Tree Library: చెట్లకు పుస్తకాలు కాస్తున్నాయ్!
స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకోవడం, ఇంటికొచ్చాక మొబైల్‌తో కాలక్షేపం.. ఈతరంలో చాలామంది పిల్లల రొటీన్
స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకోవడం, ఇంటికొచ్చాక మొబైల్‌తో కాలక్షేపం.. ఈతరంలో చాలామంది పిల్లల రొటీన్ ఇదే! దీంతో వీరిలో లోకజ్ఞానం కొరవడుతోంది. పూర్తిగా కాపీ పేస్ట్ మైండ్‌సెట్‌కే అలవాటు పడిపోతున్నారు. ఇది పిల్లల కెరియర్‌కు అస్సలు మంచిది కాదు. ఇదే విషయం గురించి ఆలోచించారు అసోం జోర్హట్ జిల్లాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా సభ్యులు. పిల్లల్లో పుస్తకాలు చదివే ఆసక్తిని రేకెత్తించడానికి ఓ వినూత్న ఆలోచన చేశారు. పచ్చటి ప్రకృతిలో చెట్ల కొమ్మల్నే అరలుగా మార్చి.. విభిన్న పుస్తకాలు అమర్చిన బాక్సుల్ని వేలాడదీశారు. ‘ట్రీ లైబ్రరీ/గార్డెన్ లైబ్రరీ’ పేరుతో ఏర్పాటుచేసిన ఈ గ్రంథాలయం అక్కడి వారినే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రేమికుల్నీ ఆకట్టుకుంటోంది. మరి, ఇంకా దీని ప్రత్యేకతలు ఏమిటి.. తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!
పిల్లల భవిష్యత్తుకు విషయ పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనం కూడా ముఖ్యమే! కానీ ప్రస్తుత టెక్నాలజీ, గ్యాడ్జెట్స్ ప్రభావంతో చాలామంది పిల్లలు పుస్తకాలకు దూరమవుతున్నారని చెప్పాలి. ఈ దూరాన్ని దూరం చేయాలనుకున్నారు అసోం జోర్హట్ జిల్లాకు చెందిన ‘జేసీఐ జోర్హట్ ఫెమీనా’ స్వచ్ఛంద సంస్థ మహిళా నిర్వాహకులు. ఈ క్రమంలో ఇటీవలే ‘ట్రీ లైబ్రరీ/గార్డెన్ లైబ్రరీ’ని ఏర్పాటు చేశారు.
కొమ్మకొమ్మకో బాక్సు..!
ఇందుకు అక్కడి ‘మరియానీ గర్ల్స్ హైస్కూల్’ను ఎంచుకుందీ మహిళా బృందం. ఆ పాఠశాల ప్రాంగణంలోని చెట్ల కొమ్మలకు పోస్టల్ బాక్సుల్లాంటి చిన్న చిన్న బాక్సుల్ని అమర్చారు. హిందీ, ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, అస్సామీస్.. వంటి సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలతో పాటు కథలు, హాస్య పుస్తకాలు, ఆత్మకథలు, నవలలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్.. మొదలైన బుక్స్‌ని ఒక్కో బాక్సులో విడివిడిగా అమర్చారు. వార్తాపత్రికల్ని ప్రత్యేకంగా మరో బాక్సులో అందుబాటులో ఉంచారు. అంతేకాదు.. ఏ బాక్సులో ఏముందో సులభంగా తెలుసుకునేలా ఆయా బాక్సులపై పేర్లు కూడా రాశారు. ఇలా పిల్లల్ని ఆకట్టుకునేలా వినూత్నంగా నిర్మించిన ఈ లైబ్రరీ చుట్టూ కూర్చోవడానికి వీలుగా వెదురు బొంగులతో బెంచీలను కూడా ఏర్పాటుచేసిందీ మహిళా బృందం. అంతేకాదు.. ఆ చుట్టూ పరిసరాల్ని పచ్చపచ్చటి చెట్లతో, పిల్లలు మెచ్చే బొమ్మలతో అలంకరించింది. ఇలా మొత్తానికి పచ్చటి ప్రకృతి మధ్య, ఆహ్లాదకర వాతావరణంలో.. పిల్లలు తమకు నచ్చిన పుస్తకాల్ని చదివేలా ఏర్పాటుచేశారీ మహిళలు.
పుస్తకాలూ చదవాలని..!
పిల్లలు సాంకేతికంగా ఎన్ని నైపుణ్యాలు సంపాదించినా.. పుస్తక పఠనం కూడా వారి ఉన్నతిలో భాగమే అంటున్నారు ‘జేసీఐ జోర్హట్ ఫెమీనా’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు దీపికా పొద్దార్.
‘ఈ తరం పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగానే ఉంటోంది. కానీ దాంతో పాటు పుస్తక పఠనం కూడా వారి బంగారు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుంది. అందుకే పిల్లల్లో పుస్తకాలు చదివే ఆసక్తిని పెంచాలనుకున్నాం. ఈ ట్రీ లైబ్రరీతో దానికి కార్యరూపమిచ్చాం. రూ. 15 వేలతో దీన్ని ఇటీవలే ప్రారంభించాం. ఈ గ్రంథాలయంలో సుమారు 600 పుస్తకాలున్నాయి. ప్రస్తుతం దీనికి మంచి స్పందన వస్తోంది. మా ఆలోచన నచ్చి కొందరు తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పడం సంతోషంగా అనిపించింది..’ అంటున్నారామె. ఇలా తమ వినూత్న ఆలోచనతో అక్కడి పిల్లల్నే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల వారినీ, దేశవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రియుల్నీ ఆకట్టుకుందీ మహిళా బృందం.
ట్రీ లైబ్రరీ.. అక్కడ కూడా!
అసోంలోనే కాదు.. పశ్చిమ బంగాలోని అలీపుర్‌దౌర్‌లోనూ ఇలాంటి ట్రీ లైబ్రరీ ఉంది. అక్కడి యూరోపియన్ క్లబ్ గ్రౌండ్‌లో స్థానిక గ్రాడ్యుయేట్ నిమేష్ లామా అనే వ్యక్తి గతంలో దీన్ని ఏర్పాటుచేశాడు. చెట్ల కొమ్మల్ని అరలుగా చేసి, ఇతర కొమ్మలకు బాక్సుల్ని ఉయ్యాలలుగా వేలాడదీసి.. అందులో విభిన్న రకాల పుస్తకాల్ని అమర్చారాయన. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ గ్రంథాలయానికి విశేష స్పందన రావడమే కాదు.. ఓ చిన్నపాటి టూరిస్ట్ ప్లేస్‌గానూ ఇది మారింది. ఆదివారాలూ ఈ లైబ్రరీ తెరిచి ఉంటుంది.. ఆ రోజున పుస్తకాలతో, పుస్తక ప్రేమికులతో గడుపుతూ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇదో గమ్యస్థానంగా మారిపోయింది!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.