Copperhead అనే కాల్పనిక కథతో పాటు మరో రచయిత హెర్నన్ డియాజ్ కూడా తన కాల్పనిక కథకు ఈ అవార్డు గెలుచుకున్నారు. దీంతో ఈ అవార్డుల్లో 105 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విభాగంలో రెండు ఫిక్షన్ పుస్తకాలకు ఒకేసారి పులిట్జర్ దక్కడం ఇదే తొలిసారి. ఇక Demon Copperhead కథలో భాగంగా.. పర్వతాలపై పుట్టిపెరిగిన ఓ పేద బాలుడి జీవితంపై అల్లుకున్న కథ ఇది. రాగి రంగు జుట్టుతో పుట్టిన ఆ బాలుడు తన బాల్యంలోనే తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమవుతాడు. దీంతో తల్లే ఒంటరిగా అతడిని పెంచి పెద్ద చేస్తుంది. ఆపై యుక్తవయసులోకి రాగానే తాను తనలోని ప్రతిభతో ఎదిగేందుకు ప్రయత్నిస్తాడు. తన పేదరికం కారణంగా చదువుకు నోచుకోలేక, బాల కార్మికుడిగా మారి.. ఆపై అథ్లెట్‌గా రాణిస్తూ.. ఇలా ఈ కథలో బాలుడు పడిన కష్టాలన్నీ సరళంగా వివరించే ప్రయత్నం చేశారు బార్బరా. గ్రామీణ నేపథ్యం, పేదరికం ఉన్న కుటుంబాల్లోనూ ఎందరో సూపర్‌హీరోలుంటారనే అంశాన్ని తన కథ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు బార్బరా. ఇంగ్లిష్ రచయిత చార్లెస్ డికెన్స్ నవల ‘డేవిడ్ కాపర్‌ఫీల్డ్’ రచనా శైలిని పోలి ఉన్న బార్బరా కథ.. గతేడాది న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్.. పత్రికలు విడుదల చేసిన ‘10 అత్యుత్తమ పుస్తకాల్లో’ ఒకటిగా నిలిచింది.
స్వీయానుభవంతో..!
1955లో మేరీల్యాండ్‌లో పుట్టిన బార్బరా.. కెంటకీలో పెరిగారు. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు.. తన తండ్రి కాంగోకు మకాం మార్చారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ ప్రజారోగ్య విభాగంలో సేవలందించారు. సామాజిక సేవా దృక్పథం ఎక్కువగా ఉన్న తన తల్లిదండ్రులతో కలిసి.. వివిధ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగారామె. దీంతో కనీస సౌకర్యాల్లేక అక్కడి ప్రజలు పడే కష్టాలు, ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూశారు. ఒకానొక సమయంలో తన కుటుంబం ఓ గ్రామీణ ప్రాంతంలో కొన్నాళ్ల పాటు నీళ్లు, కరెంట్ లేకుండానే జీవించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో తన గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు బార్బరా.
ఎనిమిదేళ్లకే.. తోడుగా ఓ జర్నల్!
తల్లిదండ్రుల స్ఫూర్తితో బార్బరాకు చిన్న వయసు నుంచే పుస్తకాలు చదివే ఆసక్తి ఏర్పడింది. దీంతో ఎనిమిదేళ్ల నుంచే తాను ఎక్కడికెళ్లినా ఓ జర్నల్‌ను వెంట ఉంచుకునేవారామె. ఇలా పుస్తక పఠనంపై ఆసక్తిని గుర్తించిన ఆమె బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు కొన్ని పుస్తకాలను బహుమతిగా ఇచ్చేవారు. ఈ మక్కువే ఆమెకు క్రమంగా రచనల పైనా ఆసక్తి పెరిగేలా చేసింది. ఇక స్కూల్లో నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ఎంతో చురుగ్గా పాల్గొనే బార్బరా.. ఈ క్రమంలో ఎన్నో బహుమతుల్నీ గెలుపొందారు. ఇలా స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే ‘వై వుయ్ నీడ్ ఎ న్యూ ఎలిమెంటరీ స్కూల్’ పేరుతో ఆమె రాసిన వ్యాసం.. స్థానిక వార్తాపత్రికలో ప్రచురితమైంది. ఇలా తన రచనలతోనే కాదు.. తనకున్న పియానో నైపుణ్యాలతోనూ స్కూల్లో పలు పోటీల్లో గెలిచారామె. డ్యూపా యూనివర్సిటీ నుంచి ‘జీవశాస్త్రం’లో డిగ్రీ, అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ‘ఎకాలజీ-ఎవల్యూషనరీ బయాలజీ’లో మాస్టర్స్ పూర్తిచేసిన బార్బరా.. రచయిత్రిగా మారకముందు కొన్నేళ్ల పాటు ఫ్రీలాన్స్ రైటర్‌గా పనిచేశారు.
గర్భంతో.. ఒక్క రాత్రిలోనే..!
1980లో పూర్తిస్థాయిలో రచనలపై దృష్టి సారించిన బార్బరా.. తొలుత అకడమిక్ రైటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆపై కాల్పనిక కథల వైపు తన దృష్టిని మళ్లించారు. 1985లో జోసెఫ్ హఫ్‌మన్‌ను వివాహమాడిన ఆమె.. రెండేళ్ల తర్వాత ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే గర్భవతిగా ఉన్న సమయంలోనే తొలి నవల రాశారు బార్బరా. ‘ది బీన్ ట్రీస్’ పేరుతో ప్రచురితమైన ఈ నవలను.. నిద్రను త్యాగం చేసి మరీ ఒక్క రాత్రిలోనే రాయడం విశేషం. ఈ క్రమంలో గర్భిణిగా నిద్రలేమితో పలు సమస్యలూ ఎదుర్కొన్నారు బార్బరా. ఇక ఆపై ‘యానిమల్ డ్రీమ్స్’, ‘పిగ్స్ ఇన్ హెవెన్’.. వంటి మరికొన్ని పుస్తకాల్ని రాశారామె. సామాజిక న్యాయం, జీవవైవిధ్యం.. వంటి అంశాల్ని స్పృశిస్తూ ఆమె రాసిన పుస్తకాలు, నవలలు.. ఎక్కువగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు.. లైంగిక హింస, రాజకీయ హింస, యుద్ధాలు.. వంటి పలు అంశాలపై పేద మహిళల పోరాటాలను ఎత్తిచూపుతూ ఎన్నో కవితలు, కథానికలూ రచించారు బార్బరా.
‘బెల్‌వెథర్ ప్రైజ్’ ప్రత్యేకత అదే!
తన రచనలతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన బార్బరా.. తన ప్రతిభకు గుర్తింపుగా ఆయా రచనలకు గాను.. ‘నేషనల్ హ్యుమానిటీస్ మెడల్’, ‘నేషనల్ బుక్ ప్రైజ్ (దక్షిణాఫ్రికా)’, ‘జేమ్స్ బియర్డ్ అవార్డు’, ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్ బుక్ ప్రైజ్’, ‘ఎడ్వర్డ్ అబీ ఎకోఫిక్షన్ అవార్డు’, ‘ఆరెంజ్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’.. వంటి ఎన్నో ప్రముఖ పురస్కారాలు-మెడల్స్ అందుకున్నారు. మరికొన్ని సంస్థలు ఆమెను ‘జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించి గౌరవించాయి. ఇలా తాను అవార్డులు అందుకోవడమే కాదు.. తానే స్వయంగా ‘బెల్‌వెథర్ ప్రైజ్’ పేరుతో ఓ పురస్కారానికి అంకురార్పణ చేశారు బార్బరా. తమ కాల్పనిక కథలతో సమాజంలో మార్పు కోరుకునే రచయితలకు అండగా నిలిచేందుకు.. వారి ప్రతిభకు పట్టం కట్టేందుకు 2000 నుంచి ఈ సాహిత్య అవార్డు ఇవ్వడం ప్రారంభించారామె. రెండేళ్లకోసారి అందిస్తోన్న ఈ పురస్కారంలో భాగంగా.. 25 వేల డాలర్ల నగదు బహుమతిని అందజేస్తున్నారామె.
ప్రస్తుతం వర్జీనియాలో స్థిరపడ్డ 68 ఏళ్ల బార్బరా.. ‘నా ప్రతిభతో పేరుప్రఖ్యాతులు రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు.. కానీ నా రచనలతో ఈ సమాజంలోని సమస్యల్ని అందరి దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అంటూ తనలోని నిరాడంబరతను చాటుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.