Shraddha Murder Case: అమ్మాయిలూ జాగ్రత్త.. ప్రేమ ముసుగులో.. మేకవన్నె పులులెన్నో!

‘చావైనా, బతుకైనా.. నీతోనే!’ అనేంతగా అతడిని వలచిందా అమ్మాయి.. అతడి కోసం కన్న తల్లిదండ్రుల్ని కూడా కాదనుకుంది. ఇద్దరూ కలిసుండడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు సంతోషంగా గడిపారు. కానీ ఎన్ని రోజులిలా..? అందుకే తమ ప్రేమ బంధానికి పెళ్లితో పీటముడి వేయాలని....

Updated : 19 Nov 2022 14:45 IST

‘చావైనా, బతుకైనా.. నీతోనే!’ అనేంతగా అతడిని వలచిందా అమ్మాయి.. అతడి కోసం కన్న తల్లిదండ్రుల్ని కూడా కాదనుకుంది. ఇద్దరూ కలిసుండడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు సంతోషంగా గడిపారు. కానీ ఎన్ని రోజులిలా..? అందుకే తమ ప్రేమ బంధానికి పెళ్లితో పీటముడి వేయాలని కోరుకుందామె. కానీ అందుకు ప్రియుడు ససేమిరా అన్నాడు.. ‘మోజు తీరాక తనతో నాకు పనేంటి?’ అనుకున్నాడో, ఏమో.. మాటలు, చేతలతో వేధించేవాడు. అయినా ‘ఎప్పటికైనా నా వాడే కదా!’ అని అన్నీ భరించిందామె. ఆమె ఓపికనే అలసత్వంగా తీసుకున్న అతడు.. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.. అత్యంత కిరాతకంగా ప్రియురాలిని హతమార్చాడు. ‘ప్రేమ ముసుగులో.. మేకవన్నె పులులెన్నో!’ అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేశాడు కిల్లర్‌ లవర్‌ ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా. ఇలాంటి క్రూరుడిని వలచి వరించడం శ్రద్ధా వాకర్‌కు పెను శాపమైంది.

ప్రేమే శాపమైందా?

ముంబయికి చెందిన 27 ఏళ్ల అమ్మాయి శ్రద్ధా వాకర్ హత్యోదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! వలచి వచ్చిన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హతమార్చి.. ప్రేమ అనే పవిత్ర బంధానికి మాయని మచ్చ తెచ్చాడీ కిరాతకుడు. ‘ప్రేమ ముసుగులోనూ ఇంతటి దారుణమైన పన్నాగాలుంటాయా?’ అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యేలా చేశాడు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాడు. అమ్మాయిల భద్రత పైనా ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాడు. అయితే ప్రేమ విషయంలో భాగస్వామిపై ఉన్న గుడ్డి నమ్మకంతో  వారి మేకవన్నె పులి రూపాన్ని కొంతమంది అమ్మాయిలు పసిగట్టలేకపోతున్నారని.. ఈ అలక్ష్యమే ఇంతటి దారుణాలకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రేమ విషం చిమ్మకముందే జాగ్రత్తపడి.. ఇలాంటి హింసాత్మక బంధాల నుంచి బయటపడడం మంచిదని సూచిస్తున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఒంటరిని చేసేస్తారు!

నిజమైన ప్రేమంటే నమ్మకం, గౌరవం, కేరింగ్‌, అర్థం చేసుకోవడం.. ఇలాంటివెన్నో ఉంటాయి. కానీ ఆఫ్తాబ్‌-శ్రద్ధ అనుబంధంలో ఇవేవీ లేవని పలు రిపోర్టుల్ని బట్టి అర్థమవుతోంది. మాటలు, చేతలతో హింసించడం, తనను వదిలి వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేయడం, శ్రద్ధ తన స్నేహితులతో బంధాలు తెంచుకునేలా ప్రేరేపించడం.. ఇలా ఎటు నుంచి చూసినా అతడి క్రూరత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ప్రేమ మైకం.. విషపూరితమైన అనుబంధంలో ఉన్న ఇలాంటి పన్నాగాల్ని పసిగట్టకుండా చేస్తుందని, తమకు నమ్మకంగా ఉండే అన్ని బంధాల్ని తెంచేసుకునేలా చేసి అమ్మాయిల్ని ఒంటరిని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ‘అతడు తప్ప వేరే గత్యంతరం లేద’న్నట్లుగా వారి మనసు మారుతుంది. దాంతో జీవచ్ఛవంలా కాలం వెళ్లదీయడం, లేదంటే ఇలా అర్ధాంతరంగానే జీవితం ముగిసిపోవడం.. వంటివి జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి!

శ్రద్ధ హత్యోదంతం వంటి ఘటనలు చదివినప్పుడు.. చాలామంది తమ మనసులో.. ‘ముందే గుర్తించి బయట పడితే ఇంత ఘోరం జరిగేది కాదు కదా..!’ అనుకుంటారు. కానీ ఇది మనం మాట్లాడుకున్నంత సులభం కాదంటున్నారు నిపుణులు. ఇలాంటి విషపూరితమైన అనుబంధంలో తాము కూరుకుపోయామని గుర్తించడం, దాన్నుంచి బయటపడడం.. రెండూ కష్టమేనంటున్నారు. ఎందుకంటే అక్కడ వారి పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయి మరి! ఒకే రకమైన పరిష్కారం అందరి విషయంలోనూ వర్కవుట్‌ కాకపోవచ్చు. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అమ్మాయిలు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటే పరిస్థితి చేయి దాటకముందే జాగ్రత్తపడచ్చంటున్నారు. అవేంటంటే..!

⚛ హింస అనేది ఎవరి విషయంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అయితే భాగస్వామి శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా.. ఎంత టార్చర్‌ పెట్టినా.. ఏదో ఒక దశలో కాస్త గ్యాప్‌ ఇవ్వచ్చు. ఆ మధ్యలో వీలు చూసుకొని తెలివిగా ఆలోచించి ఈ హింసాత్మక బంధం నుంచి బయటపడచ్చు.

⚛ ఒక బంధంలో తమకు ఏది ఆమోదయోగ్యమైంది.. ఏది కాదు.. అన్న విషయంలో ప్రతి మహిళకూ స్పష్టత ఉండాలి. తద్వారా ప్రమాదంలో చిక్కుకోకుండా ముందే జాగ్రత్తపడచ్చు.

⚛ ప్రేమ ముసుగులో ఉన్న ఇలాంటి ప్రతికూల బంధంలో మీరొక్కరే కాదు.. మీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారన్న విషయం ప్రతి మహిళా గుర్తెరగాలి. ఇలాంటి వాళ్లకు మద్దతిచ్చే బృందాల్లో చేరాలి. ఈ క్రమంలో మీరున్న పరిస్థితుల్ని ఆ వేదికగా వివరించడంతో పాటు.. ఆపై ఇతరుల అనుభవాలు కూడా తెలుసుకోవాలి. అలాగే వాళ్లు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడగలిగారో తెలుసుకుంటే.. ఆ పాఠాలు మీకూ ఉపయోగపడచ్చు.

⚛ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మీ అనుబంధంలోనూ ఉన్నాయనిపిస్తే.. ముందే గుర్తించి వ్యక్తిగతంగా కౌన్సెలింగ్‌కు వెళ్లడం మంచిది. తద్వారా సమస్యను ముందే పరిష్కరించుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో భాగస్వామితో కలిసీ కౌన్సెలింగ్‌కు వెళ్లచ్చు. ఇద్దరి మధ్యా సయోధ్య కుదుర్చుకోవచ్చు.


ఆచితూచి అడుగేయాలి!

ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలంటే మనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. సరైన దిశలో అడుగేస్తున్నామా? లేదా? అనే విషయంలో మన కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకుంటాం. కానీ ప్రేమ దగ్గరికొచ్చేసరికి మాత్రం ఇలా ఆలోచించడాలు, ఇతరుల సలహా తీసుకోవడాలు ఉండవు. ఎందుకంటే వారు తమ బంధాన్ని అంగీకరిస్తారో, లేదోనన్న భయం! చాలామంది మహిళలు తమ భాగస్వామి వేధింపులకు గురికావడానికి, ఒంటరిగా-మౌనంగా వాటిని భరించడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఎదుటి వ్యక్తి బాహ్య సౌందర్యాన్ని పక్కన పెట్టి.. వారి మనసును చదవాలంటున్నారు.. వారి ప్రవర్తనను బట్టి దీనిపై మీకు కొంత అవగాహన రావచ్చు. అందుకే పైపైన అందం చూసో, ప్రేమగా మాట్లాడుతున్నారనో.. వారికి దగ్గర కాకుండా, అతి చనువు ఇవ్వకుండా ముందే జాగ్రత్తపడడం మంచిది. ఈ క్రమంలో మీకు నచ్చని విషయంలో నిర్మొహమాటంగా ‘నో’ చెప్పే ధైర్యాన్ని, మానసిక దృఢత్వాన్ని కూడగట్టుకోవాలి. మీ బంధం గురించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పడంతో పాటు.. భాగస్వామి నుంచి ఏవైనా వేధింపులు, సమస్యలు ఎదురైనా వీళ్లతో పంచుకోవడం వల్ల మీకు నలుగురి మద్దతు లభిస్తుంది. మీ సమస్యకు తగిన పరిష్కారం కూడా దొరుకుతుంది. అప్పుడే బంధంలో అవాంఛనీయ పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్తపడచ్చు.


డేటింగ్‌ - సహజీవనం.. ఇవి తెలుసుకోవాలి!

నిజానికి ఈ రెండూ పాశ్చాత్య పద్ధతులే.. కానీ ప్రస్తుతం మన దేశంలోనూ వీటికి ఆదరణ పెరిగిపోతోంది. డేటింగ్‌ యాప్స్‌లో భాగస్వామిని వెతుక్కోవడం, కొన్నాళ్ల పాటు కలిసుండడం, నచ్చితే బంధాన్ని కొనసాగించడం, లేదంటే విడిపోవడం.. వంటివి చాలామంది అనుసరిస్తున్నారు. ఆఫ్తాబ్‌-శ్రద్ధ రిలేషన్‌షిప్‌ కూడా ఇలాగే మొదలైంది. కానీ చివరికి విషాదాంతం అయింది. అయితే ప్రతి విషయంలో సానుకూలతలు, ప్రతికూలతలు ఉన్నట్లే.. ఈ రెండు పద్ధతులూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు నిపుణులు. భాగస్వామి గురించి ముందే లోతుగా తెలుసుకొని ఒక నిర్ణయానికి రావాలనుకోవడం మంచి విషయమే అయినా.. ఇది అందరి విషయంలో సానుకూల ఫలితాల్ని ఇవ్వలేకపోవచ్చంటున్నారు. భాగస్వామి మంచివారైతే ఫలితం సానుకూలంగా, లేదంటే వేధింపులు, అభద్రతా భావం, దానివల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం.. ఇలా నష్టాలు, సమస్యలు ఒకదాని వెనుక మరొకటి క్యూ కడుతుంటాయి. ఇవి మితిమీరితే.. ఒక దశలో జీవితాన్ని స్వయంగా అంతం చేసుకోవడం లేదంటే శ్రద్ధ లాగా అవతలి వారి చేతుల్లో బలయ్యే పరిస్థితులకు దారితీయచ్చంటున్నారు నిపుణులు.

కాబట్టి అవతలి వారి గురించి  పూర్తిగా తెలుసుకోకుండా వారికి చనువివ్వడం, మన జీవితాన్ని ఎదుటివారి చేతుల్లో పెట్టడం కూడదంటున్నారు. అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే సత్తాను పెంచుకుంటే ప్రేమలో ఓడిపోవాల్సిన, బలవ్వాల్సిన అవసరం రాదంటున్నారు.

సహజీవనంపై మీ అభిప్రాయమేమిటి? ఇలాంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బంధం ప్రమాదకరంగా మారుతోందా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్