ఎవరెస్ట్ పైన స్టాండప్ కామెడీ..!
పర్వతారోహకులు తమ జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్ట్‌ను అధిరోహించాలనుకుంటారు. కానీ, కొంతమంది మాత్రమే తమ కలను సాకారం చేసుకుంటారు. అయితే చాలామంది ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు చేరుకొని సంతృప్తి పడుతుంటారు. కానీ, కామెడీ ప్రదర్శనలు ఇచ్చే ఇద్దరు...
(Photos: Instagram)
పర్వతారోహకులు తమ జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్ట్‌ను అధిరోహించాలనుకుంటారు. కానీ, కొంతమంది మాత్రమే తమ కలను సాకారం చేసుకుంటారు. అయితే చాలామంది ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు చేరుకొని సంతృప్తి పడుతుంటారు. కానీ, కామెడీ ప్రదర్శనలు ఇచ్చే ఇద్దరు బ్రిటిష్ మహిళలు ఎల్లీ గిబ్సన్, హెలెన్ థోర్న్ ఇందుకు భిన్నంగా ఆలోచించారు. వారు పర్వతారోహకులు కాకపోయినా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌పై కామెడీ ప్రదర్శన ఇవ్వాలనుకున్నారు. ఇందుకోసం నెలల తరబడి శిక్షణ తీసుకుని మరీ తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో కామెడీ ప్రదర్శన ఇచ్చిన మహిళలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...
కామెడీ కలిపింది ఇద్దరినీ..!
ఇంగ్లాడ్‌కు చెందిన ఎల్లీ గిబ్సన్, ఆస్ట్రేలియాకు చెందిన హెలెన్ థోర్న్‌లది భిన్న నేపథ్యం. అయినా స్టాండప్ కామెడీ వీరిద్దరినీ కలిపింది. ఇద్దరూ తమ జీవితంలో కఠినమైన సవాళ్లు ఎదుర్కొన్న వారే. వీరి అభిప్రాయాలు కలవడంతో 2013 నుంచి ‘ది స్కమ్మీ మమ్మీస్’ పేరుతో స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరిద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు 250కి పైగా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లు చేశారు. వీరి ప్రదర్శనలు ఎక్కువ భాగం నేటి తరం తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించే ఉంటాయి. కేవలం ప్రదర్శనలు మాత్రమే కాకుండా వీరిద్దరూ 2017లో ‘స్కమ్మీ మమ్మీస్’ పేరుతో ఒక బుక్ కూడా రాశారు. ఆ ఏడాది ఈ బుక్ అమెజాన్ టాప్ 20 పుస్తకాల్లో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
వారికి సహాయం అందించడానికి..
ఈ జంట తమ ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బును ఎక్కువ భాగం స్వచ్ఛంద సంస్థలకు విరాళాలుగా ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ‘Borne UK’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వడం కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మీద స్టాండప్ కామెడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటుంది. గిబ్సన్ కొడుకు జోయ్ కూడా నెలల నిండక ముందే పుట్టాడు. దాంతో ఆమె పలు సమస్యలను ఎదుర్కొంది.
చలిని తట్టుకుని..
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ వాతావరణం విభిన్నంగా ఉంటుంది. దాదాపు మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుంటాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితిని తట్టుకోవాలంటే ముందుగానే సంసిద్ధం కావాలి. ఇందుకోసం వీరిద్దరూ నెలల తరబడి శిక్షణ తీసుకున్నారు. అంతేకాకుండా నేపాల్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి కూడా పొందారు. అలా కఠిన పరిస్థితులను దాటుకుని ఇటీవలే దాదాపు 100 మంది ముందు అరగంట పాటు ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో కామెడీ ప్రదర్శన ఇచ్చిన మహిళలుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. తద్వారా 15 వేల యూరోలను సేకరించారు. అంటే మన కరెన్సీలో దాదాపు 13.5 లక్షలన్నమాట. ఈ మొత్తాన్ని వారు ‘Borne UK’ సంస్థకు ఇవ్వనున్నారు.
ఈ రికార్డు గురించి గిబ్సన్ మాట్లాడుతూ ‘ఇది కఠినమైన ప్రదర్శన. అంత సులభంగా జరగలేదు. కానీ, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. మొత్తం నిశ్శబ్ద వాతావరణం. చంద్రుని వెన్నెలతో గ్లేసియర్ మరింత ప్రకాశవంతంగా మెరిసింది. మరో గ్రహం మీద ఉన్నామా? అన్న అనుభూతి కలిగింది’ అని చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.