ఆదివారం అచ్చంగా.. మన కోసం.. ఇలా గడిపేద్దాం!

ఉద్యోగం చేసే మహిళలం ఆదివారం వచ్చిందంటే వీకెండ్ పార్టీలకు వెళ్లాలనో, రోజంతా విశ్రాంతి తీసుకోవాలనో అనుకుంటాం. కానీ వారంనుంచీ పేరుకుపోయిన బట్టలు వెక్కిరిస్తూ కనిపిస్తాయి. ప్రతి ఆదివారం ఇల్లు క్లీన్ చేయాలనుకున్నా చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్న కారణంగా ఇంట్లో పేరుకున్న బూజు, చిందవందరగా మారిన గూళ్లు, అస్తవ్యస్తమైన వంటిల్లు.. ఇన్నిటి మధ్య ఎవరైనా 'హ్యాపీ వీకెండ్' అని విష్‌చేస్తే.. కాస్త నవ్వు, మరి కాస్త విరక్తీ ముంచుకొస్తాయి కదూ.!

Published : 26 Jun 2021 06:33 IST

ఉద్యోగం చేసే మహిళలం ఆదివారం వచ్చిందంటే వీకెండ్ పార్టీలకు వెళ్లాలనో, రోజంతా విశ్రాంతి తీసుకోవాలనో అనుకుంటాం. కానీ వారంనుంచీ పేరుకుపోయిన బట్టలు వెక్కిరిస్తూ కనిపిస్తాయి. ప్రతి ఆదివారం ఇల్లు క్లీన్ చేయాలనుకున్నా చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్న కారణంగా ఇంట్లో పేరుకున్న బూజు, చిందవందరగా మారిన గూళ్లు, అస్తవ్యస్తమైన వంటిల్లు.. ఇన్నిటి మధ్య ఎవరైనా 'హ్యాపీ వీకెండ్' అని విష్‌చేస్తే.. కాస్త నవ్వు, మరి కాస్త విరక్తీ ముంచుకొస్తాయి కదూ.! 

నిజమే మరి.. వారమంతా ఉద్యోగానికి వెళ్లే హడావుడిలో చేయలేకపోయిన పనులన్నీ వారాంతంలో ఓపిక లేకున్నా చెయ్యాల్సి వస్తుంది. ఈ పరిస్థితికి ఇక నుంచైనా చెక్ పెడదాం. మరి ఆదివారం, మనకోసమే కేటాయించుకోవాలంటే ఏం చెయ్యాలో.. ఎలా గడపాలో తెలుసుకుందామా..!

ప్రేమను మాత్రమే కాదు.. పని కూడా పంచాలి..!

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు ఇంట్లో ఎవరికి వీలున్న పని వారు చేయడం కొత్తేమీకాదు. కానీ అవతలి వారికి అప్పగించిన పని పర్ఫెక్టుగా లేదనో, ఆలస్యమవుతోందనో మనమే చేసేయడం మనలో చాలామంది చేసే పొరపాటే.. ఇకపై అలా చేయకండి. పెరిగిన వాతావరణం వల్లనో వ్యక్తిగత కారణాల వల్లనో కొంతమంది మగవారు ఇంటి పనులను చేయడంలో చొరవ చూపించలేరు. అలాంటప్పుడు వారికి కాస్త సమయం ఇవ్వండి. ఆలస్యంగా అయినా వారికి కేటాయించిన పనులు వారినే చేయనివ్వండి. స్కూలుకు వెళ్లే పిల్లలకూ ఇది వర్తిస్తుంది. ఇంటి పనులన్నీ ఒక్కరే చూసుకోడం వల్ల మీకు కలిగే ఒత్తిడి గురించి కుటుంబ సభ్యులకు చెప్పండి. ఏరోజు చేయాల్సిన పనులు ఆరోజు పూర్తయితే వారాంతంలో ఎలా సరదాగా గడపవచ్చో వివరించండి. అందరూ కలిసి ఇంటిపనులు చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లలు ఎటువంటి వాతావరణంలో అయినా సులభంగా సర్దుకుపోవడం నేర్చుకుంటారు. క్రమశిక్షణ అలవడుతుంది.

ఆదివారం ఎందుకు ముఖ్యమంటే...

ఆదివారం ఆనందంగా గడపడం వల్ల వారమంతా ఉత్సాహంగా పని చేయగలుగుతాం. పని ఒత్తిడిని క్రమంగా అధిగమించడమే కాకుండా పని సామర్థ్యం కూడా పెరుగుతుంది. తగినంత విశ్రాంతినివ్వడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఏవిషయంలో అయినా సరే పాజిటివ్‌గా ఆలోచించ గలుగుతాం . దీనివల్ల మానవ సంబంధాలు బలపడతాయి. అన్నిటికీ మించి మానసిక ఒత్తిడి వల్ల కలిగే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోగలుగుతాం. జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

హాయిగా నిద్రపోండి !

కావల్సినంత సేపు నిద్రపోండి..కానీ పగలు నిద్రపోవడం వల్ల రాత్రిళ్లు నిద్రపట్టని వారైతే మాత్రం ఆదివారం పగలంతా పడుకునే ఆలోచనని కాస్త వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఆదివారం పగలు నిద్ర పోవడం వల్ల ఆరోజు రాత్రి మేల్కోవాల్సి వస్తుంది. తెల్లవారి ఆఫీసులో ఆ నిద్రలేమి మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పగలంతా సరదాగా గడిపి, రాత్రి నిద్రకు వీలైనంత త్వరగా ఉపక్రమిస్తే మండే బ్లూస్‌ని అధిగమించవచ్చు.

సరదాగా స్టెప్పులేయండి..!

రోజంతా కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నవారు మంచి పాటలు వింటూ నాలుగు స్టెప్పులేయండి. ఆటలు ఆడే అలవాటు ఉన్నవారు ఆదివారాన్ని అందుకు కేటాయించండి. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే వారితో కలిసి ఆడుకుంటూ ఈ ఆదివారాన్ని ఆనందంగా గడపండి. పిల్లలతో అనుబంధం బలపర్చుకోడానికి ఇదొక మంచి అవకాశం. అంతే కాదు ఆటలాడటం వల్ల శారీరక శ్రమ కలిగి ఎండార్ఫిన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడు పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి.

ఫ్రెండ్స్‌తో సరదాగా...

ఇల్లు, ఆఫీసు, పని.. ఈ చక్రంలో ఇరుక్కుపోయి స్నేహితులను మర్చిపోయామని ఎన్నోసార్లు అనిపిస్తుంది కదూ.. మంచి స్నేహాలు అందమైన జీవితానికి గుర్తులు. మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే పలకరిస్తే స్నేహం కూడా ఓ వ్యాపార సంబంధం అవుతుంది. కాబట్టి ఈ ఆదివారం స్నేహితులను కలవండి.. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది కూడా నేరుగా కాకుండా.. వర్చువల్‌గా కలవడం, వారితో సరదాగా కాసేపు మాట్లాడడం మంచిది. జీవితాన్ని పాజిటివ్ కోణంలో చూడటానికి, మానసిక పరిణతితో నిర్ణయాలు తీసుకోడానికీ ఇది దోహదపడుతుంది.

నచ్చిన పుస్తకం చదివేద్దాం...

మంచి పుస్తకం చదవండి. పుస్తకాలు చదివే అలవాటు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది. సరదాగా చదివినా, అవసరంగా చదివినా ప్రతి పుస్తకం మనకు తెలియని ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తుంది.

అలాగే మీరు ఏ పనిచేసినా, బయటికి వెళ్లాల్సి వచ్చినా కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్