బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి!

రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషక విలువలున్న అల్పాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనానికి అలవాటు పడి చాలామందికి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది. ఈ సమస్యను అధిగమించాలంటే తక్కువ సమయంలోనే ఈజీగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌ను రడీ చేసుకుంటే సరిపోతుంది.

Updated : 23 Jun 2021 13:09 IST

రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషక విలువలున్న అల్పాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనానికి అలవాటు పడి చాలామందికి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది. ఈ సమస్యను అధిగమించాలంటే తక్కువ సమయంలోనే ఈజీగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌ను రడీ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి వారికి పోహా చక్కని ప్రత్యామ్నాయం.

20 నిమిషాల లోపే రడీ!

ఇడ్లీ, పూరీ, వడ, దోశ... సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్‌ అంటే ఇవే మన మదిలో మెదులుతాయి. అయితే ఈ వంటకాలను తయారుచేసుకోవాలంటే కుకింగ్‌కు సంబంధించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిందే. పైగా వీటిని రడీ చేయాలంటే కొంచెం సమయం కూడా పడుతుంది. ఈ క్రమంలో వంటగదిలో ఇప్పటివరకు గరిటె తిప్పనివారు కూడా ఎంతో సులభంగా పోహా (అటుకులతో చేసే వంటకం) ను తయారుచేసుకోవచ్చు. మరాఠీల సంప్రదాయ వంటకమైన దీనిని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇష్టపడి తింటారు. ఇతర వంటకాలతో పోల్చితే కేవలం 20 నిమిషాల లోపే ఎంతో సులభంగా పోహాను తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని తీసుకోవడం వల్ల ఫైబర్‌, ఐరన్‌ లాంటి పోషకాలు శరీరానికి అందుతాయి.

పోహా

కావాల్సిన పదార్థాలు

అటుకులు - 2 కప్పులు

కరివేపాకు- 3 నుంచి 4 రెబ్బలు

వెల్లులి- 3 నుంచి 4 రెబ్బలు

అల్లం

కొన్ని కొత్తిమీర ఆకులు

పల్లీలు - సరిపడినన్ని

క్యారట్ -1 (మీడియం సైజు)

బంగాళాదుంప- 1 (మీడియం సైజు)

ఉల్లిపాయలు -2 (మీడియం సైజు)

యాలకులు- 2 నుంచి 3

లవంగాలు- 2 నుంచి 3

దాల్చిన చెక్క

జీడిపప్పు

ఎండుద్రాక్ష

కొద్దిగా నిమ్మరసం

పసుపు- 2 టీస్పూన్లు

జీలకర్ర- అర టీస్పూన్

ఆవాలు- అర టీస్పూన్

పచ్చిమిర్చి- 2 నుంచి 3

ఉప్పు - ఒక టీ స్పూన్‌ (రుచికి సరిపడా)

నల్ల మిరియాలు- 2 టీ స్పూన్లు

(గమనిక : ఇష్టమైన వారు క్యాప్సికమ్, బీట్ రూట్ వంటి వాటిని కూడా కలుపుకోవచ్చు)

తయారీ విధానం

ముందుగా అటుకులను నీటిలో బాగా కడగాలి. ఆ తర్వాత ఓ పాత్రలోకి వాటిని వడపోసి సుమారు 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె పోసి ఆవాలు, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇందులోకి ఉల్లిపాయలను కూడా జత చేసి బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించాలి. ఆ తర్వాత క్యారట్‌, బంగాళాదుంప ముక్కలు, అల్లం, వెల్లుల్లి, నల్లమిరియాలు, పసుపు, ఉప్పు మొదలైన వాటిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత లవంగాలు, యాలకులు, జీడిపప్పు, ఎండుద్రాక్షలను కూడా జోడించి బాగా మిక్స్‌ చేయాలి. రెండు నిమిషాల తర్వాత కొద్దిగా నీరు పోసి ప్యాన్‌పై మూత పెట్టాలి. కూరగాయలు బాగా ఉడికేంత వరకు సుమారు 5-6 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న అటుకులను మిక్స్‌ చేసి సుమారు 4-5 నిమిషాల పాటు మంటపై ఉంచాలి. ఆ తర్వాత కిందకు దించి నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే రుచికరమైన పోహా సిద్ధం!!

 

‘పోహా’తో శరీరానికి అందే పోషకాలివే!

* తక్కువ క్యాలరీలు, కొవ్వులుండే పోహాను ఆహారంలో చేర్చుకుంటే అధిక బరువు సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.

* ఇందులో గ్లూటెన్‌ ఉండదు... కాబట్టి డయాబెటిస్ బాధితులు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.

* పోహాలో పుష్కలంగా ఉండే ఫైబర్‌ ఆకలి కోరికలను అదుపు చేస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.

* పోహాలో కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి.

* ఐరన్‌తో నిండి ఉండే దీనిని గర్భిణీలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యల నుంచి బయటపడవచ్చు.

* వేరుశెనగ, చిక్కుళ్లతో కలిపి దీనిని తీసుకుంటే ఎక్కువశాతం ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

* అటుకులు త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఇది ఉత్తమ ఆహారం.

చూశారుగా... పోహాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..! పైగా తక్కువ సమయంలోనే ఎంతో సులభంగా దీనిని తయారుచేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ టేస్టీ పోహాను ట్రై చేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్