Published : 10/11/2022 21:25 IST

చలికాలంలో బరువు తగ్గాలంటే..

‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్‌నెస్‌ మంత్ర ఇది. అందుకోసమే ఇటు చక్కటి ఆహారం తీసుకుంటూనే.. అటు కఠినమైన వ్యాయామాలు చేయడానికీ వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గలేమేమో అని నీరసపడిపోకుండా.. జీవక్రియల పనితీరును ప్రేరేపించే ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే మసాలాలను మించిన పరమౌషధం లేదంటున్నారు. మరి, ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సహకరించే ఆ మసాలాలేవి? వాటితో బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది? రండి.. తెలుసుకుందాం..!

మసాలాలు.. వంటకాల్లో రుచిని నింపడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మంచివన్న విషయం తెలిసిందే! అయితే జీవక్రియల పనితీరును మెరుగుపరిచి మనల్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచే శక్తి వీటి సొంతం. అంతేకాదు.. శరీరంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి, అధిక బరువు తగ్గించడానికి, శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి.. ఇలా ఎన్నో రకాలుగా మసాలాలు మనకు మేలు చేస్తాయి.

పసుపులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్‌ గుణాలు; యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అలాగే శరీరంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించి త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది. అందుకే రోజూ పసుపును వంటకాల్లో భాగం చేసుకోవడంతో పాటు పసుపుతో తయారుచేసిన టీ, డీటాక్స్‌ వాటర్‌.. వంటి పానీయాలు తీసుకోవడం మంచిది.

చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణాలు దాల్చిన చెక్కలో బోలెడున్నాయి. ఇది జీవక్రియల పనితీరును వేగవంతం చేసి పదే పదే ఆకలేయడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా ఏది పడితే అది తినకుండా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా బరువూ తగ్గచ్చు. ఇందుకోసం ఉదయాన్నే పాలల్లో టేబుల్‌స్పూన్‌ దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి తీసుకోవచ్చు.

మిరియాలలో పైపెరిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడంతో పాటు జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తుంది. కాబట్టి మిరియాలతో చేసిన టీని ఉదయాన్నే తీసుకోవడం మంచిది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్న మిరియాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే దీర్ఘకాలంలో స్థూలకాయం బారిన పడకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు నిపుణులు.

చలికాలంలో శరీరంలో జీవక్రియల పనితీరు మందగించడం వల్ల కొవ్వు కరిగే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇదిలాగే కొనసాగితే కొవ్వు నిల్వలు పెరిగిపోయి క్రమంగా బరువు పెరుగుతాం. తద్వారా లేనిపోని అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే యాలకులు రోజూ తీసుకోవాల్సిందే! ఉదయం పూట తాగే టీలో యాలకులు వేసుకోవడం, నేరుగా వాటిని నమలడం, వంటకాల్లో భాగం చేసుకోవడం.. ఎలాగైనా తీసుకోవచ్చు. యాలకులు జీర్ణశక్తిని పెంచడంలోనూ సమర్థంగా పనిచేస్తాయి.

ఎండు మిర్చిలో ఉండే కాప్సైచిన్‌ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియల్ని వేగవంతం చేయడంతో పాటు గుండె ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది.

మెంతుల్లో గలాక్టోమనన్‌ అనే నీటిలో కరిగే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారపు కోరికల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువును అదుపులో ఉంచుతుంది. కాబట్టి పరగడుపునే గ్లాసు నీటిలో కాస్త మెంతి పొడిని కలుపుకొని తీసుకోవచ్చు.. లేదంటే రాత్రంతా మెంతులు నానబెట్టిన నీళ్లు తాగి.. ఆ మెంతుల్ని నమిలినా చక్కటి ఫలితం ఉంటుంది.

దీర్ఘకాలంలో స్థూలకాయం బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచే జీలకర్రను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. పరగడుపునే ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

సో.. ఇవండీ.. చలికాలంలో జీవక్రియల్ని వేగవంతం చేసి శారీరక బరువును తగ్గించడంలో సహాయపడే కొన్ని మసాలాలు! అయితే వీటిని మరీ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి ఏది ఎంత మోతాదులో వాడాలో ఒక్కసారి నిపుణుల్ని అడిగి తెలుసుకుంటే మరిన్ని మంచి ఫలితాల్ని సొంతం చేసుకోవచ్చు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని