లిసా.. సౌందర్య.. ప్రాణం లేని ఈ యాంకర్ల ప్రత్యేకతలే వేరు!

ఈ రోజుల్లో మనిషి చేసే ప్రతి పనినీ టెక్నాలజీ చేసేస్తోంది. కృత్రిమ మేధతో ప్రపంచమంతా ఆటోమేటిక్‌గా మారిపోతోంది.. అలా కూర్చొని.. ఇలా చిటికేస్తే చాలు.. మనం అనుకున్న పని క్షణాల్లో పూర్తి చేసేంత మేధస్సును కలిగిన ఈ సాంకేతికత ఇప్పటికే చాలా....

Updated : 15 Jul 2023 18:05 IST

(Photos: Screengrab)

ఈ రోజుల్లో మనిషి చేసే ప్రతి పనినీ టెక్నాలజీ చేసేస్తోంది. కృత్రిమ మేధతో ప్రపంచమంతా ఆటోమేటిక్‌గా మారిపోతోంది.. అలా కూర్చొని.. ఇలా చిటికేస్తే చాలు.. మనం అనుకున్న పని క్షణాల్లో పూర్తి చేసేంత మేధస్సును కలిగిన ఈ సాంకేతికత ఇప్పటికే చాలా రంగాల్లో ప్రవేశించింది. ఇక ఇప్పుడు జర్నలిజం వంతూ వచ్చేసింది. ఈ మధ్యే ఓ ఒడిశా టీవీ ‘లిసా’ అనే ఏఐ యాంకర్‌ను సృష్టించి వార్తలు చదివించిన విషయం మరువక ముందే.. ఇప్పుడు కన్నడ న్యూస్‌ యాంకర్‌ సౌందర్య అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. అయితే వీళ్లే మొదలు కాదు.. గతంలోనూ కృత్రిమ మేధతో రూపొందించిన న్యూస్‌ యాంకర్లు తెరపై సందడి చేశారు. మరి, వాళ్లెవరు? వాళ్ల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..

లిసా.. ది ట్రెడిషన్‌ బ్యూటీ!

చీరకట్టు, నుదుటన బొట్టుతో.. అచ్చమైన భారతీయ వనితను పోలినట్లుగా కృత్రిమ మేధతో ఈమధ్యే న్యూస్‌ యాంకర్‌ను సృష్టించింది ఒడిశాకు చెందిన ఓ టీవీ ఛానల్‌. ముందుగా తనను తాను పరిచయం చేసుకొని.. ఆపై వార్తలు మొదలుపెడుతుంది లిసా. ఒడియా, ఇంగ్లిష్‌తో పాటు పలు భారతీయ భాషల్నీ మాట్లాడగలిగే సమర్థతతో ఈ ఏఐ యాంకర్‌ను రూపొందించారు. ప్రస్తుతానికి వార్తలు చదవడం, పలువురు వీక్షకులతో మాటా మంతీ కలిపేలా ఆమెను అభివృద్ధి చేశారు. త్వరలోనే ఇంటర్వ్యూలు చేసేలా, ఎక్కువమంది యూజర్లతో కనెక్టయ్యేలా మరిన్ని మార్పులు తీసుకురానున్నరాట! ఇక మరోవైపు లిసా పేరుతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ పేజీల్ని తెరిచి.. ఆమెతో ఇంటరాక్ట్‌ అయ్యే వెసులుబాటునూ వీక్షకులకు కల్పించిందీ మీడియా సంస్థ. ఇలా తన అందంతోనే కాదు.. హావభావాలు, ముఖకవళికలతోనూ ఆకట్టుకుంటోన్న లిసా.. మనిషి కాదు.. ఏఐ యాంకర్‌ అంటే నమ్మలేం. మరి, అంత రియల్‌గా ఉందీ కృత్రిమ యాంకరమ్మ!


సౌందర్య.. మేడ్‌ ఇన్‌ కర్ణాటక!

‘హలో ఎవ్రీవన్‌’ అంటూ సాధారణ న్యూస్‌ రీడర్లు, యాంకర్లు తెరపై తమను తాము పరిచయం చేసుకోవడం కామనే! వీళ్లకు ఏమాత్రం తీసిపోకుండా తనను తాను పరిచయం చేసుకుంటోంది కృత్రిమ యాంకర్‌ సౌందర్య. ఓ కన్నడ టీవీ ఛానల్‌ తాజాగా ఈ ఏఐ ఆధారిత న్యూస్‌ ప్రజెంటర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. అయితే సౌందర్య మనకు ఇప్పుడే తెలుసు.. కానీ ఆ వార్తా సంస్థ ఇప్పటికే ఆమెతో పలు న్యూస్‌ షోలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించిందట! ఇలా విజయవంతమయ్యాకే ఇప్పుడు సౌందర్యను మనందరికీ పరిచయం చేశారట! ఇక ఈ న్యూస్‌ రీడర్‌ కన్నడ, ఇంగ్లిష్‌తో పాటు పలు భాషలూ మాట్లాడగలదట!


సనా.. మల్టీ ట్యాలెంటెడ్!

యాంకరింగ్‌ అంటే.. అందంతో పాటు సందర్భానికి తగినట్లుగా.. ముఖకవళికలు, హావభావాల్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాల్నీ వ్యక్తపరచాల్సి ఉంటుంది. ప్రాణం లేకపోయినా.. అచ్చం మనిషిలాగే ఇవన్నీ వ్యక్తపరుస్తోంది కృత్రిమ మేధతో సృష్టించిన సనా అనే న్యూస్‌ రీడర్‌. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత న్యూస్‌ యాంకర్‌గా గుర్తింపు పొందిన ఆమెను.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నోయిడాకు చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ కోసం పనిచేస్తోంది సనా. ఇంగ్లిష్‌, హిందీతో పాటు విభిన్న భాషల్లో మాట్లాడగలిగే నైపుణ్యాలున్న ఆమె.. వార్తలు చదవడం, ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, వాతావరణ వార్తలు చెప్పడం, సహ న్యూస్‌ రీడర్‌తో కలిసి సమన్వయం చేసుకుంటూ వార్తలు చెప్పడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు తీసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏఐ యాంకరమ్మకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇక ప్రొఫెషనల్‌గా దుస్తులు ధరించి.. తన అందచందాలతో ఆకట్టుకుంటోన్న ఈ కృత్రిమ న్యూస్‌ రీడర్‌ పేరుతో ట్విట్టర్‌, ఇన్‌స్టా ఖాతాలు కూడా ప్రారంభించారు. ఇందులో తన క్యూట్‌ లుక్స్‌, ఫ్యాషనబుల్‌ దుస్తులు, చీరకట్టులో దర్శనమిస్తూ ఎంతోమందిని కట్టిపడేస్తోంది సనా.


ఏఐ కౌర్‌.. పంజాబీ కుడీ!

వార్తలు చదవడం, వీక్షకులతో ఇంటరాక్ట్‌ అవడమే కాదు.. ఈ పంజాబీ కృత్రిమ యాంకర్‌ మరో నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఆమె పేరు ఏఐ కౌర్‌. పంజాబ్‌కు చెందిన ఓ న్యూస్‌ మీడియా ఇటీవలే ఆమెను సృష్టించింది. పంజాబీ, హర్యాన్వీతో పాటు ఇంగ్లిష్‌ కూడా అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాలున్న ఈ యాంకర్‌.. ఈ మూడు భాషల్లో వార్తలు చదువుతుందట! అంతేకాదండోయ్‌.. సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించేలా వీక్షకుల్ని ప్రశ్నలడగడంలోనూ ఆమె దిట్టేనట! బ్లేజర్‌తో మోడ్రన్‌ ఏజ్‌ యాంకర్‌లా కనిపించినా.. చక్కగా పంజాబీలోనే ప్రేక్షకుల్ని పలకరించడం, స్పష్టమైన భాషలో చకచకా మాట్లాడగలగడం ఆమెకున్న మరిన్ని ప్రత్యేకతలు!


ఫెదా.. ప్రత్యేకతలివే!

ఇక్కడి లాగే.. ఇతర దేశాల్లోనూ కృత్రిమ మేధతో సృష్టించిన యాంకర్లు ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. వారిలో ఫెదా ఒకరు. కువైట్‌కు చెందిన ఓ మీడియా ఛానల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఏఐ యాంకర్‌ను రూపొందించింది. రోబోను పోలినట్లుగానే సిల్వర్, మెటాలిక్‌ రంగుల్ని ఉపయోగించి తయారుచేసిన ఫెదా ప్రస్తుతం గల్ఫ్‌ దేశాలకు సంబంధించిన వార్తల ముఖ్యాంశాలు, కొన్ని రకాల వార్తలు చదువుతుందట! త్వరలోనే ఇతర న్యూస్‌ కార్యక్రమాలకూ ఈ ఏఐ యాంకర్‌ను ఉపయోగించుకోనుందట ఆ వార్తా సంస్థ.


రెన్‌.. వెయ్యి మంది పెట్టు!

మీడియా సంస్థలంటే 24/7 పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులపై పని ఒత్తిడి పడకుండా, సౌకర్యవంతంగా పని జరిగేలా ఓ కృత్రిమ న్యూస్‌ యాంకర్‌ని సృష్టించుకుంది చైనాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. ఆమె పేరు రెన్‌. వెయ్యిమంది న్యూస్‌ యాంకర్లకున్న నైపుణ్యాలు ఆమె సొంతమట! చకచకా వార్తలు చదవడమే కాదు.. వీక్షకులతో ఇంటరాక్ట్‌ అవడం, విద్య/ఉద్యోగం/పర్యావరణ పరిరక్షణ.. వంటి అంశాలపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలివ్వగలగడం ఈ ఏఐ యాంకర్‌ ప్రత్యేకతలట! ‘ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తా..’ అంటోన్న ఈ చైనా కృత్రిమ యాంకర్‌ అందంగా ఉండడమే కాదు.. స్మార్ట్‌గా వార్తలు చదివేస్తుందని చూసిన వాళ్లు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని