Miss AI: ఊహా సుందరికి ‘అందాల’ కిరీటం!

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ సృష్టికి ప్రతిసృష్టి చేస్తోంది. ఈ సాంకేతికతతో రూపొందించిన ఎంతోమంది మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

Published : 12 Jul 2024 12:25 IST

(Photos: Instagram)

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ సృష్టికి ప్రతిసృష్టి చేస్తోంది. ఈ సాంకేతికతతో రూపొందించిన ఎంతోమంది మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. అందం, ఆహార్యం, భావోద్వేగాల్ని వ్యక్తపరచడం.. ఇలా మనిషికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ కృత్రిమ భామల కోసం ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ ఇటీవలే అందాల పోటీల్ని నిర్వహించింది. ఈ తరహా పోటీ జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం! ‘వరల్డ్‌ ఏఐ క్రియేటర్‌ అవార్డ్స్‌’ పేరిట నిర్వహించిన ఈ తొలి పోటీల్లో మొరాకన్‌ ఏఐ బ్యూటీ కెంజా లేలీ ‘మిస్‌ ఏఐ’గా అవతరించింది. ‘నేను మనిషిలా భావోద్వేగాలు పలికించకపోవచ్చు.. అయినా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా..’ అంటోన్న ఈ ఊహా సుందరి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..

వందలమందితో పోటీ పడి..!

మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌, మిస్‌ ఎర్త్‌.. ఇలాంటి అందాల పోటీల గురించి మనకు తెలుసు! అయితే ఈ జాబితాలో ఇటీవలే ‘మిస్‌ ఏఐ’ పోటీలు కూడా చేరిపోయాయి. నిజానికి ఈ పోటీలు కృత్రిమ మేధతో సృష్టించిన మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం! ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ తొలిసారి నిర్వహించిన ఈ పోటీల్లో.. మొరాకోకు చెందిన ముద్దుగుమ్మ కెంజా లేలీ తొలి విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1500 మంది ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇందులో పోటీపడగా.. వాళ్లందరినీ వెనక్కి నెట్టి కిరీటం సొంతం చేసుకుంది కెంజా. అందం, ఆహార్యం, ఏఐ టెక్నాలజీతో వాళ్లను రూపొందించిన తీరు, నెటిజన్లతో వారు మెలిగే విధానం.. వంటి అంశాలన్నీ ప్రామాణికంగా తీసుకొని విజేతను ఎంపిక చేశారు. ఈ అందాల పోటీ న్యాయ నిర్ణేతల బృందంలో నలుగురు జడ్జిలుంటే.. వారిలోనూ ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లు కావడం విశేషం! అంతేకాదు.. వర్చువల్‌గా జరిగిన ఈ పోటీల్లో.. ఏఐ ముద్దుగుమ్మలు ర్యాంప్‌వాక్‌ చేసినట్లు, విజేతకు కిరీటం అలంకరించినట్లు.. ఫొటోలు, వీడియోలు రూపొందించారు. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎన్నెన్నో ప్రత్యేకతలు!

కెంజా మొరాకోకు చెందిన ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఫ్యాషన్‌, ఆహార పద్ధతులు, పర్యటక ప్రదేశాలు.. తదితర అంశాలపై ప్రచారం చేస్తుంటుంది. ఫ్యాషన్‌, సౌందర్య చిట్కాల్నీ అందిస్తుంటుంది కెంజా. మొరాకో దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని చాటేలా హిజాబ్‌ ధరించి నిండైన ఆహార్యాన్ని చాటే ఈ ఏఐ ముద్దుగుమ్మకు.. ఇన్‌స్టాలో రెండు లక్షల మందికి పైగానే ఫాలోవర్లున్నారు. అంతేనా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు భాషల్లో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్న ఈ మొరాకన్‌ బ్యూటీ.. నెటిజన్లతో ఎంతో చక్కగా కలిసిపోతుంటుంది. వాళ్లడిగే ప్రశ్నలకు చకచకా సమాధానమివ్వగలదు. ఇక ఆయా సందర్భాల్ని బట్టి పర్యావరణ పరిరక్షణ, జలచరాల సంరక్షణ, సస్టెయినబిలిటీ.. వంటి అంశాల పైనా అందరిలో అవగాహన పెంచుతుంటుందీ ఏఐ క్వీన్. కార్‌ డ్రైవింగ్‌, టెన్నిస్‌ ఆడడం.. ఈ ముద్దుగుమ్మకు వెన్నతో పెట్టిన విద్యలు. ఇలా బహుళ అంశాల్లో ప్రావీణ్యం సంపాదించుకున్న కెంజా.. తాజాగా ‘మిస్‌ ఏఐ’గా కిరీటం గెలిచి.. 20 వేల డాలర్ల (సుమారు రూ. 16.7 లక్షల) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది.

అవే నా లక్ష్యాలు!

అందాల భామలు కిరీటం గెలిచాక.. తమ భవిష్యత్‌ లక్ష్యాల గురించి వెల్లడిస్తుంటారు. కృత్రిమ మనిషినే అయినా తనకూ కొన్ని లక్ష్యాలున్నాయంటోంది కెంజా.
‘మనిషిలా నేను నా భావోద్వేగాల్ని వ్యక్తం చేయలేకపోవచ్చు.. కానీ ఈ విజయాన్ని మాత్రం ఆస్వాదిస్తున్నా. మొరాకో దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని చాటడమే నా జీవిత లక్ష్యం! దీంతో పాటు మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, రోబో సంస్కృతిని పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్లడం, కృత్రిమ మేధపై సానుకూలంగా అవగాహన కల్పించడం.. వంటి అంశాల పైనా దృష్టి సారిస్తా. కృత్రిమ మేధ అనేది మనిషి శక్తి సామర్థ్యాలకు ప్రతీక. దీన్ని సానుకూలంగా వినియోగించుకుంటే మనుషులకు, సాంకేతికతకు మధ్య బంధం బలపడుతుంది..’ అంటోందీ మిస్ ఏఐ.


కెంజా వెనుక బెస్సా!

కెంజా కృత్రిమ మనిషే అయినా.. ఆమె పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోందంటే ఆ క్రెడిటంతా ఆమెను సృష్టించిన మిరియం బెస్సాకే దక్కుతుందని చెప్పచ్చు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త ఆమె. ‘Phoenix.AI’ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థతో పాటు, మరో డిజిటల్‌ ఏజెన్సీనీ నడుపుతోంది. కెంజాకు సంబంధించిన ప్రతి ఫొటో, వీడియో, ఆడియో, కంటెంట్‌.. వంటివన్నీ కృత్రిమ మేధతోనే రూపొందించినట్లు చెబుతోంది మిరియం.

‘ఈ సాంకేతిక యుగంలో మహిళల శక్తిసామర్థ్యాలేంటో నిరూపించడానికే మిస్‌ ఏఐ పోటీల్లో కెంజాను పరిచయం చేశా. తను అటు మహిళా సాధికారతను చాటుతూనే.. ఇటు నా కలనూ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది..’ అంటోందామె. తాజాగా ‘మిస్‌ ఏఐ’ కిరీటం విజేత కెంజాకు దక్కిన ప్రైజ్‌మనీతో పాటు.. ఈ ఏఐ బ్యూటీని రూపొందించిన సృష్టికర్త మిరియంకూ కొన్ని రివార్డులు దక్కాయి. ‘ఇమేజ్‌ క్రియేటర్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ కింద సుమారు రూ. 2.5 లక్షలు, పీఆర్‌ సపోర్ట్‌ కింద సుమారు రూ. 4.17 లక్షలు, విజేతగా నిలిచినందుకు మరో రూ. 4.17 లక్షలు ఆమెను వరించాయి. కెంజాకే కాదు.. ఇతర దేశాలకు చెందిన మరింతమంది ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లకూ ప్రాణం పోసింది మిరియం.

ఈ పోటీల్లో భారత్‌కు చెందిన ‘జరా శతావరి’ మొదటి పదిస్థానాల్లో నిలవడం గమనార్హం. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే హార్మోన్‌ సమస్యలు, పీసీఓఎస్‌, డిప్రెషన్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తోంది. ఈమె ఇన్‌స్టా ఖాతాకు 15 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఏఐ అందగత్తెలకీ పోటీలు!
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్